• search
  • Live TV
అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

గుడ్ మార్నింగ్ ధర్మవరం: ఎమ్మెల్యే కేతిరెడ్డి పర్యటనల్లో ఏం జరుగుతోంది? ప్రజలు ఏమంటున్నారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
Click here to see the BBC interactive

"అమ్మా..బాగున్నావా, ఆసరా పథకమొచ్చిందా"

"అవ్వా.. ఎట్టున్నావ్, పెన్షన్ అందుతుందా"

"ఏరా స్కూలుకి పోలేదా..." ఇట్టా సాగుతుంది ఆయన పలకరింపు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా తన దగ్గరికి వచ్చిన వారితోనే కాకుండా, తాను నడిచివెళుతున్న దారిలో కనిపించిన అందరినీ పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు.

ఊరూ, వాడా తిరుగుతూ ఉదయాన్నే అందరినీ పలకరిస్తూ గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేస్తున్న ప్రయత్నం చర్చనీయమవుతోంది.

ముఖ్యంగా సోషల్ మీడియాలో దానికి విస్తృతంగా ప్రచారం లభించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అసలు ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరం ఎలా మొదలయ్యింది.. ఎందుకంత ప్రచారం వస్తోందన్నది తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది.

విద్యార్థులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి

విపక్షంలో ఉన్నా అంతే..

అనంతపురం జిల్లాలోని ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి 2019లో రెండోసారి గెలిచారు.

అంతకుముందు ఆయన 2009లో ఓ మారు గెలిచారు. 2014లో టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

కానీ ఈసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన నిర్వహిస్తున్న గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే కార్యక్రమం నియోజకవర్గ వాసులతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం దానికి కారణమవుతోంది.

"నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలానే చేశాను. ఎన్నికల సమయంలో పెద్దగా ప్రచారం చేయను. అప్పుడు కేవలం సభలు నిర్వహించి, మా విధానాలు చెబుతానంతే. కానీ నిత్యం ప్రజలతో సంబంధాలు కొనసాగించేందుకు ఈ ప్రయత్నం ఉపయగపడుతోంది. ఉదయాన్నే నాకు మార్నింగ్ వాక్ లా ఉంటుంది. జనాలకు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం వస్తుంది. స్థానికంగా వెంటనే పరిష్కారమయ్యే విషయాలకు పరిష్కారం దక్కుతుంది. అటు ప్రజలకు, ఇటు నాకు తృప్తినిస్తుంది. అందుకే కొనసాగిస్తున్నాను. ప్రారంభంలో ఇలా చేయాలని అనుకోలేదు. కానీ జనాల్లోకి వెళ్లిన తర్వాత గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే పేరు పెట్టడం, దానికి తగ్గట్టుగా నియోజకవర్గమంతటా విస్తృతంగా పర్యటించేందుకు అవకాశం రావడంతో ఈ పని చేస్తూ ఉన్నా" అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి బీబీసీకి తెలిపారు.

ఈ నియోజవర్గంలో ధర్మవరం మునిసిపాలిటీతో పాటుగా మండలం, బత్తలపల్లె, తాడిమర్రి, ముదిగుప్ప మండలాలున్నాయి. వారంలో ఐదు రోజుల పాటు రోజుకో మండలం చొప్పున ఈ కార్యక్రమం చేస్తున్నట్టు ఎమ్మెల్యే వివరించారు. తద్వారా అందరికీ అందుబాటులో ఉండేదుకు అవకాశం వస్తోందన్నారు.

చాలామంది ఫాలో అవుతున్నారు..

ప్రతిపక్షంలో ఉండే సమయంలో ప్రజలతో ఉండే నేతలు, అధికారం దక్కిన తర్వాత సామాన్యులకు దూరమవుతారని సహజంగా ఉండే అభిప్రాయం. కానీ కేతిరెడ్డి దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

ప్రజలకు చేరువలో ఉండేదుకు ఆయా గ్రామాలకే వెళుతున్నారు. అయితే ఎమ్మెల్యేగా గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో అన్ని గ్రామాలను ఇప్పటి వరకూ కవర్ చేయలేకపోయామని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు.

