మమతాదీదీని ఇరుకున బెట్టడమే లక్ష్యం.. ఇదీ బీజేపీ, జీజేఎం సంయుక్త వ్యూహం
డార్జిలింగ్: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్, జల్పాయిగురి తదితర ప్రాంతాలను కలిపి ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో గూర్ఖా జన్ముక్తి మోర్చా (జీజేఎం) చేపట్టిన ఆందోళన ఆదివారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ తనదైన శైలిలో ధ్వజం ఎత్తుతున్నారు. బాధితులకంటే ధీటుగా స్పందిస్తున్నారు. నోట్ల రద్దు నుంచి పశు వధ నిర్ణయం వరకు ప్రతి ఒక్క నిర్ణయంపై ధిక్కారం ప్రకటించడంతో కేంద్రం మండి పడుతున్నది. అందులో భాగంగానే జీజేఎం, బీజేపీ సంయుక్త కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళన.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మమతాబెనర్జీ ప్రభుత్వంపై ఆధిపత్యం సాధించేందుకు సాగుతున్న సంగ్రామమని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. గూర్ఖాలాండ్ రాష్ట్ర సాధన కోసం ఆందోళన బాట పట్టిన జీజేఎం మద్దతుదారులకు, పోలీసులు, భద్రతాదళాలకు మధ్య సంకుల సమరం సాగుతోంది. పోలీసులపై రాళ్లు, బాటిళ్లతోపాటు పెట్రోల్ బాంబులు విసిరి తమ ద్రుఢ సంకల్పం ప్రదర్శించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భాష్ప వాయువు ప్రయోగించారు. పరిస్థితి విషమించడంతో సైన్యం రంగంలోకి దిగింది.
డార్జిలింగ్ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రజల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యం కవాతు జరిపింది. డార్జిలింగ్ జిల్లాలో జీజేఎం పాలనా ప్రాంతాల్లో నేపాలీ భాష మాట్లాడే గూర్ఖాలకు బెంగాలీ భాష బోధన తప్పనిసరి చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే దీనికి కారణం. డార్జిలింగ్ కొండల్లో నేపాలీ అధికారిక భాష. 1961లో కేంద్రం గుర్తించింది. 1992లో అధికారిక భాషగా గుర్తిస్తూ ఆదేశాలు జారీచేసింది. పరిస్థితి తీవ్రత తెలిసి.. బెంగాలీ ఒక ఆప్షనల్ మాత్రమేనని పేర్కొన్నా.. అందుకు జీజేఎం వెనక్కి తగ్గేందుకు ససేమిరా అంటున్నది.

ఇది తుది పోరాటమన్న బిమల్ గురుంగ్
గూర్ఖాలాండ్ రాష్ట్ర ఏర్పాటు 100 ఏళ్ల నాటిది. గుర్తు తెలియని ప్రాంతం నుంచి మద్దతుదారులతో మాట్లాడిన ఇది తుది పోరాటమని, అందుకోసం పోరాడాలని కోరారు. మిరిక్‌లో మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ తొలిసారి ఘన విజయం సాధించిన తర్వాత జీజేఎం.. తన గూర్ఖాలాండ్ ఉద్యమ నినాదానికి పదునుబెట్టింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేసిన బిమల్ గురుంగ్ స్వతంత్ర ప్రతిపత్తి పాలనా కేంద్రం ఏర్పాటుకు సంతకం చేసిన తర్వాత కొద్ది నెలలకే తన వ్యక్తిగత ప్రజాదరణను దెబ్బ తీసేందుకు పన్నిన కుట్ర అని వాస్తవ పరిస్థితిని గుర్తించారు. దాని కారణంగానే జీజేఎం లైఫ్ టైం అందుకున్నది. ఈ నెల 11, 12 తేదీల్లో జీజేఎం ఆందోళనకారులు బిజన్పూరి, డార్జిలింగ్‌లలో ప్రభుత్వాఫీసులు తగులబెట్టారు.

