హోటల్ లో భారీ అగ్నిప్రమాదం: ఏమీ మిగల్లేదు.. అత్యవసర మార్గం లేకపోయి ఉంటే!
ఇండోర్: మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓ హోటల్ లో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటల బారిన పడి హోటల్ సుమారు 60 శాతం వరకు కాలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించిందా? లేదా? అనేది ఇంకా తెలియరాలేదు. మంటలు చెలరేగిన వెంటనే హోటల్ సిబ్బంది అందులో ఉన్న వారిని హుటాహుటిన అత్యవసర మార్గం గుండా బయటికి తరలించినట్లు చెబుతున్నారు. మంటలు చెలరేగిన సమాచారం అందుకున్న వెంటనే నాలుగు అగ్నిమాపక దళాలు సంఘటనాస్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకొస్తున్నాయి.
కెమికల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఈ ఉదయం 9 గంటల సమయంలో హోటల్ లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో విస్తరించాయి. హోటల్ ముందు భాగం మొత్తం మంటల్లో కాలి బూడిదైంది. రిసెప్షన్ కార్యాలయం, సోఫాలు, ఇతర ఫర్నిచర్ సామాగ్రి మొత్త మంటల బారిన పడింది. ప్రమాద సమయంలో హోటల్ లో ఎంతమంది ఉన్నారనే విషయంపై స్పష్టత రాలేదు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మంటలు శరవేగంగా విస్తరించడానికి అసవరమైన సామాగ్రి హోటల్ లో ఉండటం వల్లే క్షణాల్లో అగ్నికీలలు వ్యాపించాయని చెబుతున్నారు. అగ్నిని ఆర్పివేయడానికి అవసరమైన పరికరాలు ఉన్నప్పటికీ.. అవి కూడా మంటల బారిన పడ్డాయి.

మంటలు చెలరేగడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం చోటు చేసుకుని ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. హోటల్ వంటగది నుంచి పెద్ద ఎత్తున పొగలు వచ్చాయని, ఆ తరువాత భగ్గుమంటు మంటలు అంటుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వంటగదిలో షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకోవడం గానీ లేదా సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావడం గానీ ఈ ప్రమాదానికి కారణాలు కావచ్చని చెబుతున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తరువాతే.. దీనికి గల కారణాలపై స్పష్టత వస్తుందని ఇండోర్ నగర డీసీపీ వెల్లడించారు.
Indore fire in golden gate hotel...#Fire pic.twitter.com/CcDoyteHsC
— Nikhil Choudhary (@NikhilCh_) October 21, 2019
మహారాష్ట్రలో గోడౌన్ లో..
ఇదిలావుండగా.. మహారాష్ట్రలోని భివండీలోనూ ఇదే తరహా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భివండీలోని ఓ భారీ గోడౌన్ లో ఈ ఉదయం మంటలు చెలరేగాయి. గోడౌన్ లో భద్రపరిచిన సామాగ్రి మొత్తం మంటల్లో చిక్కుకుంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. మంటలు చెలరేగడానికి ముందు స్వల్పంగా పేలుడు శబ్దం వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఒకవంక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో.. మరోవంక భారీ ఎత్తున మంటలు చెలరేగిన ఘటనతో పోలీసు యంత్రాంగం ఉలిక్కి పడింది. అగ్నిమాపక బలగాలు సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను నియంత్రిస్తున్నాయి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!