రోడ్డు పక్కన మృత పిండం... కన్నతండ్రి పనే... షాకింగ్ నిజాలు వెల్లడించిన అత్యాచార బాధితురాలు
కన్నతండ్రే బిడ్డపై అత్యాచారానికి ఒడిగట్టిన దారుణ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. కూతురు గర్భం దాల్చడంతో బలవంతంగా అబార్షన్ చేయించి మృత పిండాన్ని రోడ్డు పక్కన పడేశాడు. ఇటీవల రోడ్డు పక్కన ఆ పిండాన్ని గమనించిన పోలీసులు దానిపై ఆరా తీయగా ఈ వ్యవహారం వెలుగుచూసింది. సభ్య సమాజం తలదించుకునేలా ఓ తండ్రి చేసిన ఈ దారుణం తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాలు చెప్పిన వివరాలతో పోలీసులే షాక్ తిన్నారు.

ఇలా వెలుగులోకి...
మహారాష్ట్రలోని వసింద్ పట్టణంలో ఇటీవల పోలీసులు రోడ్డున పక్కన ఓ మృత పిండాన్ని గుర్తించారు. అనుమానం వచ్చి చుట్టుపక్కల వాళ్లను ఆరా తీశారు. ఇదే క్రమంలో 17 ఏళ్ల ఓ మైనర్ బాలికను దీనిపై ఆరా తీయగా షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. తన కడుపులో పెరుగుతున్న ఆ పిండాన్ని అబార్షన్ ద్వారా తొలగించినట్లు ఆమె పోలీసులకు వెల్లడించింది. అంతేకాదు,దాని వెనుక మరో ఘోరమైన,కౄరమైన కథ ఉందని చెప్పింది. తన తండ్రి చేసిన దారుణాన్ని పోలీసులకు వివరించింది.

నిందితుల అరెస్ట్...
51 ఏళ్ల తన తండ్రి స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నట్లు బాధితురాలు వెల్లడించింది. తనకు 21 ఏళ్ల ఓ బాయ్‌ఫ్రెండ్ కూడా ఉన్నట్లు చెప్పింది. అటు తండ్రి,ఇటు బాయ్‌ఫ్రెండ్ పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పింది. దీంతో తాను గర్భం దాల్చానని... ఆ విషయం ఎవరికీ తెలియవద్దని అబార్షన్ ద్వారా పిండాన్ని తొలగించారని తెలిపింది. బాలిక చెప్పిన వివరాలకు పోలీసులు షాక్ తిన్నారు. ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో పాటు తండ్రిని అరెస్ట్ చేసి సెక్షన్ 376(రేప్),పోక్సో కింద కేసు నమోదు చేశారు.

డీఎన్ఏ టెస్టులు...
బాధితురాలి కుటుంబం గతంలో నేవీ ముంబైలోని పన్వేల్‌లో నివసించినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడే ఓ యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడి ఎఫైర్‌కి దారితీసినట్లు నిర్దారించారు.అయితే బాలిక కుటుంబానికి ఈ వ్యవహారం నచ్చకపోవడంతో పన్వేల్‌లో ఇల్లు ఖాళీ చేసి వసింద్కు మారిపోయారు.అయినప్పటికీ ఆ యువతి తరుచూ తన బాయ్‌ఫ్రెండ్‌ని కలుస్తూనే ఉండేది. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చిందా... లేక తండ్రి కూడా అత్యాచారం జరిపాడా అన్నది తేలాల్సి ఉంది. ఇందుకోసం వీరిద్దరికీ డీఎన్ఏ టెస్టులు చేయనున్నారు.