ప్రధాని మోదీకి అత్యాధునిక విమానం - అమెరికా తయారీ బోయింగ్ బీ777 - ఢిల్లీకి ఎయిర్ ఇండియా వన్
అమెరికా అధ్యక్షుడు అధికారిక ప్రయాణాల కోసం వాడే 'ఎయిర్ ఫోర్స్ వన్' తరహాలోనే.. భారత్ లోని వీవీఐపీల కోసం అత్యాధునిక హంగులు, విలాసవంతమైన సౌకర్యాలు, భద్రతతో కూడిన 'ఎయిర్ ఇండియా వన్' ఎట్టకేలకు ఢిల్లీకి చేరింది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత విమాన తయారీ సంస్థ బోయింగ్.. బోయింగ్-777 ఈఆర్ శ్రేణి రకంతో 'ఎయిర్ ఇండియా వన్'ను రూపొందించింది.
అట్టుడుకుతోన్న హత్రాస్:144 సెక్షన్ - సరిహద్దులు మూసివేత - రాహుల్, ప్రియాంక రాక - బీజేపీ ఎదురుదాడి

బోయింగ్-777 ఈఆర్..
అమెరికా అధ్యక్షుడు వినియోగించే 'ఎయిర్ఫోర్స్ వన్' విమానం తరహాలోనే రెండు బోయింగ్ -777 ఈఆర్ విమానాలకు భారత్ గతంలో ఆర్డర్ ఇచ్చింది. వీటిలో ఒక విమానమే ఇవాళ ఢిల్లీకి చేరింది. అమెరికాలోని టెక్సాస్ నుంచి బయలుదేరిన ఈ విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి గురువారం సాయంత్రం చేరింది. వీవీఐపీలైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రులు ఇకపై బీ 777 విమానాల్లో మాత్రమే ప్రయాణిస్తారు.

ఏకధాటిగా 17 గంటలు..
నిజానికి బోయింగ్ -777 విమానం ఆగస్టులోనే అందాల్సి ఉండగా, పలు కారణాలతో ఆలస్యమైంది. ఈ విమానానికి అన్ని పరీక్షలు కూడా ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికత, సౌకర్యాలు కలిగిన 'ఎయిర్ ఇండియా వన్' విమానం ఏకధాటిగా 17 గంటల పాటు ప్రయాణిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని ప్రయాణాల కోసం ‘ఎయిర్ ఇండియా వన్' పేరుతో ఉన్న బీ 747 విమానాలను వినియోగిస్తున్నారు. వీవీఐపీ ప్రయాణాలు లేని సమయాల్లో ఈ విమానాలు సాధారణ వాణిజ్య ప్రయాణాలకు కూడా వినియోగిస్తున్నారు.

వీవీఐపీ విమానం ధర ఎంతంటే..
బీ 777 విమానాల్లో ‘లార్జ్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ఫ్రారెడ్ కౌంటర్ మెజర్స్(ఎల్ఏఐఆర్సీఎం) పేరుతో అత్యాధునిక క్షిపణి నిరోధక వ్యవస్థ, సెల్ఫ్ ప్రొటెక్షన్ స్వీట్స్(ఎస్పీఎస్) ఉంటాయి. ఇందులోని ఈడబ్ల్యూ జామర్.. శత్రువు రాడార్ సిగ్నల్స్ ను, ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ను బ్లాక్ చేస్తుంది. ఇది పూర్తి మిర్రర్ బాల్ వ్యవస్థను కలిగి ఉంటుంది. అంతేకాదు, అత్యంత ఆధునిక సురక్షితమైన ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా బీ777లో పొందుపర్చారు. దీని ద్వారా ప్రధాని ప్రపంచంలో ఏ మూలనున్న వ్యక్తులతోనైనా మాట్లాడవచ్చు. భారత్ కొనుగోలు చేసిన రెండు విమానాల్లో ఒకటి ప్రధానికి, రెండోది రాష్ట్రపతికి వాడనున్నారు. ఈ విమానం ఒక్కోదాని ధర రూ. 8458 కోట్లని అంచనా.