కాంగ్రెస్కు షాక్: బీజేపీలో చేరిన పంజాబ్ రాష్ట్ర మాజీ చీఫ్ సునీల్ జాఖర్
న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. రాష్ట్ర పార్టీ మాజీ చీఫ్ సునీల్ జాఖర్ గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమయంలో కాషాయ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సునీల్ జాఖర్ మాట్లాడుతూ.. గత 50 ఏళ్లలో తమ కుటుంబం మూడు తరాలు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిందని చెప్పారు.
పంజాబ్ రాష్ట్రంలో జాతీయత, ఐక్యత, సోదరభావం విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ తాను బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో తనకు ఉన్న 50 ఏళ్ల అనుబంధాన్ని ఇప్పుడు తెంచుకున్నట్లు సునీల్ జాఖర్ తెలిపారు.
సునీల్ జాఖర్ ను బీజేపీలోకి ఆహ్వానించిన ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడారు. పంజాబ్ రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి సీనియర్ నేత అయిన సునీల్ జాకర్ తన వంతు పాత్రను పోషిస్తారని అన్నారు. ఆయన మంచి పేరున్న రాజకీయ నాయకుడని తెలిపారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీతో విభేదాలు తీవ్రం కావడంతోనే జాఖర్ కాంగ్రెస్ పార్టీని వీడినట్లు తెలుస్తోంది.

చరణ్ జిత్ సింగ్ చన్నీ పార్టీ ఆస్తిలాంటి వాడు కాదన్నారు. నాయకత్వం వహించడంలో విఫలమయ్యారని అన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నారంటూ ఆ పార్టీ సునీల్ జాఖర్ను అన్ని పార్టీ పదవుల నుంచి తొలగించింది.
'పంజాబ్లో హిందూ ముఖ్యమంత్రి ఉండటం వల్ల కలిగే పరిణామాలు' అంటూ కాంగ్రెస్ నేత అంబికా సోనీ చేసిన వ్యాఖ్యలపైనా సునీల్ జాఖర్ మండిపడ్డారు. అంబికా సోనీ చేసిన వ్యాఖ్యల కారణంగానే కాంగ్రెస్ పార్టీ పంజాబ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైందన్నారు.
ఇది ఇలావుండగా, పంజాబ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 1988 రోడ్ రేజ్ కేసులో సిద్ధూకు ఈ శిక్షను విధించింది.