గోవా అసెంబ్లీ పోరు-తొలిసారి 12 మంది క్రైస్తవులకు బీజేపీ అవకాశం-40 మందిలో వారే
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. గతంలో మనోహర్ పరిక్కర్ వంటి నేతల సాయంతో గోవాలో అధికారం సాధించిన బీజేపీకి ఈసారి చుక్కలు కనిపిస్తున్నాయి. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ గోవాలో బీజేపీకి గట్టిపోటీ ఇస్తున్నాయి. దీంతో బీజేపీ తొలిసారి వ్యూహాలు మార్చుకుంటోంది.
గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన 40 మంది అభ్యర్ధుల జాబితాలో ఏకంగా 12 మంది క్రైస్తవులకు చోటు లభించంది. హిందూత్వ రాజకీయాలు చేసే బీజేపీ రాష్ట్రంలో తొలిసారి ఇంతమంది క్రైస్తవులకు చోటు కల్పించింది. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. అటు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎదురవుతున్న పోటీతోనే క్రైస్తవులకు ఎక్కువ సంఖ్యలో బీజేపీ చోటిచ్చినట్లు తెలుస్తోంది. 2012లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఆరుగురు క్రైస్తవులకు మాత్రమే టికెట్లు కేటాయించింది. ఈసారి మారిన పరిస్ధితుల్లో దానికి రెట్టింపు స్ధాయిలో 12 మంది క్రైస్తవులకు చోటివ్వడం విశేషం.

గోవా జనాభాలో 66 శాతం మంది హిందువులే. బీజేపీకి రాష్ట్రంలో ఉన్న పార్టీ కార్యకర్తల్లో మొత్తం 3.5 లక్షల మందిలో 18 శాతం మాత్రమే హిందువులు. అయినా బీజేపీ ఈసారి దాదాపు 30 శాతం మంది క్రైస్తవులకు ఈసారి ఎన్నికల్లో సీట్లు ఇవ్వడంతో మారిన రాజకీయ పరిస్దితులు బీజేపీని ఏ స్దాయిలో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు.
బీజేపీ మతతత్వ పార్టీ కాదని, సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందని, ఇందులో భాగంగానే ఇంతమంది మైనార్టీలకు ఈసారి టికెట్లు కేటాయించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్ తనవాడే ప్రకటించారు. అయితే ఈసారి జాబితాలో బీజేపీ రాష్టంలో 8 శాతం మంది జనాభా కలిగిన ముస్లింల నుంచి ఒక్క అభ్యర్ధికి కూడా సీటు ఇవ్వకపోవడం విశేషం.