లవ్ జిహాద్: ప్రేమించి మతం మారాలంటూ బెదిరింపు, యూపీలో తొలి అరెస్ట్
లక్నో: బలవంతపు మతమార్పిడికి వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చిన కొద్ది రోజులకే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో ఓ ముస్లిం యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. లవ్ జిహాద్‌పై మొదటి దావా డియోరానియా పోలీస్ స్టేషన్ నమోదైన ఐదు రోజుల తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసి, జైలుకు పంపారు.

హిందూ యువతిని ప్రేమించి మతం మార్చుకోవాలని..
ఓ హిందూ యువతితో సంబంధం ఏర్పరచుకున్న 21ఏళ్ల ముస్లిం యువకుడు.. ఆమెను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చేందుకు ప్రయత్నించాడు. కరోనా లాక్డౌన్ సమయంలో యువతి తండ్రి ఆమెకు మరొకరితో వివాహం చేశాడు.

చంపుతానంటూ బెదిరింపులు
పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. నిందితుడు ఆ యువతిని నవంబర 28న హత్య చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో నిందితుడిపై యూపీ బలవంతపు మార్పిడి వ్యతిరేక చట్టం సెక్షన్ 3/5, సెక్షన్ 504, ఇండియన్ పీనల్ కోడ్ 506 సెక్షన్ల కింద బుధవారం నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఇంఛార్జీ ఎస్ఎస్పీ డాక్టర్ సన్సర్ సింగ్ ఈ మేరకు వివరాలను వెల్లడించారు.

లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా యూపీ కొత్త చట్టం
లవ్ జిహాద్ పేరుతో వివాహాల కోసం బలవంతపు మత మార్పిళ్లను ప్రోత్సహించడాన్ని నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం నవంబర్ 24న అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్‌కు యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆమోదం తెలిపారు.
ఈ ఆర్డినెన్స్ ప్రకారం.. బలవంతపు మత మార్పిడికి పాల్పడితే 10 సంవత్సరాల జైలు శిక్షతోపాటు, రూ. 50 వేల జరిమానా విధిస్తారు. ఆ మహిళకు రూ. 5 లక్షల పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది.

పెళ్లి తర్వాత మతమార్పిడి చేస్తే..
వివాహానంతరం మత మార్పిడి జరిపితే జైలు శిక్ష, జరిమానా విధించడంతోపాటు ఆ విహాన్ని కూడా రద్దు చేయడం జరుగుతుంది. అయితే, ఒకవేళ వివాహం తర్వాత ఏ మహిళ అయినా మతం మార్చుకోవాలని భావిస్తే చట్టపరంగా ముందుకు వెళ్లాలి. జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. యూపీతోపాటు పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ చట్టాన్ని తెచ్చేందుకు కసరత్తులు చేస్తున్నాయి.