ISRO: మారిన వేదిక..వాహకనౌక: శ్రీహరికోటను కాదని: జీశాట్ ప్రయోగం:.నింగిలోకి దూసుకెళ్లి.. !
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. తన కొత్త ఏడాదిని విజయవంతంగా ఆరంభించింది. ఈ ఏడాది తొలిసారిగా ప్రయోగించిన జీశాట్-30 ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపించింది. నిర్దేశిత సమయానికి కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగింది. టెలికమ్యూనికేషన్ల వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయోగించిన ఉపగ్రహం ఇది. ఈ ప్రయోగంలో ఓ చిన్న మార్పు చోటు చేసుకుంది.
ISRO: శ్రీహరికోటకు ఇస్రో గుడ్ బై చెబుతుందా? తమిళనాడులో మరో ప్రయోగ కేంద్రం..!

శ్రీహరికోట నుంచి కాకుండా..
సాధారణంగా ఏ ఉపగ్రహన్నయినా నెల్లూరుజిల్లాలోని శ్రీహరికోట నుంచి ప్రయోగించడం ఇస్రో అలవాటు. ఈ సారి జీశాట్-30 ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి కాకుండా.. ఫ్రెంచ్ గుయానా నుంచి ప్రయోగించింది ఇస్రో. ఫ్రెంచ్ గుయానాలోని కౌరు ప్రయోగ కేంద్రం నుంచి ఈ తెల్లవారు జామున 2:35 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది ఈ ఉపగ్రహం. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) కాకుండా అరియానె-5 అనే వాహకనౌకను ఉపయోగించింది.
ఫ్రెంచ్ టెలికం కంపెనీతో కలిసి..
ఫ్రెంచ్ టెలికం సంస్థ యుటెల్‌శాట్ తో కలిసి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది ఇస్రో. నింగిలోకి దూసుకెళ్లిన 38 నిమిషాల 25 సెకెన్ల తరువాత అరియానె-5 నౌక నుంచి విజయవంతంగా విడివడింది. జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశించింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ఛైర్మన్ కే శివన్, ఫ్రెంచ్ గుయానా స్పేస్ స్టేషన్ సీఈఓ స్టెఫానె ఇజ్రాయెల్ వేర్వేరు ప్రకటనల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

టెలికం వ్యవస్థను బలోపేతం..
టెలికమ్యూనికేషన్ల వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయోగించిన ఈ జీశాట్-30 ఉపగ్రహం బరువు 3,357 కేజీలు. ఇదివరకు ఇస్రో ప్రయోగించిన ఇన్శాట్/జీశాట్ ఉపగ్రహాల పరంపరలో చేపట్టిన ప్రయోగమే ఇది. 12 సీ, 12 కేయు బ్యాండ్ ట్రాన్స్‌పాండర్స్‌ను ఈ ఉపగ్రమానికి అమర్చారు. ఇప్పటికే అంతరిక్షం నుంచి సేవలను అందిస్తోన్న ఇన్శాట్-4ఎ స్పేస్ ఎయిర్‌క్రాఫ్ట్ కాల పరిమితి ముగిసింది. దీనికి రీప్లేస్ చేయడానికి జీశాట్-30ని ప్రయోగించినట్లు శివన్ వెల్లడించారు.
15 సంవత్సరాలు ఢోకా లేనట్టే..
ఈ ప్రయోగం ద్వారా మరో 15 సంవత్సరాల పాటు టెలికమ్యూనికేషన్ల వ్యవస్థకు ఎలాంటి ఢోకా ఉండబోదని శివన్ వెల్లడించారు. జీశాట్-30 వల్ల డీటీహెచ్, టెలివిజన్ అప్‌లింక్స్, వీశాట్ సేవలు యథాతథంగా కొనసాగుతాయి. పైగా- అత్యాధునిక ట్రాన్స్పాండర్లను అమర్చడం వల్ల మనదేశంతో పాటు గల్ఫ్, ఆస్ట్రేలియా, పలు ఆసియా దేశాలపైనా దీని ప్రభావం ఉంటుంది. ఈ ప్రయోగానికి ఇస్రో తరఫున యుఆర్ రావు ఉపగ్రహ కేంద్రం డైరెక్టర్ పీ కున్హికృష్ణన్‌తో కూడిన ప్రతినిధుల బృందం ఫ్రెంచ్ గుయానాకు వెళ్లింది.