వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కేసీఆర్ ఏం చెబుతారో మరి?: వచ్చేనెలలో నలుగురు సీఎంల భేటీ.. నదుల అనుసంధానమే ఎజెండా

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమిళనాడులోని కావేరి నదితో గోదావరి వరద నీటి అనుసంధానానికివీలుగా జాతీయ జల అభివృద్ధి సంస్థ సిద్ధం చేసిన తాజా ప్రతిపాదనపై చర్చించేందుకు కేంద్రం వచ్చేనెలలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించనున్నది. ఈ ప్రతిపాదనను జాతీయ ప్రాజెక్టుగా పట్టాలు ఎక్కించడానికి కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ ఆసక్తి చూపుతున్నారు. ఈ సమావేశానికి కూడా కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ అధ్యక్షత వహిస్తారని ఆంధ్రప్రదేశ్‌ అధికారులకు జాతీయ జల అభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు.
అకినేపల్లి - నాగార్జునసాగర్ - సోమశిల - కావేరి అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదన పూర్తి వివరాలను కూడా ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలకు జాతీయ జల అభివృద్ధి సంస్థ పంపుతోంది. దీనిపై రాష్ట్రాలు తమ అభిప్రాయాలను తెలిపాక ఈ ప్రాజెక్టుపై నాలుగు రాష్ట్రాల సీఎంలను ఢిల్లీకి పిలిచి ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేస్తారు.

143 రోజుల్లో 247 టీఎంసీలు మళ్లించాలని కేంద్రం ప్రతిపాదన

143 రోజుల్లో 247 టీఎంసీలు మళ్లించాలని కేంద్రం ప్రతిపాదన

అకినేపల్లి- నాగార్జునసాగర్‌ లింక్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన దుమ్ముగూడెం- నాగార్జునసాగర్‌ టేల్‌పాండ్‌ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. గతంలో దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి నీటిని మళ్లించేలా టేల్‌పాండ్‌ ప్రాజెక్టు చేపట్టారు. కొత్తగా ప్రతిపాదించిన అకినేపల్లి బ్యారేజి.. తుపాకులగూడెం- దుమ్ముగూడెం ఆనకట్టలకు మధ్యలో ఉంది. దుమ్ముగూడెం పైభాగంలో వెంకటాపురం మండలం అకినేపల్లి - మల్లారం గ్రామం వద్ద నిర్మించాలని ఎన్ డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. అకినేపల్లి దుమ్ముగూడెం పై భాగంలో ఉన్నందున కాలువ ప్రవాహ మార్గం గతంలో చేపట్టిన దానికి సమాంతరంగా ఎగువ భాగం నుంచి వెళ్తుంది. బ్యారేజి ప్రాంతం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మంగపేట మండలంలో ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు చెప్పాయి. గతంలో 80 రోజుల్లో 165 టీఎంసీల నీటిని మళ్లించేలా చేపట్టగా, ఇప్పుడు 143 రోజుల్లో (జూన్ నుంచి అక్టోబర్ వరకు) 247 టీఎంసీలు మళ్లించాలని ప్రతిపాదించారు. దుమ్ముగూడెం- టేల్‌పాండ్‌ను రద్దు చేసినందున ప్రస్తుత ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిస్పందన కీలకం. దీనిపై సీఎం కేసీఆర్, నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్ రావు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. అయితే ప్రతిపాదన పూర్తి స్థాయి నివేదిక వస్తే గానీ స్పందించలేమని తెలంగాణ నీటిపారుదలశాఖ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణకు 102.. ఏపీకి 55.. తమిళనాడు 90 టీఎంసీల వినియోగం

