
మోదీ చేతిలో పొలిటికల్ ఆటం బాంబ్-అందుకే వారంతా గప్‌చుప్: రాజకీయాల్లో పెను సంచలనం
ఢిల్లీ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వద్ద ఓ డజన్ మంది రాజకీయనాయకులకు సంబంధించి కొన్ని రహస్య ఫైల్స్ ఉన్నట్లు ప్రధాని కార్యాలయంలో పనిచేసిన మాజీ అధికారి మీనాక్షి సుందరం సంచలన సమాచారం ఇచ్చారు. త్వరలో దేవెగౌడపై పుస్తకం విడుదల చేయనున్న ఆమె ఆ పుస్తకంలో పలు సంచలన విషయాలను పేర్కొన్నట్లు తెలుస్తోంది. 1996లో 13 రోజుల వాజ్పాయ్ సర్కార్ తర్వాత అధికారంలోకి వచ్చిన దేవెగౌడకు పీవీ ఈ రహస్య ఫైల్స్‌ను అందజేసినట్లు పుస్తకంలో మీనాక్షి సుందరం పేర్కొన్నారు. ఈ ఫైల్స్ దేవెగౌడ ప్రభుత్వం తర్వాత అధికారంలోకి వచ్చిన ఐకే గుజ్రాల్, వాజ్‌పేయిల కార్యాలయంలో కూడా ఉనట్లు తెలిపారు. ఆ తర్వాత అవి ఎక్కడికి మాయమయ్యాయో తెలియదని పేర్కొన్నారు.

ఆటం బాంబు లాంటి ఫైల్స్
"ఆ ఫైల్స్ ఆటంబాంబు లాంటివి. నాడు పీవీ నరసింహారావు డజన్ ఫైల్స్కంటే ఎక్కువగానే ఇచ్చారు. ఆ ఫైల్స్ అన్నీ నాడు ఆయన కేబినెట్లో పనిచేసిన వారివి, కేబినెట్ బయట ఉన్న వ్యక్తులవి. అందులో నాకు గుర్తున్నంత వరకు ములాయంసింగ్, జయలలిత, బంగారప్ప, శరద్‌పవార్ లాంటి నేతలకు సంబంధించినవిగా ఉన్నాయి." అంటూ మీనాక్షి సుందరం చెప్పుకొచ్చారు. తాను Furrows in a field పేరుతో ఓ పుస్తకాన్ని రచించారు. ఇందులో పలు సంచలన విషయాలను పేర్కొన్నట్లు సమాచారం. ఈ పుస్తకం ఈ నెలాఖరులో విడుదల కానుంది.

జయలలితతో పాటు పలువురి జాతకాలు
పీవీ నరసింహారావు ప్రభుత్వంలో శరద్ పవార్ రక్షణశాఖ మంత్రిగా పనిచేశారు. దాదాపుగా 20 నెలల పాటు ఈ మంత్రిత్వ శాఖలో పనిచేసిన శరద్ పవార్ ఆ తర్వాత 1993లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.ఇక దేవెగౌడ ప్రభుత్వంలో ములాయం సింగ్ రక్షణ శాఖ మంత్రిగా వ్యవహరించారు. రాజీవ్‌గాంధీ మద్దతుతో బంగారప్ప కర్నాటక ముఖ్యమంత్రిగా 1990 నుంచి 1992 వరకు ఉన్నారు. ఇక పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలోనే జయలలిత కూడా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తను ఇక ప్రధానిగా మరోసారి బాధ్యతలు చేపట్టేది లేదని తెలిసి ఈ రహస్య ఫైల్స్ అన్నీ దేవెగౌడకు బదిలీ చేసినట్లు మీనాక్షి సుందరం చెప్పుకొచ్చారు.

దేవెగౌడ ఏం చెప్పారంటే..?
రహస్య ఫైల్స్‌ను దేవెగౌడకు చేరవేసేందుకు తాను బలంగా నమ్మిన అధికారిని ఒకరిని తన వద్దకు పంపాల్సిందిగా పీవీ నరసింహారావు చెప్పగా... అందుకు దేవెగౌడ తనను పీవీ వద్దకు పంపారని మీనాక్షి సుందరం గుర్తుచేశారు. అంతేకాదు ఆ ఫైల్స్ తనకు ఇవ్వాల్సిన అవసరం లేదని.. కేవలం అందులో ఏముందో మాత్రమే తనకు చెప్పాలని దేవెగౌడ తనకు సూచించినట్లు మీనాక్షి సుందరం చెప్పుకొచ్చారు. ఆ ఫైళ్లలోని అంశాలను చదవగా అవి బయటకు వస్తే పెద్ద ఆటం బాంబు పేలినట్లే అవుతుందని మీనాక్షి చెప్పుకొచ్చారు.

ఆ ఫైల్స్ ఏమయ్యాయి...?
ఇక దేవెగౌడ అధికారం కోల్పోయాక, వాజ్‌పేయి ప్రభుత్వం వచ్చింది. తాను ప్రధాని కార్యాలయంలో పనిచేసినంత కాలం ఆ ఫైల్స్‌ను తనవద్దే ఉంచుకున్నట్లు మీనాక్షి సుందరం చెప్పారు. ఆ తర్వాత వాజ్‌పేయి ప్రభుత్వంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన అశోక్ సైకియాకు అందజేసినట్లు మీనాక్షి చెప్పారు. ఇక గుజ్రాల్ ప్రధానిగా ఉన్న సమయంలో కూడా ఈ ఫైల్స్ గురించి చెప్పగా... ఈ సమయంలో ఎవరినీ నమ్మే పరిస్థితుల్లో లేరని కాబట్టి ఫైల్స్‌ను తన వద్దే జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని గుజ్రాల్ సూచించినట్లు మీనాక్షి చెప్పారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో బ్రజేష్ మిశ్రాకు ఫైల్స్ గురించి చెప్పగా ఆయన కూడా ఫైల్స్‌ను తనవద్దే ఉంచుకోమని చెప్పారని వెల్లడించారు. ఇక ప్రధాని కార్యాలయంలో తన పదవి ముగుస్తుందనగా అశోక్ సైకియాకు ఫైల్స్ అందజేసినట్లు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వాటి గురించి తనకేమి తెలియదని స్పష్టం చేశారు. ఇక 2004లో ప్రధానిగా మన్మోహన్ సింగ్ అయ్యారు... 2007లో అశోక్ సైకియా చనిపోయారు. దీంతో ఆ ఫైల్స్ సంగతి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇదిలా ఉంటే 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న నృపేంద్ర మిశ్రా దీనిపై స్పందిస్తూ... అలాంటి రహస్య ఫైల్స్ గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. కానీ అనధికారిక సమాచారం ప్రకారం ఆ ఫైల్స్‌తో పాటు మరింత ఇన్ఫర్మేషన్ కూడా సేకరించి సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రాజకీయ ఆటం బాంబ్ ఎప్పుడు పేలినా దేశంలో రాజకీయ విస్ఫోటనం ఖాయంగా కనిపిస్తోంది.