ఆలయంలో నిర్మాణ పనులు: బంగారం మూట దొరికింది!
చెన్నై: తమిళనాడులోని కాంచీపురం జిల్లా ఉత్తిరమేరూర్లో రెండో కులోత్తుంగ చోళన్ కాలంలో నిర్మించిన కుళంభేశ్వర ఆలయం జీర్ణోద్ధరణ పనుల్లో 100 సవర్ల బంగారు ఆభరణాలు, నగలు లభ్యమయ్యాయి. జేసీబీతో ఆలయంలో ఉన్న మూల విరాట్టుగా ఎదురుగా ఉన్న రాతి మెట్లను తొలగిస్తుండగా.. వస్త్రంలో చుట్టి ఉంచిన బంగారు ఆభరణాల మూట బయటపడింది.
విషయం తెలిసిన రెవెన్యూ అధికారులు, పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆ బంగారాన్ని తిరిగి ఇచ్చేందుకు స్తానికులు నిరాకరించడంతో వెనుదిరిగారు. ఆలయానికి సంబంధించినవి కావడంతో తాము దేవుడి కోసమే వినియోగిస్తామని స్పష్టం చేశారు.

కాగా, కాంచీపురం ఆర్డీవో విద్య, ఇతర అధికారులు ఆదివారం వెళ్లి నిర్వాహకులతో చర్చించారు. మహాకుంభాభిషేక నిర్వహణ సమయంలో ఆభరణాలను ఆలయానికి తీసుకురావాలనే షరతు మేరకు నిర్వాహకులు వాటిని అధికారులకు అప్పగించారు.

గత ఆలయ నిర్వాహకులు గతంలో మందిర గోడల్లో, ఇతర ప్రాంతాల్లో నగలను దాచి ఉంచవచ్చని భావిస్తున్నారు. ఆలయంలో భారీ ఎత్తున బంగారం లభించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
లభ్యమైన బంగారం సుమారు 565 గ్రాములు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఉన్నతాధికారులతో సంప్రదించిన అనంతరం ఆ ఆభరణాలను గుడి అప్పగించాలా? లేదా? అనేదానిపై నిర్ణయం తీసుకుంటామని రెవెన్యూ అధికారులు వెల్లడించారు.