రేడియో మిర్చికి కేంద్ర ప్రభుత్వం నోటీసులు
న్యూఢిల్లీ: రేడియో మిర్చికి కేంద్ర సమాచార శాఖ నోటీసులు జారీ చేసింది. ఎఫ్ఎం రేడియో ఛానెల్ ఈ మధ్య నిర్వహించిన మత్ ఆవో ఇండియా ప్రచారంపై కేంద్ర సమాచార శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఛానెల్ యాజమాన్యానికి నోటీసులు పంపింది.
స్విస్ జంటపై దాడి అనంతరం భారత్కు రావొద్దని విదేశీ పర్యాటకులకు సూచిస్తూ మత్ ఆవో ఇండియా పేరిట సోషల్ మీడియాలో రేడియో మిర్చి ప్రచారం నిర్వహించింది. తొలుత కాస్త మంచి స్పందన వచ్చినట్లు కనిపించింది. అయితే రాను రాను తీవ్ర విమర్శలు చెలరేగాయి. దేశ గౌరవాన్ని కించపరిచేలా ఉందంటూ రేడియో మిర్చిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీంతో రేడియో మిర్చి వెనక్కితగ్గింది. చివరకు క్షమాపణలు కూడా చెప్పింది.

జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత క్షమాపణలు చెబితే ప్రయోజనం ఏమిటని కేంద్రం భావించింది. ఈ విషయమై రేడియో మిర్చిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది.ప్రసారాల చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించటం.. దేశ ఖ్యాతికి భంగం కలిగించటంతోపాటు విదేశీ టూరిస్టులను నిరుత్సాహపరిచేలా ఈ ఉద్యమం నిర్వహించారని పేర్కొంది.
పదిహేను రోజుల్లోగా స్పందించాలంటూ నోటీసుల్లో పేర్కొంది. వివరణ స్పష్టంగా లేకపోతే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ నోటీసులు అక్టోబర్ 27నే అందినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఆగ్రహంతో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో అమీర్ ఖాన్ అతిథి దేవోభవ విషయంలో కూడా ఇంచు మించు ఇలాంటి విమర్శలే వచ్చాయి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!