ముంబై నిరసనల్లో "కశ్మీర్‌కు విముక్తి" పోస్టర్ కలకలం... మండిపడ్డ బీజేపీ
ముంబై: కశ్మీర్‌కు విముక్తి కల్పించండంటూ ముంబైలోని గేట్వేఆఫ్ ఇండియా వద్ద జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఓ పోస్టర్ కలకలం సృష్టించింది. జేఎన్‌యూలో జరిగిన హింసాకాండకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనల్లో భాగంగా ఓ అమ్మాయి ఈ పోస్టర్‌ను ప్రదర్శించింది. ఈ పోస్టర్ వైరల్ అవడంతో బీజేపీ స్పందించింది. జేఎన్యూకు మద్దతుగా జరుగుతున్న కార్యక్రమంలో కొందరు వ్యతిరేక శక్తులు చేరారాని బీజేపీ విమర్శించింది.
పోస్టర్‌ను ప్రదర్శించిన ముంబై యువతి
జేఎన్‌యూ ఘటనలో అక్కడి విద్యార్థులకు మద్దతుగా జరిగిన నిరసన కార్యక్రమంలో మెహక్ మీర్జా ప్రభు అనే 37 ఏళ్ల మహిళ ఈ పోస్టర్‌ను ప్రదర్శించింది. ఆమె ఓ స్టోరీ టెల్లర్ , రచయితగా గుర్తించారు. కశ్మీర్‌కు చెందిన మొహ్మద్ మునీమ్ అనే ఓ యువతి మీర్జాకు మంచి స్నేహితురాలు. ఆమె పాటలు, పద్యాలు రాస్తుంది. ముంబైలో ఉంటున్న మునీమ్ పద్యాలు కశ్మీర్లో బాగా పాపులర్ అయ్యాయి. ఇదిలా ఉంటే పోస్టర్‌ను ఎందుకు ప్రదర్శిస్తున్నారని మీడియా వారు ప్రశ్నించగా... తాను కశ్మీర్‌కు చెందిన యువతిని కాదని కానీ అందరికీ స్వాతంత్ర్యం ఉండాలన్నదే తన ఉద్దేశమని చెప్పింది మీర్జా. మీర్జా ప్రదర్శించిన ఈ పోస్టర్ వైరల్‌గా మారింది.
వేర్పాటు వాదులను ఎలా ప్రోత్సహిస్తారు..?
ఈ ట్వీట్ కాస్త వైరల్‌గా మారడంతో మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. కశ్మీర్‌కు విముక్తి కల్పించాలన్న నినాదాలెందుకని ప్రశ్నించిన ఫడ్నవీస్... ముంబైలో వేర్పాటు వాదులను ఎలా ప్రోత్సహిస్తారని అన్నారు. సీఎం కార్యాలయంకు కూతవేటు దూరంలో ఈ నినాదాలు వినిపించాయని ఫడ్నవీస్ చెప్పారు. కశ్మీర్‌ను విముక్తి చేయాలంటూ నినాదాలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోరా అంటూ సీఎం ఉద్ధవ్ థాక్రేను ఫడ్నవీస్ ప్రశ్నించారు. భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటే వారిని ప్రోత్సహిస్తారా అంటూ సూటిగా అడిగారు.
వేర్పాటువాదులను పాక్ ప్రోత్సహిస్తోంది
ఇదిలా ఉంటే మరో ఫిల్మ్ మేకర్ వివేక్ అగ్నిహోత్రి కూడా పోస్టర్ ప్రదర్శనపై స్పందించారు. కశ్మీర్‌కు విముక్తి కావాలంటూ ప్రదర్శించిన ఫ్లకార్డు వెనక పాక్ హస్తం ఉందని ఆరోపించారు. భారత్‌లో ఉన్న వేర్పాటు వాదులు, కొందరు కశ్మీర్ విద్యార్థులను పావులుగా పాక్ వాడుతోందని ట్వీట్ చేశారు. నిజమైన భారతీయుడు ఎవరూ ఇలాంటి ఫ్లకార్డులను ప్రదర్శించరని చెప్పారు.