• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దిల్లీ రైల్వే స్టేషన్‌పై జీఎంఆర్, అదానీ సంస్థల ఆసక్తి... అక్కడ ఏం జరగబోతోంది

By BBC News తెలుగు
|

దిల్లీ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి ప్రాజెక్టు

రానున్న కొన్నేళ్లలో దిల్లీ రైల్వే స్టేషన్ రూపురేఖలు పైచిత్రంలో కనిపిస్తున్నట్లుగా మారిపోవచ్చు. దిల్లీ రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి మల్టీమోడల్ ట్రాన్సిట్ హబ్‌లా అభివృద్ధి చేయాలని రైల్వే మంత్రిత్వశాఖ ప్రణాళికలు వేస్తోంది.

హోటళ్లు, దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్... ఇలా అన్నీ రైల్వే స్టేషన్‌లో అందుబాటులోకి వస్తాయన్న మాట. సాధారణంగా మనం ఈ తరహా ఏర్పాట్లను విమానాశ్రయాల్లో చూస్తుంటాం.

ఆకాశం నుంచి చూసినప్పుడు దిల్లీ కొత్త రైల్వే స్టేషన్ గణితంలో అనంతాన్ని (ఇన్ఫినిటీని) సూచించేందుకు వాడే చిహ్నంలా కనిపిస్తుంది. అందుకే దీనికి 'ఇన్ఫినిటీ టవర్’ అని పేరు పెట్టారు. దీనిలో 70, 40 మీటర్ల ఎత్తైన రెండు భవనాలు ఉండబోతున్నాయి.

స్టేషన్‌ ప్రాంగణంలో నాలుగు దిక్కులా విశాలమైన రోడ్లు ఉంటాయి. స్టేషన్‌లోకి ప్రవేశించేందుకు మొత్తం ఆరు ఎంట్రీ పాయింట్లు ఉంటాయి. బయటకు వెళ్లేందుకు కూడా ఆరు గేట్లు ఉంటాయి.

అజ్మేరీ గేట్, పహార్‌గంజ్... ఈ రెండు వైపులా మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్ ఏర్పాటు చేస్తారు. వీటిలో గ్రౌండ్ ఫ్లోర్లలో 50 బస్సులు ఆగేందుకు వెసులుబాటు ఉంటుంది.

రైళ్లు దిగిన ప్రయాణికులు నేరుగా ఈ బస్సుల సేవలను ఉపయోగించుకోవచ్చు.

రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు చేసేందుకు ఆసక్తి ఉన్న ప్రైవేటు సంస్థల నుంచి రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ (ఆర్ఎఫ్‌క్యూ) దరఖాస్తులను ప్రభుత్వం ఇటీవల ఆహ్వానించింది.

జీఎంఆర్, ఓమెక్స్, అదానీ రైల్వే సహా తొమ్మిది జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఈ దరఖాస్తులు చేశాయి.

ఈ సంస్థల అర్హతలపై సాంకేతికపరమైన పరిశీలన చేసి, ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రభుత్వం బిడ్లను అడుగుతుంది. ప్రక్రియ అంతా పూర్తయ్యాక ఏదో ఒక సంస్థకు దిల్లీ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధి పనుల బాధ్యతలను అప్పగిస్తారు. జులై-ఆగస్టులో ఈ నిర్ణయం రావొచ్చు.

ఎందుకు ముఖ్యం?

రోజువారీ ప్రయాణికుల సంఖ్య పరంగా దిల్లీ రైల్వే స్టేషన్ దేశంలో రెండో అతిపెద్దది.

రోజూ దాదాపు నాలుగున్నర లక్షల మంది ఇక్కడి నుంచి ప్రయాణాలు చేస్తారు. రోజూ 400 రైళ్లు ఇక్కడికి రాకపోకలు సాగిస్తాయి.

దాదాపు 12 లక్షల చదరపు మీటర్ల బిల్ట్ అప్ స్థలంలో రైల్వే స్టేషన్‌ను పునరాభివృద్ధి చేయబోతున్నారు.

''మొత్తం నిర్మాణ స్థలంలో 2.5 లక్షల చదరపు మీటర్ల స్థలాన్ని ప్రాజెక్టు చేపట్టే సంస్థకు 60 ఏళ్లపాటు రైల్వే లీజుకు ఇస్తుంది.

ఆ సంస్థ తమ ఇష్టప్రకారం దుకాణాలు, హోటళ్లు, షాపింగ్ కాంప్లెక్స్, వ్యాపార కేంద్రాల వంటివి అందులో ఏర్పాటు చేసుకోవచ్చు’’ అని రైల్ లాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఆర్ఎ‌ల్‌డీఏ) వైస్ ఛైర్మన్ వేద్ ప్రకాశ్ డూడెజా బీబీసీతో చెప్పారు.

స్టేషన్‌ను అభివృద్ధి చేసే సంస్థకు ఈ స్థలం ఓ ఆదాయ మార్గంగా ఉపయోగపడుతుంది.

ప్రస్తుతం దిల్లీ రైల్వే స్టేషన్

ప్రాజెక్టు వ్యయం, ఆదాయం...

