నాన్న ఆరోగ్యంగా ఉన్నారు, వాకబు చేసిన మోడీ, అమిత్ షాకు శరద్ యాదవ్ కూతురు థాంక్స్..
లోక్ తాంత్రిక్ జనతాదళ్ అధినేత, కేంద్ర మాజీమంత్రి శరద్ యాదవ్ అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు. ఢిల్లీలోని ప్రవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే శరద్ యాదవ్ ఆరోగ్యం గురించి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, బీహర్ సీఎం నితీశ్ కుమార్ కూడా అడిగి తెలుసుకున్నారు. తన తండ్రి ఆరోగ్యం గురించి ఆరా తీసిన వారికి శరద్ యాదవ్ కూతురు సుభాషిణి ధన్యవాదాలు తెలిపారు.

నేతలంతా శరద్ యాదవ్ ఆరోగ్యం గురించి వాకబు చేసేవారని తెలిపారు. ఆస్పత్రి వైద్య సిబ్బందిని ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకునే వారు అని చెప్పారు. తమతో కూడా కాంటాక్ట్ అయ్యేవారని గుర్తుచేశారు. తన తండ్రిపై వారు చూపించిన వాత్సల్యానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వీరందరీ ఆశీర్వాదం తన తండ్రికి అండగా నిలిచిందని పేర్కొన్నారు. ఇందుకు అభిమానులు చేసే ప్రార్థనలు తోడయ్యాయని చెప్పారు. అందుకోసమే వేగంగా కోలుకుంటున్నారని పేర్కొన్నారు. త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని సుభాషిణి ఆశాభావం వ్యక్తం చేశారు.