మోత బరువు తగ్గించే ప్లాన్ లో రైల్వే .. దేశంలో తొలిసారి ..ఇది నిజంగా గుడ్ న్యూస్
రైల్వే శాఖ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్తుంది . రైలు ప్రయాణికులకు సరికొత్త సేవలు అందించడానికి భారతీయ రైల్వే ముందుకొచ్చింది. రైలు ప్రయాణికులకు ప్రయాణం అంటే లగేజీ మోయటం పెద్ద కష్టంగా ఉండేది. ఇక ప్రయాణికుల మోత బరువు కష్టాలనుండి గట్టెక్కించే ప్లాన్ లో రైల్వే శాఖ ఉంది. దేశంలోనే తొలిసారి ఇటువంటి సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే శాఖ ప్రయత్నం చేస్తోంది. బ్యాగ్ ఆన్ వీల్స్ సేవలు ప్రారంభించనుంది.
ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ .. రద్దీ అధికంగా ఉండే రూట్స్ లో క్లోన్ ట్రైన్స్.. రీజన్ ఇదే !!

అప్లికేషన్ బేస్డ్ బ్యాగ్ ఆన్ వీల్స్ సేవలు ... లగేజీ కష్టాలకు చెక్
భారతీయ రైల్వే త్వరలో అప్లికేషన్ బేస్డ్ సేవలను అందించనుంది. మొదటగా ఈ సేవలను ఢిల్లీ ,ఘజియాబాద్, గురుగ్రాం రైల్వేస్టేషన్లో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు రైల్వే అధికారులు. దీనికోసం మొబైల్ అప్లికేషన్లు కూడా తీసుకురానున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ తో పాటు, ఐఫోన్ వినియోగదారులందరికీ కూడా ఈ యాప్ అందుబాటులోకి రానుంది. ప్రయాణికుల ప్రయాణాలు సులభతరం చేయడంతో పాటుగా, భారతదేశంలోని రైల్వే ప్రయాణికులకు ఇది అత్యద్భుతమైన సదుపాయం కానుంది.

రైల్వే స్టేషన్ నుండి ఇంటికి , ఇంటి నుండి రైల్వే స్టేషన్ కు లగేజీ చేరవేత సౌకర్యం
ఇక న్యూఢిల్లీ డివిజన్ తన ఇన్నోవేటివ్ నాన్ ఫేర్ రెవిన్యూ ఐడియాస్ స్కీమ్ కింద సేవలను అందించడానికి ఒక ప్రైవేటు సంస్థకు కూడా కాంట్రాక్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
బ్యాగ్స్-ఆన్-వీల్స్ సౌకర్యం ద్వారా బ్యాగ్ ఆన్ వీల్స్ యాప్ ఉపయోగించి, ప్రయాణీకులు తమ సామాను రైల్వే స్టేషన్కు లేదా వారి ఇంటికి తీసుకువెళ్లడానికి వీలు కలుగుతుంది. రైల్వే స్టేషన్ల నుండి ఇంటికి సామాను చేరవేయడానికి, లేదా రైల్వే స్టేషన్ కు ఇంటి నుండి సామాను తీసుకురావడానికి ఈ యాప్ ద్వారా సేవలను అందించనున్నారు.

నామమాత్రపు చార్జీలతో ఇంటింటికీ సేవలు
రైల్వే స్టేషన్ కు లగేజీ తీసుకువచ్చే క్రమంలో, వారు ప్రయాణించ వలసిన రైలు సమయం కంటే ముందుగా వారికి రైల్వే స్టేషన్లో లగేజీని అందజేస్తారు. ఈ పద్ధతి ద్వారా ప్రయాణికుల మోత బరువు తగ్గించడమే కాకుండా, వారి లగేజీని సురక్షితంగా గమ్యస్థానాలకు తీసుకు వెళ్లడానికి కూడా వీలు కలుగుతుంది.
ఇది ప్రయాణీకులకు నామమాత్రపు చార్జీలతో ఇంటింటికి సేవలను అందిస్తుంది. తద్వారా ప్రయాణ అనుభవాన్ని ఇబ్బంది లేకుండా చేస్తుంది. సీనియర్ సిటిజన్లు, వికలాంగులు మరియు ఒంటరిగా ప్రయాణించే మహిళా ప్రయాణీకులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తున్నారు.

మొదట ఈ సౌకర్యం ఈ స్టేషన్ లకే.. రైల్వే ఆదాయం పెరుగుతుందని ఆశాభావం
మొదట్లో న్యూఢిల్లీ, ఢిల్లీ జంక్షన్, హజరత్ నిజాముద్దీన్ , ఢిల్లీ కంటోన్మెంట్, ఢిల్లీ సారాయ్ రోహిల్లా, ఘజియాబాద్ మరియు గుర్గావ్ రైల్వే స్టేషన్ల నుండి రైళ్లు ఎక్కే ప్రయాణికులకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి . ఢిల్లీ రైల్వే శాఖ డిఆర్ఎం ఎస్సీ జైన్, ఈ సౌకర్యం ద్వారా రైల్వేకు ఆదాయం సంవత్సరానికి రూ .50 లక్షలు వరకు వస్తుందని, ఒక సంవత్సరానికి 10% ఆదాయ భాగస్వామ్యాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. మొత్తానికి ఈ విధానం సక్సెస్ అయితే దేశంలోని మిగతా స్టేషన్లకు కూడా బ్యాగ్ ఆన్ వీల్స్ సదుపాయాన్ని కల్పించనున్నట్లుగా తెలుస్తుంది.