"కరోనా వల్ల కొంత ఆటంకం వచ్చింది. లాక్ డౌన్ ఇతర సమస్యల మూలంగా చాలాకాలం పాటు ఊళ్లకు వెళ్లే అవకాశం రాలేదు. దాంతో అన్ని గ్రామాలను కవర్ చేయాలనే లక్ష్యం ఇంకా నెరవేరలేదు. పరిస్థితులు చక్కబడితే అన్ని ఊళ్లకు వెళతాం. సోషల్ మీడియాలో ప్రచారం చేయాలనే ఆలోచన మొదట లేదు. కానీ అది అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉపయోగించుకోవాలని అనుకున్నాం. ఓ టీవీ చానెల్, ఓ పత్రిక మాదిరిగానే వాడుకుంటే ఉపయోగం అని భావించాం. దానికి తగ్గట్టుగా కొన్ని వీడియోలకు మంచి స్పందన వచ్చింది. లైవ్ చేయాలని నిర్ణయించి, కార్యక్రమాన్ని నేరుగా ప్రజల్లోకి ప్రసారం చేస్తున్నాం. రెండు రకాలుగా ఇది ఉపయోగమని అనుకుంటున్నాం. అలాంటి సమస్యలే ఉన్న వారికి అవగాహన కల్పించడం, సమస్య పరిష్కారానికి ఉన్న మార్గాలను నేరుగా చెప్పడానికి సోషల్ మీడియా ఉపయోగపడుతోంది. చాలా మంది చేస్తున్నారు" అంటూ ఆయన వివరించారు.

ఏపీలో కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేల మీద ఈ కార్యక్రమం ప్రభావం పడింది. కొందరు ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. తాము పాల్గొనే కార్యక్రమానలు నేరుగా సోషల్ మీడియాలో లైవ్ ఇచ్చేందుకు యత్నిస్తున్నారు. కేతిరెడ్డి నిర్వహిస్తున్న కార్యక్రమానికి వస్తున్న స్పందన కొద్దిమేరకు కదలిక తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తోంది.

సాంకేతిక ఏర్పాట్లు

తెరవెనుక ఏం జరుగుతుంది..

గుడ్ మార్నింగ్ ధర్మవరం ఫేస్ బుక్ లైవ్ చాలా మంది చూసే ఉంటారు. లైవ్ లో వివిధ సందర్భాల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పందన వైరల్ అయిన అనుభవాలు కూడా ఉన్నాయి.

అయితే ఈ కార్యక్రమం రూప కల్పన నుంచి, లైవ్ ప్రసారాల వరకూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దానికి ఓ టీమ్ ని సిద్ధం చేశారు.

ఉదయాన్నే ఆరున్నర, ఏడు గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే ఊరుకి చేరుకుని ఇంటింటా తిరగడం ప్రారంభిస్తారు.

దానికి ముందే సోషల్ మీడియా టీమ్ ఆ గ్రామానికి చేరుకుంటుంది.

నెట్ వర్క్ సహా ఇతర ఏర్పాట్లు చేసుకుంటుంది. ఎమ్మెల్యే రావడంతోనే పాదయాత్రకు బయలుదేరేందుకు అనుగుణంగా సిద్ధమవుతూ ఉంటారు.

"రెండు రోజుల ముందే కార్యక్రమం నిర్ణయం అవుతుంది. ఫలానా గ్రామంలో కార్యక్రమం ఉందని తెలియగానే సంబంధిత అధికారులందరికీ తెలియజేస్తాం. అన్ని శాఖల ప్రతినిధులు వచ్చేలా చూస్తాం. తద్వారా ప్రజల నుంచి వచ్చే సమస్యలన్నింటికీ వీలున్నంత వరకూ అక్కడే పరిష్కారం చూస్తాం. లేదంటూ ఎమ్మెల్యేకి వచ్చిన ప్రతీ వినతిని నోట్ చేసుకుంటాం.అందులో గ్రామ సచివాలయం స్థాయిలో పరిష్కారమయ్యేవి, మండల, జిల్లా, నేరుగా ప్రభుత్వ విధానాలతో సంబంధించినవిగా విభజిస్తాం. స్థానికంగా పరిష్కారమయ్యే వాటిని రెండు రోజుల్లో పూర్తి చేసి మళ్లీ నివేదిక అందించాలని అధికారులకు చెబుతుంటాం. మండల, జిల్లా స్థాయిల్లో వాటిని ప్రత్యేకంగా ఓ టీమ్ ఫాలో అప్ చేస్తూ ఉంటుంది. దాని వల్ల ఎక్కువ సమస్యల పరిష్కారానికి ఆస్కారం దక్కుతోంది" అంటూ ఆ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా ఉన్న శ్రీనివాసరెడ్డి బీబీసీకి తెలిపారు.