దిల్లీ రైల్వే స్టేషన్‌ను పునరాభివృద్ధి ప్రాజెక్టుకు దాదాపు 6,500 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా ఉన్నట్లు వేద్ ప్రకాశ్ చెప్పారు.

స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్న సంస్థ ఇందులో 5 వేల కోట్ల రూపాయలు రైల్వే పనుల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్లాట్‌ఫామ్‌లు, కాన్‌కోర్స్, వెయిటింగ్ ఏరియా, రైల్వే సిబ్బంది కార్యాలయాలు, ఇళ్లు, మల్టీలెవెల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌లు ఉంటాయి.

మిగతా 1,500 కోట్ల రూపాయాలను ఆ సంస్థ తమ రియల్ ఎస్టేస్ పనుల కోసం ఖర్చు చేసుకోవచ్చు.

డిజైన్-బిల్డ్-ఫైనాన్స్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్ఓటీ) పద్ధతిలో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు చెబుతున్నారు.

పనులు మొదలుపెట్టిన తర్వాత నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రణాళికలు వేస్తున్నారు.

దిల్లీలో 'హార్ట్ ఆఫ్ ద సిటీ’గా చెప్పే కనాట్ ప్లేస్‌కు సమీపంలో 60 ఏళ్లపాటు 2.5 లక్షల చదరపు మీటర్ల స్థలం లీజుకు రావడం అంటే చిన్న విషయం కాదు. అందుకే, విమానాశ్రయాలు అభివృద్ధి చేసిన అనుభవం ఉన్న జీఎంఆర్, అదానీ లాంటి సంస్థలు దీన్ని పూర్తి చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.

రైల్వే

సంస్థలకు ఎంత అనుభవం ఉంది?

''ఆర్ఎఫ్‌క్యూ‌లో తొమ్మిది సంస్థలు ఆసక్తి చూపించాయి. అరేబియన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ, అదానీ రైల్వే ట్రాన్స్‌పోర్ట్ లిమిటెడ్, ఎంకరేజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్, జీఎంఆర్ హైవేస్ లిమిటెడ్, ఓమెక్స్ లిమిటెడ్ లాంటి సంస్థలు వీటిలో ఉన్నాయి’’ అని వేద్ ప్రకాశ్ వివరించారు.

''రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న సంస్థలే ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో రియల్ ఎస్టేట్ అభివృద్ధి కూడా పెద్ద భాగంగా ఉంది. భారత్‌లో స్టేషన్ల పునరాభివృద్ధి పనులు చేపట్టడం ఇదే తొలిసారి. కాబట్టి అనుభవం ఉన్న సంస్థలు లేవు. విమనాశ్రయాలను మనం స్టేషన్లలాగే చూడొచ్చు’’ అని ఆయన అన్నారు.

అదానీ రైల్వే ట్రాన్స్‌పోర్ట్ లిమిటెడ్‌కు రైల్వే, మెట్రోల పనులు చేసిన అనుభవం ఉంది.

దేశంలో అతిపొడవైన ప్రైవేటు రైలు మార్గం (300 కి.మీ.ల పొడవు) పనులు కూడా ఆ సంస్థ చేసింది. తమ పోర్టులకు, గనులకు, వ్యాపార కేంద్రాలకు సరుకులు రవాణా చేసేందుకు ఈ మార్గాన్ని ఉపయోగిస్తోంది.

ఇవి కాకుండా, దేశంలో ఆరు విమానాశ్రయాలు అభివృద్ధి చేసేందుకు కాంట్రాక్టులు కూడా అదానీ సంస్థ చేజిక్కించుకుంది.

ఇక జీఎంఆర్ సంస్థ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద విమానాశ్రయ అభివృద్ధి సంస్థగా ఉంది. దిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాలను ఆ సంస్థే అభివృద్ధి చేసింది. అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిలో ఆ సంస్థకు అనుభవం ఉంది.

పెరుగుతున్న జనాభా, ఆధునిక సాంకేతిక సదుపాయాలను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం దేశంలోని దాదాపు 400 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేయాలని ప్రణాళికలు వేస్తోంది.

మొదటి దశలో 123 స్టేషన్ల పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ బాధ్యతలను రైల్వే శాఖ కింద పనిచేసే రైల్ లాండ్ డెవెలప్‌మెంట్ అథారిటీ (ఆర్ఎ‌ల్‌డీఏ), ఇండియన్ రైల్వే స్టేషన్ డెవెల‌ప్‌మెంట్ కార్పొరేషన్లకు అప్పగించారు.

దిల్లీ సహా 62 స్టేషన్ల బాధ్యతలను ఆర్‌ఎల్‌డీఏకు అప్పగించారు. తిరుపతి, దెహ్రాదూన్ లాంటి స్టేషన్లు కూడా వీటిలో ఉన్నాయి. మరో 61 స్టేషన్ల బాధ్యతలను ఇండియన్ రైల్వే స్టేషన్ డెవెల‌ప్‌మెంట్ కార్పొరేషన్‌కు అప్పగించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
GMR and Adani's interest in Delhi railway station,what's going on there
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X