వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగారం, వెండి ధరలు.. మహాపతనం - ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బంగారం

బంగారం, వెండి ధరలు మరోసారి క్షీణపథంలో పయనిస్తున్నాయని.. దేశ, విదేశీ మార్కెట్లో ఉన్నట్టుండి మంగళవారంం భారీగా పడిపోయిన ధరలు బుధవారం ట్రేడింగ్‌లోనూ అమ్మకాలతో డీలా పడ్డాయని 'సాక్షి’ ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో బంగారం 10 గ్రాముల ధర రూ. 1439 (2.8 శాతం) క్షీణించి రూ. 50,490కు చేరింది. ఇది అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 4,896 తగ్గి రూ. 62,038 వద్ద వద్ద ట్రేడవుతోంది.

మంగళవారం ఎంసీఎక్స్‌లో బంగారం 10 గ్రాముల ధర రూ. 3,017 పతనమై రూ. 51,929కు చేరింది. వెరసి అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ ధర 6 శాతం క్షీణించగా.. వెండి కేజీ ధర మరింత అధికంగా రూ. 8,460 పడిపోయి రూ. 66,934 వద్ద వద్ద ముగిసింది. ఫలితంగా సెప్టెంబర్‌ ఫ్యూచర్స్‌ వెండి 12 శాతం కుప్పకూలింది. గత వారాంతాన తొలుత బంగారం, వెండి ధరలు ఎంసీఎక్స్‌ చరిత్రలో సరికొత్త గరిష్టాలను సాధించగా.. చివర్లో తోకముడిచిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ (31.1 గ్రాములు) పసిడి 41 డాలర్లు (2.2 శాతం) దిగజారి 1,905 డాలర్ల వద్ద కదులుతోంది. స్పాట్‌ మార్కెట్లోనూ 18 డాలర్లు తక్కువగా 1,894 డాలర్లకు చేరింది. ఈ బాటలో వెండి ఔన్స్‌ 7.5 శాతం పడిపోయి 24.10 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

2013 తదుపరి: మంగళవారం గత ఏడేళ్లలోలేని విధంగా న్యూయార్క్‌ కామెక్స్‌లో బంగారం ఫ్యూచర్స్‌ 4.6 శాతం (93 డాలర్లు) పతనమై 1,946 డాలర్ల వద్ద నిలవగా.. స్పాట్‌ మార్కెట్లో 4.2 శాతం తిరోగమించి 1912 డాలర్ల దిగువన స్థిరపడింది. ఇక వెండి 11 శాతం పడిపోయి 26.04 డాలర్ల వద్ద ముగిసింది. ఇంతక్రితం 2013 ఏప్రిల్‌లో మాత్రమే ధరలు ఈ స్థాయిలో క్షీణించినట్లు విశ్లేషకులు తెలియజేశారు.

కోవిడ్‌కు రష్యా వ్యాక్సిన్‌ను ప్రకటించడం, జులైలో ధరలతోపాటు.. డాలరు బలపడటం, 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌ ఆరు పాయింట్లు పుంజుకోవడం వంటి అంశాలు పసిడి ధరలకు చెక్‌ పెట్టినట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు గత మూడు వారాలలోనే పసిడి ధరలు 14 శాతం ర్యాలీ చేయడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణ చేపడుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో బంగారం ధరలు డీలాపడినట్లు వివరించారు.

వైఎస్ జగన్

కేసీఆర్‌ మాటలు పట్టించుకోవద్దు.. 'అపెక్స్‌’లోనే సమాధానం చెబుదాం: జగన్

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ విస్తరణ ద్వారా రోజుకు మూడు టీఎంసీలను తీసుకెళ్లేందుకు తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను పట్టించుకోనక్కరలేదని సీఎం జగన్‌ స్పష్టం చేసినట్లు తెలిసిందని 'ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. పోతిరెడ్డిపాడు పథకం సహా ఇతర స్కీంలపై తెలంగాణ వెలిబుచ్చుతున్న అభిప్రాయాలకు ఈ నెల 20వ తేదీ తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగగ్‌ షెకావత్‌ అధ్యక్షతన జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనే సమాధానాలిద్దామని చెప్పినట్లు తెలిసింది.

నీటి ప్రాజెక్టులపై బుధవారమిక్కడ జలవనరుల శాఖ అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కేసీఆర్‌ చేసిన వ్యాఖ్య లు ఈ భేటీలో చర్చకు వచ్చాయి. రాయలసీమ పథకంపై ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని అధికారులు చెప్పారు.

సీఎం స్పందిస్తూ.. నీటి ప్రాజెక్టుల నిర్మాణాలన్నీ కృష్ణా ట్రైబ్యునల్‌ కేటాయింపుల మేరకు చేపడుతున్నామని చెప్పారు. కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనే సరైన సమాధానం చెబుదామన్నారు.

'పొరుగు రాష్ట్రంతో స్నేహపూర్వక వాతావరణం ఉండాలని కోరుకుంటున్నాం. కానీ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందంటే అంగీకరించేది లేదు. నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ప్రాజెక్టుల నిర్మాణంపై రాష్ట్ర విభజనకు ముందు నుంచి ఇచ్చిన ఉత్తర్వులను సిద్ధం చేయండి’ అని ఆదేశించారు. రాష్ట్ర వాదనను బలంగా వినిపిద్దామని తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి రావలసిన నిధులపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులకు సూచించారు. అలాగే పునరావాస కార్యక్రమాలకూ ప్రాధాన్యమివ్వాలని తెలిపారు. సాగునీటి సమీక్షలో కరోనా సమయంలోనే పోలవరం పనులు కొనసాగిస్తున్నామని.. అధికారులు వివరించారు. సెప్టెంబరు 15 నాటికి పిల్లర్ల పనులు పూర్తవుతాయన్నారు. వర్షాకాలంలోనూ పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.

