చేపల లారీ బోల్తా .. పండుగ చేసుకున్న జనాలు ... సోషల్ మీడియాలో చర్చ
కొనుక్కొని తిన్న దానికంటే, ఫ్రీగా వచ్చిన దాన్ని తినడంలో మహా సంతోషం ఉంటుందని చాలామంది ఫీలవుతారు. ఇక అలాంటి పరిస్థితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లోని అర్మాపూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఓ చేపల లారీ బోల్తా పడితే ఆ లారీలో ఉన్న మనుషులకు ఏమైనా దెబ్బ తగిలిందా? హాని కలిగిందా? అన్నవి పట్టించుకోకుండా ఎంచక్కా సంచులు తెచ్చుకొని చేపలు తీసుకెళుతున్న ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యూపీలో చేపల లారీ బోల్తా ... చేపల కోసం ఎగబడిన జనాలు
యూపీలో అర్మాపూర్ ప్రాంతంలో రహదారిపై చేపల లారీ బోల్తా పడిన వెంటనే ఆ లారీ లో ఉన్న చేపలు రోడ్డు మీద పడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల చేపలు , అందులోనూ అన్ని బ్రతికే ఉన్న చేపలు రోడ్డు మీద పడడంతో జనాలు ఉరుకులు పరుగులు పెట్టడం మొదలు పెట్టారు. దొరికిన వాటిని దొరికినట్టుగా చేపల సంచీలో వేసుకుని పరుగులు తీస్తున్నారు.పెద్ద పెద్ద గోనె సంచులు పట్టుకొచ్చి మరి చేపల తీసుకెళ్తున్న ఘటన అక్కడ చోటు చేసుకుంది.

వాహనరాకపోకలు సైతం లెక్కచెయ్యకుండా రోడ్డుపై చేపల వేట .. ట్రాఫిక్ జామ్
టన్నుల కొద్ది చేపల రోడ్డు మీద పడడంతో రోడ్ మీద వాహనాల రాకపోకలను సైతం లెక్కచేయకుండా, వాటికి అడ్డుపడుతూ మరీ చేపల కోసం పోరాటం సాగించారు జనాలు. బకెట్లు, సంచులు, షాపింగ్ బ్యాగ్స్ ఇలా ఏది దొరికితే అది తీసుకుని చేపలు పోగేసుకునే పనిలో పడ్డారు. వీరిని అడ్డుకుని రహదారి మీద ట్రాఫిక్ ను క్లియర్ చెయ్యాల్సిన పోలీసులు కూడా బ్యాగ్స్ పట్టుకొచ్చి చేపలు జమ చేసుకునే పనిలో పడ్డారు. దీంతో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

వైరల్ అవుతున్న వీడియో .. మిశ్రమ స్పందన
ఇక రోడ్డు మీద పడిన చేపలను ఎగబడి మరీ జనాలు తీసుకు వెళ్లడం వీడియో చూసిన జనాలు షాక్ అయ్యారు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయిన పట్టుకు పోయే మనోళ్లకు చేపల లారీ బోల్తా ఘటనతో నాలుగైదు రోజులపాటు సుష్టుగా భోజనం చేయడానికి చేపల కూర దొరికినట్టే అయ్యింది. రోడ్డు మీద ట్రాఫిక్ ను ఆపి మరి చేపల కోసం ఎగబడిన జనాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దీనిపై జనాల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు దీన్ని ఫన్నీ గా తీసుకుంటే, మరికొందరు చేపల కోసం ఎగబడిన జనాల తీరుకు ఆందోళన వ్యక్తం చేశారు .

ఫ్రీగా ఏది దొరికినా తాపత్రయపడే స్వభావం చాలా డేంజర్ అంటున్న నిపుణులు
ఏదేమైనా ఇలాంటి ఘటనలు మనుషుల నైజాన్ని తేటతెల్లం చేస్తాయి.ఇలాంటి ఘటనలు గతంలోనూ చాలానే చోటు చేసుకున్నాయి. బీర్ల లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడితే బీర్ బాటిళ్ళు పట్టుకువెళ్ళటం, ఆయిల్ లారీ బోల్తా పడితే బక్కెట్ల కొద్దీ ఆయిల్ తీసుకెళ్లటం ఇలా ఎన్నో ఘటనలు గతంలోనూ వైరల్ అయ్యాయి. ఇవే కాదు ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా అక్కడ ప్రమాదానికి గురైన వారి పరిస్థితి పక్కన పెట్టి ఏం తీసుకెళ్లవచ్చు , మొత్తం మనమే ఎలా తీసుకెళ్ళాలి అన్న ఆలోచనలు చేసేవారు బాగా ఎక్కువైపోయారు. అయితే మనుషుల్లో ఉండే ఈ నైజం చాలా డేంజర్ అని మానసిక నిపుణుల అభిప్రాయం .
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!