బాలికపై ఏడుగురు గ్యాంగ్ రేప్ .. బాలిక ఆత్మహత్య .. తండ్రి ఆత్మహత్యాయత్నంతో వెలుగులోకి
ఛత్తీస్ గడ్ లోని కొండగావ్ జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి .గత జులై లో బాలిక వివాహ వేడుకకు హాజరై వస్తుండగా బాలికను అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళి ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాలిక అవమానాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది . ఈ ఘటన జరిగిన మూడు నెలల తర్వాత బాలిక తండ్రి ఆత్మహత్యకు ప్రయత్నించగా జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది . పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

జులై నెలలో బాలికపై సామూహిక అత్యాచారం , ఆపై బాలిక ఆత్మహత్య
వివాహ వేడుకకు వెళ్ళిన బాలికను జూలై 19 న ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారని బాధితురాలి కుటుంబం ఆరోపించింది. మరుసటి రోజు బాలిక ఆత్మహత్య చేసుకుందని బాధిత బాలిక కుటుంబం చెప్తుంది . పోలీసులకు చెప్పినా పట్టించుకోకపోవటంతో కుటుంబ సభ్యులు బాలిక మృతదేహాన్ని గ్రామానికి దూరంగా ఖననం చేశారు. సామూహిక అత్యాచారం జరిగిన తర్వాతే ఫిర్యాదు నమోదు చేయడానికి ప్రయత్నించానని, అయితే పోలీసులు కేసు నమోదు చేయలేదని బాలిక బంధువులు చెప్పారు.

బాలిక తండ్రి ఆత్మహత్యాయత్నం .. వెలుగులోకి బాలిక గ్యాంగ్ రేప్ ఘటన
బాలిక తండ్రి తన కుమార్తె విషయంలో పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోకపోవటంతో చివరకు ఆత్మహత్యాయత్నం చెయ్యటంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది .ఆత్మహత్యా యత్నం చేసిన బాలిక తండ్రి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు . అయితే పోలీసులు పట్టించుకోలేదు అంటున్న బాధితురాలి కుటుంబం వాదనలను పోలీసులు తిరస్కరించారు. ఈ వార్త స్థానిక మీడియాలో ప్రచురించడంతో చత్తీస్ గడ్ రాష్ట్రంలో దుమారం రేగింది .

బాలిక సమాధి నుండి మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టం , ముగ్గురు అరెస్ట్
కొండగావ్ జిల్లాలోని ధనోరా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో కొద్ది నెలల క్రితం సామూహిక అత్యాచారం చేసిన తరువాత బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు నిన్న సమాచారం అందిందని బస్తర్ రీజియన్ (ఐజి) ఇన్స్పెక్టర్ జనరల్ సుందరాజ్ పి. చెప్పారు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి పోలీసులు బాలికను ఖననం చేసిన సమాధి నుండి మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిర్వహించారు .కేసు దర్యాప్తులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన మిగతావారిని అరెస్ట్ చెయ్యటానికి గాలింపు చేపట్టారు.

సామూహిక అత్యాచార ఘటనపై ఫిర్యాదు చేసిన కుటుంబం .. రంగంలోకి పోలీసులు
కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, జూలై 19 న, 17 ఏళ్ల బాధితురాలు తన కుటుంబంతో కలిసి సమీపంలోని కనగావ్లో వివాహ వేడుకకు వెళ్లింది. ఉదయం 11 గంటల సమయంలో, కనగావ్కు చెందిన ఇద్దరు యువకులు ఆ యువతిని తమతో పాటు సమీపంలోని అడవికి తీసుకెళ్లి అక్కడి మిగతా ఐదుగురు యువకులతో కలిసి అత్యాచారం చేశారు. పోలీసు అధికారి మాట్లాడుతూ, మరుసటి రోజు ఉదయం బాధితురాలు ఎవరికీ చెప్పకుండా ఇంటికి తిరిగి వచ్చి, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.