తెలంగాణకు 102.. ఏపీకి 55.. తమిళనాడు 90 టీఎంసీల వినియోగం

తాజా ప్రతిపాదన ప్రకారం తెలంగాణలోని ఖమ్మం జిల్లా అకినేపల్లి వద్ద 20 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బ్యారేజీ నిర్మిస్తారు. అక్కడి నుంచి నాగార్జునసాగర్‌, సోమశిల, పాలార్‌, కావేరి వరకు ఈ అనుసంధానం ఉంటుంది. కాళేశ్వరం దిగువన 500 టీఎంసీలకుపైగా వరద జలాలు అందుబాటులో ఉన్నాయని లెక్కిస్తూ ఇందులోని 247 టీఎంసీలు ఈ ప్రతిపాదనలో వివిధ రాష్ట్రాలు వినియోగించుకునే అవకాశం ఉంది. వీటిలో తెలంగాణ 102 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌ 55 టీఎంసీలు, తమిళనాడు 90 టీఎంసీలు వినియోగించుకునేందుకు వీలు ఉంటుంది. అకినేపల్లి బ్యారేజి నుంచి మూడుచోట్ల ఎత్తిపోసి, తర్వాత గ్రావిటీ ద్వారా నీటిని మళ్లించాలి. కిన్నెరసాని నదిని దాటడంతో పాటు పాలేరు క్రాసింగ్‌, మూసీ, గోదావరి- కృష్ణా రిడ్జిని దాటుకొని నాగార్జునసాగర్‌ డ్యామ్‌కు మళ్లిస్తారు. మధ్యలో సొరంగ మార్గాలు, మరో రెండు లిప్టులు కూడా ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపహాడ్‌, పాల్వంచ, కొత్తగూడెం, జూలూరుపాడు, ఏన్కూరు, తల్లాడ, వైరా, బోనకల్‌, చింతకాని, ముదిగొండ, నేలకొండపల్లి, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ, మేళ్లచెరువు, మట్టంపల్లి, నేరేడుచర్ల, దామరచర్ల మండలాల నుంచి వెళ్తుంది. నాగార్జునసాగర్‌ నుంచి సోమశిలకు 393.02 కి.మీ దూరం కాలువ ద్వారా నీటిని మళ్లిస్తారు. సోమశిల నుంచి గ్రాండ్‌ అనకట్టకు మళ్లిస్తారు.

తొలిదశలో పెన్నార్ నుంచి పాలార్ మీదుగా కావేరికి మళ్లింపు

తొలిదశలో పెన్నార్ నుంచి పాలార్ మీదుగా కావేరికి మళ్లింపు

గోదావరి నుంచి కావేరికి నీటిని మళ్లించేందుకు జాతీయ జల అభివృద్ధి సంస్థ రెండు ప్రత్యామ్నాయాలను ముందుకు తెచ్చింది. తొలి దశలో గోదావరి- పెన్నా- పాలార్‌- కావేరి అనుసంధానం. రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బ తినకుండా మార్గ మధ్యంలో వినియోగించుకొంటూనే కావేరికి నీటిని మళ్లించడం. రెండో దశలో బ్రహ్మపుత్ర - గంగ - సుబేర్నరేఖ - మహానది- గోదావరి అనుసంధానం. మహానది నుంచి మళ్లించడానికి అవసరమైన నీటి లభ్యత లేదని ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ నేపధ్యంలోనే బ్రహ్మపుత్ర - గంగలను మహానదికి కలిపే ప్రతిపాదనను జాతీయ జల అభివృద్ధి సంస్థ ముందుకు తెచ్చింది. మొదటి దశ కింద అకినేపల్లి (గోదావరి) - నాగార్జునసాగర్‌ (కృష్ణా), కృష్ణా (నాగార్జున సాగర్‌) - పెన్నా (సోమశిల), పెన్నా (సోమశిల)- కావేరి (గ్రాండ్‌ ఆనకట్ట) అనుసంధానాన్ని ప్రతిపాదించింది. ప్రాథమిక నివేదికనూ సిద్ధం చేసింది. రెండో దశలో మహానది (మణిభద్ర)- గోదావరి (ధవళేశ్వరం), గోదావరి (పోలవరం)- కృష్ణా- పెన్నా, గోదావరి (పోలవరం)- కృష్ణా (విజయవాడ), కృష్ణా (ఆలమట్టి)- పెన్నా, కృష్ణా (శ్రీశైలం)- పెన్నా, కావేరి (గ్రాండ్‌ ఆనికట్‌)- వైగయి- గుండార్‌ ఉన్నాయి. వీటిలో పోలవరం- విజయవాడ అనుసంధానాన్ని ఆంధప్రదేశ్‌ ఇప్పటికే చేపట్టింది. గోదావరి- కృష్ణా- పెన్నా అనుసంధానంపైనా ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

నాలుగు రాష్ట్రాల సీఎంలతో చర్చించాలని కేంద్రానికి నివేదిక

నాలుగు రాష్ట్రాల సీఎంలతో చర్చించాలని కేంద్రానికి నివేదిక

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో మార్గమధ్యలో ఆయకట్టుకు, తాగుకు ఇలా అన్ని అవసరాలు పోనూ 57 టీఎంసీలు గ్రాండ్‌ ఆనకట్టకు చేరుతుంది. ఈ నీటిని కావేరి ఆయకట్టు అవసరాలకు వినియోగిస్తారు. నీటి పంపిణీపై రాష్ట్రాల మధ్య సమస్యలు వస్తాయని, ఈ అనుసంధానాన్ని చేపట్టే ముందు రాష్ట్రాలతో సంబంధించి వారి అభ్యంతరాలను పరిష్కరించాలని నివేదిక పేర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన దుమ్ముగూడెం- టేల్‌పాండ్‌ కూడా నాగార్జునసాగర్‌ ఆయకట్టు స్థిరీకరణకు, శ్రీశైలం ఆధారంగా మిగులు జలాల వినియోగంతో చేపట్టిన ప్రాజెక్టుల కోసమని చేపట్టారు. తాజా ప్రతిపాదనలో తమిళనాడుకు కూడా నీటిని మళ్లిస్తారు.

