meera kumar congress sushil kumar shinde bjp ramnath kovind మీరా కుమార్ కాంగ్రెస్ సుశీల్ కుమార్ షిండే బీజేపీ రామ్ నాథ్ కోవింద్ విపక్ష పార్టీలు
బీజేపీకి ఇలా దీటుగా జవాబు?: రామ్‌నాథ్‌కు ప్రత్యర్థిగా మీరా కుమార్ / షిండే
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో దళిత అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌ను ప్రకటించిన బీజేపీ విసిరిన సవాలుకు అదే రూట్లో సమాధానమివ్వడానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అందుకోసం దళిత అభ్యర్థినే రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆ క్రమంలో లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, హోం శాఖ మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే పేర్లు తెరపైకి వచ్చాయి. ఇద్దరూ దళిత నాయకులే కావడంతో.. రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ప్రకటించిన కొన్ని ప్రతిపక్షాల్ని తమ వైపు తిప్పుకునేలా ఈ ఎత్తుగడను అనుసరిస్తున్నట్లు సమాచారం.
ప్రత్యేకించి రామ్ నాథ్ కోవింద్ అభ్యర్థిత్వానికి బీఎస్పీ అధినేత మాయావతి, బీహార్ సీఎం నితీశ్‌కుమార్ మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయి. బీహార్‌కు చెందిన మీరాకుమార్ మాజీ ఉపప్రధాని, ప్రముఖ దళిత ఉద్యమ నాయకుడు బాబూ జగ్జీవన్‌రామ్ కుమార్తె. ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా 1978లో జనతా పార్టీ ప్రయోగ సమయంలో ఆమెకు దన్నుగా నిలిచిన నేత అయినా.. చివరి దశలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ముందుకు వచ్చారు.
1978లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ తరఫున పోటీ చేసిన వారిలో యంగ్‌టర్క్‌లు, సోషలిస్టులు, జన్ సంఘ్ సభ్యులు కూడా ఉన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ రాకతో విపక్షాల కూటమి జనతా పార్టీకి నైతిక బలం లభించింది. ఆయన బీహార్ నుంచి ఎదిగి వచ్చిన విలువలు గల నేత.

రామ్‌నాథ్ ఎంపికపై విపక్షాల్లో ఆత్మరక్షణ
జగ్జీవన్ రామ్ కూతురు మీరా కుమార్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఖరారుచేస్తే బీజేపీ తప్పనిసరిగా ఆత్మరక్షణలో పడుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి స్పందిస్తూ సుశీల్ కుమార్ షిండే, మీరా కుమార్ అభ్యర్థుల్లో ఒకరైతే మంచి పోటీ అవుతుందని తెలుస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంటే మిగతా పార్టీల అభ్యర్థులను ఎంచుకుంటే మంచిదని సూచించారు. బీజేపీ ఎంపి ఉదిత్ రాజ్ మాట్లాడుతూ రామ్‌నాథ్ కోవింద్ ఎంపికపై తమ పార్టీ నాయకత్వంపై ఒత్తిడి లేదన్నారు.

అదే బాటలో మాయావతి
గవర్నర్‌గా రామ్‌నాథ్ కోవింద్ తో ఇప్పటివరకు కొనసాగిన సంబంధాల కారణంగా ఆయన అభ్యర్థిత్వానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ మద్దతు తెలిపే సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ బీహార్ నాయకురాలు కావడంతో మీరాకుమార్ అభ్యర్థిత్వానికి బీహార్ సీఎం నితీశ్ మద్దతు తెలిపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే ఆశలో కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్నది. విపక్షాలు రామ్ నాథ్ కంటే సమర్థుడైన దళిత నాయకుడ్ని ఎంపిక చేస్తే తప్ప బీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ అభ్యర్థిత్వాన్ని మద్దతు ఇవ్వలేమని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి పేర్కొనడం గమనార్హం.

ఎస్ కే షిండే అభ్యర్థిత్వానికి శివసేన మద్దతు?
రాష్ట్రపతి పదవికి మీరా కుమార్ ఎంపిక విషయంలో కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. 2014లో లోక్‌సభ స్పీకర్‌గా వైదొలిగాక కూడా అధికార నివాసాన్ని మీరాకుమార్ ఖాళీచేయకపోవడం వివాదాస్పదమైంది. ఆమె ఆస్తులపై కొన్ని ఆరోపణలు విన్పించాయి. స్పీకర్‌గా మీరాకుమార్ పనితీరు అంతగా ఆకట్టుకోలేదన్న ప్రచారం కూడా ఉంది.
ఎన్ని ప్రతికూలతలు ఉన్నా ఆమెను అభ్యర్థిగా నిలబడితే నితీష్ మద్దతు కూడగట్టడం సులభమవుతుందనేది వ్యూహంలా కన్పిస్తోంది. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండేను అభ్యర్థిగా నిర్ణయిస్తే.. 2007లో రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలు మళ్లీ పునరావృతమయ్యే అవకాశముంది. ఆ ఎన్నికల్లో మహారాష్ట్రకు చెందిన ప్రతిభాపాటిల్‌ను అభ్యర్థిగా నిలపడంతో ఆమెకు శివసేన మద్దతివ్వక తప్పని పరిస్థితి. 2007, 2012 ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థిగా ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాలకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే మిత్ర పక్షం శివసేన మద్దతు తెలిపింది. అదే ఎత్తుగడను ఇప్పుడు కూడా అనుసరించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. షిండేకు కూడా మాయావతితో పాటు మరికొన్ని పార్టీలు తప్పకుండా మద్దతిస్తాయనేది అంచనా. కానీ తన పేరు పరిశీలనకు కూడా రాలేదని సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు. తాను పోటీచేసే ప్రసక్తే లేదన్నారు.

బీజేపీకి దీటుగా సమాధానం చెప్తుందన్న అంచనాలు
గురువారం కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల భేటీలో ఉమ్మడి అభ్యర్థి పేరును ఖరారు చేయనున్నారు. బీజేపీ ప్రయోగించిన దళిత కార్డుకు అదే స్థాయిలో సమాధానమిచ్చేలా అభ్యర్థి ఎంపికపైనే ప్రధానంగా చర్చించనున్నారని పరిణామాలు చెప్తున్నాయి. అదే సమయంలో అభ్యర్థి ఎంపిక విషయంలో విభేదాలు తలెత్తకుండా ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఉండేలా చూడటం కాంగ్రెస్‌కు చాలా ముఖ్యం. 2019 పార్లమెంట్ ఎన్నికల వరకూ ప్రతిపక్షాల మధ్య ఐక్యత కొనసాగాలనేది ఆ పార్టీ ఆలోచన.. ఈ రెండింటి ప్రాతిపదికగా భేటీలో మీరాకుమార్, షిండేల పేర్లపై చర్చించవచ్చని కాంగ్రెస్ వర్గాల సమాచారం.