ఆదివాసీ మహిళలు

తెలంగాణ: బంజార, కోయ, గోండి, కొలామి.. గిరిజన భాషల్లోనే వాచకాలు

గిరిజన తెగల చిన్నారులు తెలుగుతో పాటు ప్రత్యేకంగా ఉండే తమ తెగలకు సంబంధించిన భాషల్లోనూ చదువుకునేలా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని 'నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ప్రాథమిక విద్యను పటిష్ఠం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,426 గిరిజన పాఠశాలలను నెలకొల్పి గిరిజన విద్యార్థులు తమ మాతృభాషలోనే చదువుకునేందుకు 2020-21 విద్యా సంవత్సరానికిగాను వాచకాలను రూపొందించింది.

గిరిజనులకు మాతృభాషలోనే ప్రాథమిక విద్యను అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆలోచన మేరకు గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణా సంస్థ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.

ఇందుకుగాను ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు కొలామి వాచకం, గోండి వాచకం, బంజార వాచకం, కోయ వాచకాలను ఈ విద్యాసంవత్సరానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. మాతృభాషలో బోధనతో విద్యార్థులు ఉత్సాహవంతంగా చదువుతారు. పాఠశాలల్లో డ్రాపౌట్స్‌ కూడా తగ్గుతాయని ప్రభుత్వం భావించింది.

ఇందుకోసం గిరిజన చిన్నారులు భాషా అవరోధాన్ని అధిగమించేందుకు ప్రత్యేకంగా గిరిజన భాష వాచకాలు రూపొందించారు. ఈ వాచకం ద్వారా ఒకటో తరగతిలో నేర్చుకున్న భాషా నైపుణ్యాలను ఒకటవ పాఠంలో పునశ్చరణ చేసి, తక్కిన పాఠాల్లో విద్యార్థి పఠన, లేఖన, శ్రవణ నైపుణ్యాలను పెంపొందించడానికి అవసరమైన గిరిజన ఇతివృత్తాలు ఎంచుకొని ఆసక్తికరంగా తయారుచేశారు.

2019-20లో ప్రయోగాత్మకంగా బంజారా, గొండి, కోయ, కొలామి భాషల్లో చిన్న పదాలతో పుస్తకాలను రూపొందించి ఆయా పాఠ్య పుస్తకాలతోపాటు తమ భాషకు సంబంధించిన పదాలను నేర్చుకునేలా దృష్టి పెట్టారు.

2020-21 విద్యాసంవత్సరం కోసం పూర్తిస్థాయిలో ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు గిరిజన భాషల్లో వాచకాలను తయారుచేసి అందుబాటులోకి తెచ్చారు.

ఈ వాచకాల్లో పదజాలం, చిత్రాలు గిరిజన విద్యార్థులు తమ ఇంట్లో రోజూ ఉపయోగించే అంశాల గూర్చి ఉండటం వల్ల తేలికగా అర్థం చేసుకోగలుగుతారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలను పాఠ్యాంశాల్లో పెట్టడంతో వారి సంస్కృతిని కాపాడుకోగలుగుతారు.

గిరిజన భాషలోని పాఠాలను ఉపాధ్యాయులు తెలుగు భాషలో బోధించేందుకు వీలుగా ప్రతి గిరిజన భాషా వాచకం వెనుక భాగంలో క్లుప్తంగా తెలుగులో పాఠాలను పొందుపరిచారు.

రాష్ట్రపతి కార్యాలయం ఆదేశాలు

దళిత యువకుడి శిరోముండనం కేసులో ప్రత్యేక అధికారిని నియమించిన రాష్ట్రపతి

ఆంధ్రప్రదేశ్‌లో దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం చేసిన కేసుపై భారత రాష్ట్రపతి కార్యాలయం స్పందించిందని.. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బాధితుడికి అండగా నిలబడేందుకు ప్రత్యేక అధికారిని నియమించారని 'ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. రాష్ట్రపతి స్పందనతో ఈ కేసుకు సంబంధించిన దస్త్రం ఏపీకి చెందిన సాధారణ పరిపాలన విభాగానికి బదిలీ అయింది. అసిస్టెంట్‌ సెక్రటరీ జనార్ధన్‌బాబును కలవాలని, కేసు విషయంలో ఆయనకు సహకరించాలని బాధితుడు వరప్రసాద్‌కు రాష్ట్రపతి కార్యాలయం సూచించింది. దీంతో త్వరలో పూర్తి ఆధారాలతో బాధితుడు జనార్ధన్‌బాబును కలవనున్నారు.

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో స్థానిక వైకాపా నాయకుడి అనుచరుడి ఫిర్యాదు మేరకు ఇటీవల వెదుళపల్లిలో వరప్రసాద్‌ అనే ఎస్సీ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని తీవ్రంగా గాయపర్చడంతోపాటు పోలీస్‌స్టేషన్‌లోనే శిరోముండనం చేశారు.

ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం ఈ ఘటనతో మనస్తాపం చెందిన వరప్రసాద్‌ తాను నక్సలైట్లలో కలుస్తానంటూ ఇటీవల రాష్ట్రపతికి లేఖ రాశారు. వరప్రసాద్‌ లేఖపై రాష్ట్రపతి స్పందించి చర్యలు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Gold and silver prices are on a downward trend once again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X