మమతాబెనర్జీతో చర్చలకు ససేమిరా అన్న మమత
జేజేఎం కార్యాలయాలపై శుక్రవారం జరిపిన దాడుల్లో పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకుంటే పరిస్థితి మరింత విషమించింది. ఆందోళనకారులు చెలరేగిపోయారు. శనివారం కాల్పులు జరిగాయని పోలీసులు, జేజేఎం మద్దతుదారులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఆందోళన సందర్భంగా జరిగిన ఘర్షణలో గాయపడిన పోలీస్ అధికారి పరిస్థితి విషమించింది. కానీ అధికార త్రుణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంతో సంప్రదింపులకు జీజేఎం నిరాకరించింది. అందుకు అవకాశమే లేదని తేల్చి చెప్పింది. కేంద్రంతో మాత్రమే సంప్రదింపులు జరుపుతామని చెప్తోంది. మమతాబెనర్జీ కూడా ఆందోళన విరమిస్తే జీజేఎం నేతలతో చర్చలు జరుపుతానని షరతు విధించింది. ఈశాన్య రాష్ట్రాలు, పొరుగుదేశాల్లోని ఉగ్రవాదులతో జీజేఎంకు సంబంధాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు.

2007లో జీజేఎం స్థాపించిన గురుంగ్
గూర్ఖాలాండ్ రాష్ట్ర సాధనకు పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాల్లో వెల్లువెత్తుతున్న ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న గూర్ఖా జన్ముక్తి మోర్చా (జీజేఎం) అధ్యక్షుడు బిమల్ గురుంగ్.. 1980ల్లో ఉద్యమం నడిపిన సుభాష్ ఘీషింగ్ బాటలో ముందుకు సాగుతున్నారు. 1986లో ఘీషింగ్ ఆధ్వర్యంలో గూర్ఖాలాండ్ కోసం హింసాత్మక ఆందోళన సాగింది. 2007లో జీజేఎం స్థాపించిన గురుంగ్ క్రమంగా బలమైన నాయకుడిగా ఎదిగారు. 1999లో రుద్రకుమార్ ప్రధాన్ హత్య తర్వాత డార్జిలింగ్‌లోని చౌబజార్ నుంచి ప్రత్యేక మండలి సభ్యుడిగా గురుంగ్ తొలిసారి ఎన్నికయ్యారు. గురుంగ్‌తో విబేధాలతో డార్జిలింగ్ నుంచి ఘీషింగ్ పారిపోయారు.

బెంగాలీ భాష బోధనా నిర్ణయమే తాజా ఆందోళనకు శ్రీకారం
1980లో డార్జిలింగ్ కేంద్రంగా కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలని సుభాష్ ఘీషింగ్ గూర్ఖాజాతీయ విముక్తి కూటమి (జీఎన్ఎల్ఎఫ్) స్థాపించారు. డార్జిలింగ్ గూర్ఖా హిల్ కౌన్సిల్ ఏర్పాటుకు జీఎన్ఎల్ఎఫ్, సీఎం జ్యోతిబసు, కేంద్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. 2005లో రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ కింద డార్జిలింగ్ గూర్ఖాహిల్స్కు ప్రత్యేక హోదా కల్పించింది. 2010లో బిమల్‌గురుంగ్ నాయకత్వాన్ని వ్యతిరేకించిన అఖిల భారత గూర్ఖా లీగ్ నేత మదన్ తమాంగ్ హత్యకు గురయ్యారు. తిరిగి 2011లో హింసాత్మక ఆందోళన ప్రారంభమైంది. గూర్ఖా టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ (జీటీఏ) ఏర్పాటైంది. 2012లో తొలి జీటీఏ ఎన్నికల్లో జీజేఎం ఘన విజయం సాధించింది. 2015లో మదన్ తమాంగ్ హత్య కేసులో బిమల్ గురుంగ్‌పై అభియోగాలు నమోదుచేసింది. తాజాగా తప్పనిసరిగా బెంగాలీ భాష బోధించాలన్న నిర్ణయం తాజా ఆందోళనకు దారి తీసింది.