4 రోజుల తర్వాత తెలిసింది, కరోనా బాధితుడి పట్ల ఆస్పత్రి నిర్లక్ష్యం, దీదీ రాజ్యంలో ఏం చేశారంటే...?
కరోనా వైరస్ కరాళనృత్యం చేస్తోన్న వేళ.. ఓ బాధితుడు చనిపోయాడనే విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం దాచిపెట్టింది. కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడం దేవుడు ఎరుగ.. అంత్యక్రియలు కూడా నిర్వహించింది. రెండుసార్లు ఆస్పత్రి చుట్టూ తిరిగితే కానీ.. అసలు విషయం వెలుగుచూడలేదు. బాధితుడికి అంత్యక్రియలు కూడా నిర్వహించామని చెప్పడంతో నోరెళ్లబెట్టడం కుటుంబసభ్యుల వంతయిపోయింది.

కరోనాతో మృతి..
పశ్చిమబెంగాల్‌కి చెందిన హరినాథ్ సేన్ (70)కి గతనెల 29వ తేదీన కరోనా వైరస్ సోకింది. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు, కోడళ్లు ఉన్నారు. దీంతో సేన్‌ను తొలుత ఎన్ ఆర్ ఎస్ మెడికల్ కాలేజీకి తరలించి.. అటు నుంచి ఎంఆర్ బంగూర్ ఆష్పత్రికి షిప్ట్ చేశారు. కరోనా వైరస్ రోగులకు ఇక్కడే వైద్యం అందజేస్తున్నారు. అయితే కుటుంబసభ్యులు కూడా కొందరు ఐసోలేషన్, మరికొందరు క్వారంటైన్లో ఉన్నారు. ఆస్పత్రిలో ఉన్న సేన్ గురించి బంగూర్ ఆస్పత్రి సిబ్బందిని ఈ నెల 5వ తేదీన కుటుంబసభ్యులు సమాచారం అడిగారు. వారు తెలియదని చెప్పారు. ఆ మరునాడు కూడా అడిగితే.. సేన్ చనిపోయారని చెప్పడంతో విస్తుపోవడం వారి వంతయిపోయింది.

దహన సంస్కారాలు..
చనిపోవడమే కాదు.. దహన సంస్కారాలు కూడా చేశామని చెప్పారు. చనిపోయిన సంగతి తమకు ఎందుకు తెలియజేయలేదు అని కుటుంబసభ్యులు ప్రశ్నించారు. బంగూర్ ఆస్పత్రిలో చేర్పించాక.. తమకు మే 1వ తేదీన సీరియస్‌గా ఉంది అని చెప్పారు. కానీ ఆ మరునాడే చనిపోయారని చెప్పలేదు అని కుమారుడు అర్జిత్ సాహ తెలిపారు. ఫోన్ చేసి అడిగితే.. రిసెప్షన్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని అర్జిత్ తెలిపారు.

డెత్ సర్టిఫికెట్ కూడా..
మీరు ఎవరూ.. మాకు ఎందుకు చెప్పలేదు అని అడిగితే.. తన పేరు చెప్పనని.. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తామని తెలిపారు. వృద్దుడి మృతి గురించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదు అని చెప్పారని ఆడియో వాయిస్‌ను ఆర్జిత్ తెలిపారు. అంతేకాదు సేన్ మృతికి సంబంధించి మరణ ధృవీకరణ పత్రం, డాక్యుమెంట్స్ కూడా బంగార్ ఆస్పత్రి ఇవ్వలేదు. కానీ కోవిడ్ క్రిమేషన్ సిబ్బందిని మాత్రం సర్టిఫికేట్ ఇవ్వాలని కోరినట్టు చెప్పారు.

నో కామెంట్
కుటుంబసభ్యుల ఆరోపణలను ఆస్పత్రి యాజమాన్యం తప్పుపట్టింది. మృతులకు సంబంధించి కుటుంబసభ్యులకు సమాచారం ఇస్తున్నానని, సేన్ విషయంపై తాను ఎలాంటి కామెంట్ చేయనని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిసిర్ నాస్కర్ తెలిపారు.