పునరుత్పత్తి నీటితో 324 టీఎంసీల నీటి వినియోగానికి చాన్స్

పునరుత్పత్తి నీటితో 324 టీఎంసీల నీటి వినియోగానికి చాన్స్

ప్రస్తుత అధ్యయనంలో కాళేశ్వరం ప్రాజెక్టు దిగువన ఇంద్రావతి సబ్‌బేసిన్‌ నుంచి వచ్చే నీటినే జాతీయ జల అభివృద్ధి సంస్థ పరిగణనలోకి తీసుకొన్నది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వినియోగించుకున్నాక ఇంద్రావతిలో లభ్యమయ్యే నీరు గోదావరిలో చేరుతుంది. ఇంద్రావతి సబ్‌బేసిన్‌లో 75 శాతం నీటి లభ్యత కింద 747 టీఎంసీలు, 50 శాతం నీటి లభ్యత కింద 902 టీఎంసీలు లభ్యమవుతాయని నివేదిక పేర్కొంది. వినియోగంలో ఉన్న, నిర్మిస్తున్న, భవిష్యత్‌లో చేపట్టనున్న ప్రాజెక్టులు, చిన్ననీటి వనరులకు 274.21 టీఎంసీలు అవసరమని అంచనా వేసింది. 2050 వరకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలు, జల విద్యుత్ అన్నీ పోనూ ఇంద్రావతి సబ్‌బేసిన్‌లో 75 శాతం నీటి లభ్యత కింద 289 టీఎంసీల మిగులు ఉంటుందని చెప్పింది. పునరుత్పత్తయ్యే నీటితో కలిపి గోదావరి నుంచి 324 టీఎంసీలు మళ్లించే అవకాశం ఉందని తెలిపింది. అయితే గోదావరిలో అవసరమైన నీటి నిల్వకు అవకాశం లేనందున 247 టీఎంసీల మళ్లింపునకు సిఫార్సు చేసింది.

పోలవరం పూర్తయ్యాక పెన్నాకు 360 టీఎంసీల నీటి మళ్లింపునకు ఏపీ సీఎం బాబు ప్లాన్

పోలవరం పూర్తయ్యాక పెన్నాకు 360 టీఎంసీల నీటి మళ్లింపునకు ఏపీ సీఎం బాబు ప్లాన్

పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక అక్కడినుంచి ఎత్తిపోతల ద్వారా 360 టీఎంసీల నీటిని పెన్నాకు తరలించే ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్‌ కసరత్తు చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు సూచన మేరకు ఈ నీటిని కావేరికి తరలించేందుకు వీలుగా సమగ్ర ప్రతిపాదనపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. జాతీయ జల అభివృద్ధి సంస్థ అనుసంధాన ప్రతిపాదనల్లో మహానది నుంచి గోదావరి - పెన్నా - పాలార్ ‌- కావేరి అనుసంధానమే కీలకం. ప్రస్తుతం ఒడిశా అభ్యంతరాల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌కు ఉన్న 75 శాతం విశ్వసనీయ జలాలు వాడుకునేలా తాజా ప్రతిపాదనను జల అభివృద్ధి సంస్థ ముందుకు తెచ్చింది. ఛత్తీస్‌గఢ్‌ తన వాటా మేరకు నీటిని వాడుకునేలా ప్రాజెక్టులు నిర్మించుకుంటే ఇక్కడ నీటి లభ్యత ఉండదు. మహానది నుంచి గోదావరికి నీటి మళ్లింపు అంశం తేలి అది చేపట్టేలోపు తక్షణావసరాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే తాజా ప్రతిపాదన తెరపైకి వచ్చిందని జలవనరుల అధికారులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో పాత ప్రతిపాదనే ప్రాణాధారమైనందున ఆ కసరత్తు యథాతథంగా కొనసాగుతుందని, బొల్లాపల్లి వద్ద జలాశయం నిర్మించుకుంటే అంతర్గత అనుసంధానమూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు చేస్తుందని అధికారులు చెబుతున్నారు.

English summary
Union water resourses devolopment organisation calls for Four States chief ministers (Telangana, Andhra Pradesh, Chatishgarh, Tamilnadu) next month.Union water resourses devolopment organisation also sends draft on from Godavari through Krishna and Penna to Kaveri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X