karnataka assembly elections 2018 karnataka elections hd kumaraswamy bjp congress jds bs yedyurappa కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2018 కర్ణాటక ఎన్నికలు హెచ్ డి కుమారస్వామి బీజేపీ కాంగ్రెస్ జేడీఎస్ బీఎస్ యడ్యూరప్ప
నో డౌట్.. గవర్నర్ 'డబుల్ గేమ్', ఏం జరుగుతుందో అందరికీ తెలుసు: కుమారస్వామి
బెంగళూరు: కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి అవకాశం కల్పించడంపై జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ రాజ్యాంగ బద్దంగా నడుచుకోవాలి తప్పితే.. రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని ఆయన అన్నారు.
ఈ పరిణామాన్ని తాము అంత తేలిగ్గా తీసుకోవట్లేదని పేర్కొన్నారు. బలనిరూపణ కోసం గవర్నర్ యడ్యూరప్పకు 15రోజుల గడువు ఇవ్వడాన్ని కుమారస్వామి తప్పుపట్టారు. గవర్నర్ మూడు రోజుల్లోనే యడ్యూరప్పను బలనిరూపణకు ఆదేశించాల్సిందన్నారు. ఇప్పుడేం జరుగుతుందో అందరికీ తెలుసునని, 2008లో జరిగిందే మళ్లీ రిపీట్ అవుతుందని అన్నారు.


గాలి సోదరులు తమ వద్ద ఉన్న కోట్ల డబ్బుతో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తారని ఆరోపించారు. గవర్నర్ డబుల్ గేమ్ ఆడుతున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదని అన్నారు. ఆయన రాజకీయాలు నడుపుతున్నారని, దానివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతారని పేర్కొన్నారు. మొత్తం వ్యవహారంలో కేంద్రం చురుగ్గా పనిచేస్తోందని ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోడీపై కూడా కుమారస్వామి విమర్శలు చేశారు. మోడీ డబుల్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. దీనిపై చట్టబద్దంగా పోరాడబోతున్నామని తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రణ్ దీప్ సూర్జేవాలా కూడా బీజేపీపై విమర్శలు చేశారు. గోవా, మణిపూర్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీని పక్కనపెట్టి పీఠం ఎక్కిన బీజేపీ.. ఇక్కడ మాత్రం అతిపెద్ద పార్టీకే అవకాశం ఇవ్వాలనడం సరికాదన్నారు. యడ్యూరప్పను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం సిగ్గుచేటన్నారు.
రిసార్టు రాజకీయం:
యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్ వజుభాయ్ వాలా.. బలనిరూపణకు 15రోజుల గడువు ఇవ్వడంతో కాంగ్రెస్, జేడీఎస్ మరింత అప్రమత్తమయ్యాయి. తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు ఈ 15రోజులు వారిని రిసార్టుకే పరిమితం చేసే అవకాశాలున్నాయి. బెంగళూరు శివారులోని ఓ రిసార్టులో రెండు పార్టీల ఎమ్మెల్యేలను ఉంచినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి గవర్నర్ అధికారిక ప్రకటన తర్వాత.. జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి హుటాహుటిన రిసార్టు వద్దకు బయలుదేరారు. బీజేపీ బేరసారాలకు, ప్రలోభాలకు తమ ఎమ్మెల్యేలను దూరంగా ఉంచాలని ఆయన భావిస్తున్నారు.
JD(S)' HD Kumaraswamy arrives at Eagleton Resort in #Bengaluru where Congress and JD(S) MLAs are staying #KarnatakaElections pic.twitter.com/G0EZJFuwUZ
— ANI (@ANI) May 16, 2018