త్వరలోని భారత్కు కరోనా వ్యాక్సిన్, ఎంఎస్ఎంఈలో కొత్తగా 5 కోట్ల ఉద్యోగాలు: నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: భారత్లో సాధ్యమైనంత త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, ఆర్థిక యుద్ధంలో విజయం సాధించేందుకు ఈ మహమ్మారిని అధిగమిస్తుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు. డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో ఆయన మాట్లాడారు.

త్వరలోనే భారత్కు కరోనా టీకా..
వీలైనంత త్వరగా కరోనా టీకా భారత్కు వస్తుంది. మనం వంద శాతం కరోనాకి వ్యతిరేకంగా జరిపే పోరులో విజయం సాధిస్తాం. అలాగే ఆర్థిక యుద్ధలో కూడా విజయాన్ని సొంతం చేసుకుంటాం. ఇప్పటికే చైనా నుంచి దిగుమతులు తగ్గించుకున్నాం. మన ఎగుమతులు పెరిగాయి. సానుకూల దోరణి కనిపిస్తోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు.

భారత్ పట్ల సుముఖంగా ప్రపంచ దేశాలు
ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) మంచి పనితీరు కనబరుస్తున్నాయన్నారు. చైనాతో పోల్చుకుంటే భారత్లో యువ ప్రతిభావంతులు ఎక్కువగా ఉన్నాయన్నారు. ముడిసరుకు అందుబాటులో ఉందని, విధానాలూ అనుకూలంగా ఉన్నాయని నితిన్ వెల్లడించారు. చాలా దేశాలు చైనాతో ఒప్పందాలు చేసుకోవడానికి సిద్ధంగా లేవని, భారత్ పట్ల సుముఖంగా ఉన్నాయని నితిన్ తెలిపారు.

కొత్తగా 5 కోట్ల ఉద్యోగాలు
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ద్వారా దేశంలో ఐదు కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 2020 హొరాసిస్ ఆసియా వర్చువల్ మీటింగ్లో మాట్లాడిన ఆయన వచ్చే ఏడాదికల్లా భారత్ అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

చైనా కంటే భారత్ మెరుగు..
చైనాతో పోలిస్తే భారత్ అన్ని విధాలుగా శక్తి సామర్థ్యాలు కలిగి ఉందన్నారు. నైపుణ్యం ఉన్న యువతతో పాటు ముడి పదార్థాల లభ్యతలోనూ దేశం ముందంజలో ఉందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తున్నాయని నితిన్ గడ్కరీ చెప్పారు. దేశ ఆర్థిక వృద్ధికి ఎంఎస్ఎంఈ భాగస్వామ్యాన్ని 30 నుంచి 40 శాతానికి పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అంతేగాక, ఎంఎస్ఎంఈ ఎగుమతులను 48 శాతం నుంచి 60 శాతానికి పెంచునన్నట్లు కేంద్రమంత్రి స్పష్టం చేశారు. కాగా, ఈ వర్చువల్ మీటింగ్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 400 మంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.