ఉద్యోగుల ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ భారీగా తగ్గింపు : 4 కోట్ల మందికి ప్రయోజనం
న్యూఢిల్లీ : మోడీ 2.0 సర్కార్ వేతన జీవులకు భారీ ఊరట కలిగించింది. ఈఎస్ఐలో ఉద్యోగుల నుంచి చెల్లించే మొత్తాన్ని తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో దాదాపు 4 కోట్ల ఉద్యోగులకు మేలు జరగనుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు బడుగు వేతనజీవుల పాలిట కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దీనిపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల హర్షం వ్యక్తంచేస్తున్నాయి.
భారీ తగ్గింపు ..
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వేతన జీవులకు ఉపశమనం కలిగించేలా తొలి చర్య చేపట్టింది. రూ.21 వేల లోపు ఉద్యోగులకు ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగం చేసే పురుషులు తమ ఈఎస్ఐ చెల్లింపులను 4.75 శాతం నుంచి 3.25 శాతానికి తగ్గించారు. అదే మహిళల విషయానికొస్తే 1.75 శాతం నుంచి 0.75 శాతానికి తగ్గించారు. మొత్తంగా 6.5 శాతం నుంచి 4 శాతం వరకు ఉద్యోగాలకు మేలు జరుగుతుంది. ఈ కంట్రిబ్యూషన్ వచ్చేనెల 1 నుంచి అమలవుతుందని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో 3.6 కోట్ల మంది ఉద్యోగులు, 12.85 లక్షల మంది మహిళ ఉద్యోగులకు మేలు జరుగుతుందని వివరించింది.

కొత్తవారికి కూడా ...
ఈ కొత్త విధానం ఇప్పుడున్న ఉద్యోగులకు .. ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే ఎంప్లాయిస్‌కు కూడా వర్తిస్తుందని తెలిపింది. దీంతో సులభ వాణిజ్య తరహా పరిశ్రమలకు మరింత మేలు జరుగుతుందని కేంద్రం అంచనా వేసింది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సురెన్స్ యాక్ట్ 1948 ప్రకారం ఉద్యోగులకు ప్రయోజనం కలిగించినట్టు వివరించింది. ఈ చట్టం కింద ఉద్యోగులకు వైద్యం, నగదు, మహిళలైతే మెటర్నిటీ, ప్రమాదం జరిగితే డిసెబిలిటీ కింద ప్రయోజనాలు కల్పిస్తారు. అంతేకాదు ఉద్యోగులు ఈఎస్ఐ కింద కొంత నగదు జమచేస్తుండగా .. కంపెనీ మరికొంత డబ్బులు డిపాజిట్ చేస్తోంది. ఆ రెండింటినీ కలిపి ఉద్యోగులకు అందజేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఉద్యోగుల ఈఎస్ఐ పరిమితి జీతాన్ని కూడా రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచినట్టు స్పష్టంచేసింది. అంటే రూ.21 వేల జీతం ఉన్నవారు కూడా ఈఎస్ఐ పరిధిలోకి వస్తారు. వారి నగదు కట్ చేసి .. హెల్త్ కార్డు అందజేస్తారు.