ఐదు రాష్ట్రాల ఎన్నికల వాయిదా లేనట్లే- వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచాలని కోరిన ఈసీ
త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఓమిక్రాన్ వైరస్ ప్రభావం పడుతోంది. ఎన్నికలు జరగాల్సిన యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ లో ప్రచారం పతాకస్ధాయికి చేరడం, అదే సమయంలో కరోనా కేసులు పెరుగుతుండటం కేంద్రం, ఈసీతో పాటు అందరినీ కలవరపెడుతోంది. గతంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో సెకండ్ వేవ్ వచ్చి దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో ఈసారి కూడా ధర్డ్ వేవ్ ముప్పుకు ఈ ఎన్నికలు కారణమవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో వాటిని వాయిదా వేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటం, ఆయా రాష్ట్రాలకు నేతల రాకపోకలు పెరగడం, ఇదే పరిస్ధితి కొనసాగితే ధర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉండటంతో ఈ డిమాండ్లకు మద్దతు కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈసీపై ఒత్తిడి నెలకొంది. దీంతో ఈసీ కూడా దీనిపై తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖతో సమీక్ష నిర్వహించింది. తాజా పరిస్ధితిని తెలుసుకున్న ఈసీ వర్గాలు.. ఆయా రాష్టాల్లో వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖను కోరాయి. దీంతో ఇప్పుడు కేంద్రం ఆ పనిలో బిజీగా ఉంది.

గోవా, ఉత్తరాఖండ్‌లో పర్యటించిన తర్వాత, దేశంలోని కోవిడ్ పరిస్థితిపై చర్చించడానికి ఎన్నికల కమిషన్ ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్‌ను కలిసింది. టీకాలు వేయడం, ఐదు పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ఓమిక్రాన్ వ్యాప్తి వంటి అనేక అంశాలపై కమిషన్ ఇన్పుట్లను తీసుకుంది. అలాగే ఎన్నికల ప్రచారం, పోలింగ్ రోజులు మరియు కౌంటింగ్ రోజులలో దాని కోవిడ్-19 ప్రోటోకాల్‌ను మెరుగుపరచడంపై సూచనలను కోరింది.
.మరోవైపు ఉత్తరాఖండ్, గోవా వంటి కొన్ని రాష్ట్రాలలో, మొదటి డోస్ టీకా కవరేజ్ దాదాపు 100% (వయోజన జనాభాలో) ఉంది. ఉత్తరప్రదేశ్‌లో, వ్యాక్సినేషన్ సంఖ్య 85%కి దగ్గరగా ఉండగా, మణిపూర్ మరియు పంజాబ్‌లలో ఇది దాదాపు 80%గా ఉంది. దీన్ని 100 శాతానికి చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.