Citizenship Bill:హిందూ భావజాల ప్రభుత్వం..ముస్లింలకు చోటేదన్న విదేశీ మీడియా
వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంటులో పాస్ అయ్యింది. ఇక రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే చట్టం రూపుదాలుస్తుంది. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటు దేశీయ మీడియాతో పాటు విదేశీ మీడియా కూడా బిల్లుపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. బిల్లు పాస్ కావడం ఒక చరిత్రగా బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణిస్తుండగా విపక్షాలు మాత్రం మతప్రాతిపదికన భారత పౌరసత్వం ఇవ్వడం సరికాదని తప్పుబడుతున్నాయి. ఇదిలా ఉంటే విదేశీ మీడియా వివాదాస్పద బిల్లుపై రియాక్ట్ అయ్యింది.
Citizenship Bill:నాడు కశ్మీర్లో..నేడు అస్సాంలో, తుపాకీ నీడలో ఈశాన్యం

మతప్రాతిపదికన భారత పౌరసత్వం
వివాదాస్పదమైన పౌరసత్వ బిల్లును భారత ప్రభుత్వం పాస్ చేసిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక రాసుకొచ్చింది. ఈ బిల్లు పాస్ కావడంతో భారత్‌లో ఆందోళనలు మిన్నంటాయని అదే సమయంలో మతపరంగా భారత పౌరసత్వాన్ని ఇచ్చే చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని తన కథనంలో పేర్కొంది. అంతేకాదు మత ప్రాతిపదికనే వలసదారులకు భారత పౌరసత్వం ఇవ్వడం జరుగుతుందని పేర్కొంది. ఒక్క ఇస్లాం మతం వారికి తప్ప మిగతా అన్ని మతాలకు చెందిన వలసదారులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు ప్రభుత్వం లైన్ క్లియర్ చేసిందని న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ పేర్కొంది.

ముస్లింలను రెండవ శ్రేణి పౌరులుగా చూసే అవకాశం
"వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం" అనే శీర్షికతో కథనం రాసుకొచ్చింది వాషింగ్టన్ పోస్ట్. ఒక మతం ఆధారం చేసుకుని భారత పౌరసత్వం కల్పించేందుకు బిల్లును భారత ప్రభుత్వం ఆమోదించిందని కథనం ప్రచురించింది. అంతేకాదు ముస్లిం వలసదారులకు భారత పౌరసత్వం విస్మరిస్తూ బిల్లు తీసుకొచ్చిందని రాసుకొచ్చింది. లౌకికత్వ దేశం అని చెప్పుకునే భారత దేశం క్రమంగా హిందూ దేశంగా మారబోతోందని ఇక్కడ ముస్లింలను రెండవ శ్రేణి పౌరులుగా చూసే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్టు రాసుకొచ్చింది. అంతేకాదు ఇతర దేశాల నుంచి ముస్లింయేతర వ్యక్తులు ఎవరు భారత్‌కు వచ్చి స్థిరపడినా వారికి పౌరసత్వం ఇచ్చేందుకు లైన్ క్లియర్ చేసిందని వాషింగ్టన్ పోస్టు కథనంలో రాసుకొచ్చింది.

64 ఏళ్ల చరిత్ర కలిగిన చట్టం సవరణ
64 ఏళ్ల చరిత్ర కలిగిన భారత పౌరసత్వ చట్టంను సవరిస్తూ ఇతర దేశాల్లో అణిచివేతకు గురైన ముస్లింయేతర ప్రజలకు భారత పౌరసత్వం ఇస్తూ తీసుకొచ్చిన బిల్లుకు ఆమోద ముద్ర పడిందని అల్‌జజీరా కథనం రాసుకొచ్చింది. ఇతర దేశాలనుంచి వలస వచ్చిన ముస్లింల పరిస్థితి ఏంటని ఈ సందర్భంగా ప్రశ్నించింది అల్ జజీరా వార్తా సంస్థ.

హిందూ భావజాల ప్రభుత్వంలో ముస్లింల పరిస్థితేంటి..?
భారత్‌ను పరిపాలిస్తున్న హిందూ భావజాల ప్రభుత్వం వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంటులో పాస్ చేయించిందని ఇండిపెండెంట్ పత్రిక కథనం ప్రచురించింది. పొరుగుదేశాల నుంచి భారత్‌కు వచ్చి స్థిరపడిన అన్ని మతాల వారికి భారత పౌరసత్వం కల్పిస్తోందని మరి ముస్లింలపై ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని కథనంలో పేర్కొంది. ముస్లింలకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు బిల్లులో ఎలాంటి ప్రొవిజన్ లేదని రాసుకొచ్చింది.