ఎమ్మెల్యే కార్యాలయంలో దానికోసం ఓ కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఫలానా గ్రామంలో కార్యక్రమం నిర్ణయించగానే ముందుగా కాల్ సెంటర్ నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులకు సమాచారం చేరవేస్తారు. కార్యక్రమం తర్వాత ప్రజల నుంచి వచ్చిన సమస్యలన్నీ నమోదు చేసి పరిష్కారానికి ఫాలో అప్ జరుగుతూ ఉంటుందని శ్రీనివాసరెడ్డి వివరించారు.

నిరంతరం ప్రజలకు ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే ఆఫీసుని నేరుగా కాల్ సెంటర్ కి కాల్ చేసి సంప్రదించేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు.

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి

గుడి, బడి అన్నింటినీ పరిశీలిస్తూ

ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఎక్కువ వినతులు వస్తూ ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. పెన్షన్ల సమస్య, విద్యాకానుక, అమ్మ ఒడి వంటి పథకాలు అందకపోవడం, ఇళ్ల స్థలాల లబ్దిదారుల అంశం వంటివి ఎక్కువగా గుడ్ మార్నింగ్ ధర్మవరంలో వస్తూ ఉంటాయి. ఇక కొన్నిసార్లు వ్యక్తిగత తగాదాలు కూడా ఎమ్మెల్యే నేరుగా పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బిడ్డలు తల్లిని సాకడం లేదని ఫిర్యాదులొచ్చినా, బడిలో టీచర్ సకాలంలో రావడం లేదని పిల్లలు చెప్పినా వెంటనే ఎమ్మెల్యే జోక్యం చేసుకున్న అనుభవాలు కూడా ఉన్నాయి. డ్వాక్రా మహిళల సమస్యలు, భూ సమస్యలు కూడా స్థానిక పోలీసుల సహకారంతో పరిష్కరించే యత్నం జరిగింది.

"ఈ కార్యక్రమం లో ప్రతీ ఊరి బడికి వెళ్లి పిల్లలను పలకరించడం వల్ల ఉపయోగం ఉంటుది. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యం మీద శ్రద్ధ పెట్టింది. ఈరెండూ సక్రమంగా అందించాలి. అందుకోసమే ప్రధాన లక్ష్యం వాటిని అందించడమే. సంక్షేమం విషయంలో ఎక్కువగా అర్జీలు వస్తుంటాయి. వాటిని చూస్తూనే పిల్లలతో మాట్లాడి స్కూళ్లు బాగు కోసం ఏం చేయాలనేది ఆలోచిస్తూ ఉంటాం. సజావుగా వైద్యం అందించడానికి మార్గాలు చూస్తుంటాం. తద్వారా సామాన్యులకు వ్యక్తిగత ప్రయోజనాలతో పాటుగా సామూహిక అవసరాలు కూడా నెరవేరేందుకు అన్ని చోట్లా ప్రయత్నిస్తున్నాం" అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి వివరించారు.

కేతిరెడ్డి వెంట బత్తలపల్లె మండలం చెర్లోపల్లిలో బీబీసీ పర్యటించింది. ఆ సందర్భంగా స్థానికంగా డ్వాక్రా మహిళలు తమకు సమావేశ మందిరం కావాలంటూ ఎమ్మెల్యేకి విన్నవించారు. వెంటనే పాత స్కూల్ భవనం దానికి కేటాయించాలంటూ ఆయన ఎమ్ ఈ వోని ఆదేశించారు. దానికి మహిళలు సంతృప్తి వ్యక్తం చేశారు.

