గుడ్ న్యూస్: పండుగ సమయంలో తగ్గిన వంటనూనెల ధరలు; ఎమ్మార్పీపై 15% వరకు తగ్గింపు
నిన్నమొన్నటి వరకు కొండెక్కి కూర్చున్న వంటనూనెల ధరలు కాస్త తగ్గుముఖం పట్టడం వినియోగదారులకు శుభవార్త అని చెప్పాలి. విపరీతంగా పెరిగిపోయిన ధరలతో ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అంటూ బాధ పడుతున్న సామాన్య ప్రజలకు, మహిళలకు వంటనూనెల ధరలు తగ్గటం నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి . ప్రముఖ వంటనూనెల కంపెనీలు వినియోగదారులకు ఊరట నిచ్చే నిర్ణయాన్ని తీసుకోవడంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. వంటనూనెల కంపెనీలు ఎమ్మార్పీ పై దాదాపు 10 నుండి 15 శాతం మేర ధరలను తగ్గించాయి.

వినియోగదారులకు రిలీఫ్ .. తగ్గినా వంటనూనెల ధరలు
నిత్యావసర వస్తువుల ధరల విషయంలో సామాన్యులకు వంటనూనెల ధరలు తగ్గింపుతో కాస్త ఊరట లభించింది. వంటనూనెల ధరలను ఎమ్మార్పీ పై 10 నుండి 15 శాతం తగ్గిస్తున్నట్లు గా సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ధరలు విపరీతంగా పెరిగిన సమయంలో కిలో వంట నూనె ధర 180 రూపాయల నుండి 200 రూపాయల వరకూ పెరగగా ఆ తర్వాత క్రమంగా తగ్గి 145- 150 రూపాయలకు చేరుకుంది. ఇప్పుడు మళ్లీ మరోమారు వంటనూనెల కంపెనీలు తీసుకున్న నిర్ణయంతో ధరలు బాగా తగ్గాయి. వినియోగదారులకు ఊరట నిచ్చే విధంగా పలు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.

వంట నూనెల ధరలు తగ్గించిన బ్రాండెడ్ వంట నూనెల కంపెనీలు ఇవే
వంటనూనెల ధరలు తగ్గించిన బ్రాండెడ్ కంపెనీల వివరాలను చూస్తే ఫార్చ్యూన్ , రుచి సోయా, రుచి గోల్డ్, న్యూట్రేల్లా, మహాకోష్, ఇమామి, బంగే, ఫ్రీడమ్ ఆయిల్స్ ను ఉత్పత్తి చేసే అదాని విల్మార్, జెమిని, ఇమామి సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇవి మాత్రమే కాక న్యూట్రి లీవ్ బ్రాండ్స్, సన్నీ బ్రాండ్స్, గోకుల్ ఆగ్రో, జైకా బ్రాండ్స్, విటా లైఫ్, మెహక్ ధరలు కూడా ఎం ఆర్ పి పై 10 నుండి 15 శాతం వరకు తగ్గనున్నాయి.

వంట నూనెల కంపెనీల నిర్ణయంతో కిలోకు 20 నుండి 25 రూపాయల వరకు తగ్గింపు
ఇక వంటనూనెల ప్రముఖ కంపెనీలు తీసుకున్న నిర్ణయంతో ఆయిల్ ధర కిలోకు 20 నుండి 25 రూపాయల వరకు తగ్గనుంది. పండుగ సీజన్ ను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ వంటనూనెల సంస్థలు ఎం ఆర్ పి ని తగ్గించడానికి అంగీకరించడం చాలా సంతోషంగా ఉందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. దేశంలో వంటనూనెల ధరల పెరుగుదలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని శుద్ధిచేసిన నూనెల పై దిగుమతి సుంకాన్ని తగ్గింపు చేయడం ద్వారా కాస్త ధరలు తగినట్లుగా తెలుస్తుంది .

కేంద్రం దిద్దుబాటు చర్యలతో తగ్గిన వంట నూనెల ధరలు
రిఫైన్డ్, క్రూడ్, ఎడిబుల్ ఆయిల్స్ పై కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అనేకమార్లు కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ఇటీవల మరోమారు శుద్ధిచేసిన పామాయిల్ పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది. వంటనూనెల ధరల నియంత్రణకు కేంద్రం ఇటువంటి చర్యలకు శ్రీకారం చుట్టడంతో, పలు వంటనూనెల కంపెనీలు వంటనూనెల ధరలు తగ్గించి సామాన్యులకు రిలీఫ్ ఇచ్చాయి. పండుగకు ముందు ధరలు తగ్గించటంతో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు.