బెంగళూరు కంపెనీ ఉద్యోగి ఎడిటర్ గౌరీ లంకేష్ హంతకుడు, మెడలో ఐడీ కార్డు, స్కెచ్ రెడీ !
కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ (ఎస్ఐటీ) అధికారులు హంతకుడిని పట్టుకోవడానికి ముందడుగు వేశారు.
బెంగళూరు: కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ (ఎస్ఐటీ) అధికారులు హంతకుడిని పట్టుకోవడానికి ముందడుగు వేశారు. హంతకుడి ఊహా చిత్రం తయారు చేయించిన అధికారులు అతని కోసం గాలిస్తున్నారు.
గౌరీ లంకేష్ ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లోని దృశ్యాలు పరిశీలించిన అధికారులు హత్య జరిగిన సమయంలో అక్కడ సంచరించిన ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించి నిపుణలుతో హంతకుడి ఊహా చిత్రం తయారు చేశారని సమాచారం.
గౌరీ లంకేష్ ను హత్య చేసిన వ్యక్తి ఫార్మల్ షర్ట్ వేసుకుని నలుపు రంగు హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడని, అతని మెడలో బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ ఐడీ కార్డు ఉందని అధికారులు గుర్తించారు. హెల్మెట్ పెట్టుకున్నందున అతని ముఖం పూర్తిగా కనపడటం లేదని అధికారులు అంటున్నారు.
బెంగళూరులోని కంపెనీలో ఉద్యోగం ముగించుకున్న నిందితుడు నేరుగా గౌరీ లంకేష్ కార్యాలయం దగ్గరకు చేరుకుని అక్కడి నుంచి ఆమెను వెంబడించి హత్య చేశాడని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. హంతకుడి మెడలో ఉన్న కంపెనీ ఐడీ కార్డు స్పష్టంగా కనపడటం లేదని విచారణ చేస్తున్న అధికారులు అంటున్నారు. హంతకుడు మాత్రం బెంగళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం చేసేవాడే అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.