"ఇంతకుముందు సమస్య చెప్పుకోవాలంటే ఆఫీసుకి పోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఎమ్మెల్యేనే మాకాడికి వస్తున్నారు. మాకు ఆసరా డబ్బులు, పావలా వడ్డీ డబ్బులు రాకపోయినా, ఎవరికైనా ఆగిపోయినా వెంటనే స్పందిస్తున్నారు. దాని వల్ల ఇలా ఇంటింటికీ రావడం బాగుంది. అందరికీ ఉపయోగపడుతోంది. మాకు సమావేశ మందిరం కావాలని గ్రామ సమాఖ్య తరుపున అడిగినాం. వెంటనే తాత్కాలిక అవసరాల కోసం పాత స్కూల్ భవనం ఇప్పియ్యాలని చెప్పారు. మాకు సంతోషం" అంటూ డ్వాక్రా మహిళా సంఘం నాయకురాలు లక్ష్మీ బీబీసీతో అన్నారు.

అక్కడే స్కూల్ కి వెళ్లిన కేతిరెడ్డి టేబుల్ మీద ఉన్న డ్రిప్ ఇరిగేషన్ కోసం వాడే పాత పైప్ ముక్క ఒకటి చూశారు. వెంటనే దీంతో మీ సారు కొడుతున్నారా అని పిల్లలని అడగడం, వాళ్లు కొడుతున్నారని చెప్పడంతో పశువులను కూడా వీటితో కొట్టం కదా అంటూ ఉపాధ్యాయుడి మీద అసహనం ప్రదర్శించారు ఎమ్మెల్యే.

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి

ప్రయత్నం మంచిదే గానీ..

"ప్రజా ప్రతినిధి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడం అభినందించదగ్గ విషయం. కానీ సమస్యలు పేరుకుపోతున్నాయి. నిధులు లేకుండా ప్రకటనలు చేసి ఏమి ప్రయోజనం. ముదిగుప్ప మండలంలో రోడ్ల కోసం ఎమ్మెల్యేకి విన్నవించారు. కానీ మోక్షం లేదు. అలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా తాగునీటి సమస్య కూడా ఉంది. వేసవిలో సమస్య తీవ్రంగా ఉంటుంది. సంక్షేమ పథకాల విషయంలో పరిష్కారం దక్కుతోంది గానీ ఇతర విషయాల్లో ప్రచారం కోసమే అన్నట్టుగా ఉంటుంది. ఇంకా కొంత శ్రద్ధ పెట్టి జనాలకు ఉపయోగపడే పథకాలను ధర్మవరం నియోజకవర్గానికి తీసుకువస్తే ఎక్కువ ఉపయోగం. అప్పుడే ప్రజలు హర్షిస్తారు" అంటూ రిటైర్డ్ ఉద్యోగి ఈరపనేని రామాంజనేయులు అభిప్రాయపడ్డారు.

గడిచిన మూడేళ్లలో ధర్మవరంలో కొత్తగా అభివృద్ధి మీద శ్రద్ధ కనిపించలేదంటూ ఆయన బీబీసీతో అన్నారు.

ఇంట్లో కరెంటు స్తంభం

ధర్మవరం మండలం గుండ్లూరులో గతంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం సందర్భంగా ఓ ఇంటిలోపలే విద్యుత్ స్తంభం ఉన్న తీరు చూసి ఎమ్మెల్యే ఆశ్చర్యపోయిన ఘటన బాగా వైరల్ అయ్యింది.

అప్పట్లో ఆ స్తంభం తొలగించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అయితే ఆ ఇంటిని బీబీసీ పరిశీలించినప్పుడు స్తంభం యధావిధిగా ఇంట్లోనే ఉంది.

ఆరు నెలలుగా ఎమ్మెల్యే హామీకి మోక్షం కలగలేదు. ఆ ఇంటిస్థలం మీద వివాదం ఉందని, న్యాయస్థానం పరిధిలో కేసు ఉన్నందున తొలగించడం సాధ్యం కాలేదని ట్రాన్స్ కో అధికారులు బీబీసీకి తెలిపారు.

గుడ్ మార్నింగ్ ధర్మవరం విస్తృత ప్రచారం సాధించింది. సోషల్ మీడియా ద్వారా చాలామందికి చేరువయ్యింది. ఎమ్మెల్యే కేతిరెడ్డి చొరవను చాలామంది అభినందిస్తున్నారు. అయితే అభివృద్ధికి సంబంధించి మరింత దృష్టి పెట్టాలనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Good Morning Dharmavaram: What is going on in MLA Kethireddy's tours? What are people saying
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X