ఎన్నో ప్రశ్నలు: బీజేపీ అఖండ విజయంతో మరణపడకపై కాంగ్రెస్ పార్టీ...!
న్యూఢిల్లీ: గతవారం వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో బీజేపీ కాంగ్రెస్ను దాదాపు భూస్థాపితం చేసిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. బీజేపీ ఘనవిజయం సాధించడంతో గాంధీ కుటుంబానికి కష్టాలు తప్పవనే ప్రచారం జరుగుతోంది. 134 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ 2014లో ఏవిధంగా అయితే ఘోర పరాభవం మూటగట్టుకుందో 2019లో కూడా అదే స్థాయిలో ఓటమి చవిచూసింది.

కష్టాల్లో కాంగ్రెస్..సగం రాష్ట్రాల్లో ఖాతా తెరవని హస్తం పార్టీ
దేశానికి బ్రిటీషు వారి నుంచి స్వాతంత్రం పొందాక చాలామంది మహామహులు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆ తర్వాత ఒక్కొక్కొరుగా పార్టీని వీడి తమ సొంత పార్టీలు పెట్టుకున్నారు. అలాంటి వారు కూడా మోడీ మ్యాజిక్ ముందు నిలువలేకపోయారు. మహామహులు ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఓటమిపాలు కావడం వారు జీర్ణించుకోలేకున్నారు. ఇక కాంగ్రెస్ మొత్తం 52 సీట్లు మాత్రమే గెలుచుకుంది. దాదాపు సగం రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు. కాంగ్రెస్ పరిస్థితి చాలా దారుణంగా ఉందని దాదాపు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చిందని అన్నారు ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ. రాహుల్ గాంధీ వల్ల ఉపయోగం ఏంటనేది సర్వత్రా వ్యక్తమవుతున్న ప్రశ్న.

కాంగ్రెస్ నాయకత్వంపై పలు అనుమానాలు
ప్రధానిగా నెహ్రూ, ఆ తర్వాత ఇందిరాగాంధీలు దేశాన్ని చాలా ఏళ్లు పరిపాలించారు. ఇక రాజీవ్ గాంధీ మృతి తర్వాత గాంధీ కుటుంబం నుంచి ప్రధాని అయిన వారు లేరు. ఇక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేసినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ఆయన రాజీనామాను తిరస్కరిస్తూ పార్టీని బలోపేతం చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ పరిస్థితుల్లోనే కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజల్లో కూడా గాంధీ కుటుంబం ఇంకా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాల్సిన అవసరముందా అనే ప్రశ్న తొలుస్తోంది. ఎన్నికలకు ముందే పొత్తులు పెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని కార్యకర్తలు భావిస్తున్నారు. దీంతో పాటు నాయకులు కూడా పూర్తి స్థాయిలో విఫలం అయ్యారని చెప్పారు. అంతేకాదు మూడు రాష్ట్రాల్లో అధికారం ఉన్నప్పటికీ దాన్ని సరిగ్గా వినియోగించుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ సాధించలేకపోయిందని విమర్శలు గుప్పిస్తున్నారు.

మరణపడకపై కాంగ్రెస్ భవిష్యత్తు
ఒకప్పుడు కాంగ్రెస్ 25శాతం ఓటుషేరు సంపాదించిందని ఇప్పుడు 20శాతం కంటే తక్కువ ఓటుషేరు ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ మరణపుటంచుల్లో ఉందని చెప్పేందుకు ఇదే ఉదాహరణ అని వారు విశ్లేషిస్తున్నారు. ఇక నిధులు కూడా అనుకున్నంత స్థాయిలో కాంగ్రెస్కు లేకపోవడం పార్టీని కార్యకర్తలను కాపాడుకునే క్రమంలో అడ్డంకిగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడతామన్న రైతు రుణ మాఫీలు, పేదలందరికీ కనీస వేతనం పథకాన్ని ప్రమోట్ చేసేందుకు నిధులు సరిపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కాంగ్రెస్ పథకాలను ప్రమోట్ చేసుకోవడంలో విఫలం
ఇక రాహుల్ గాంధీ స్వయంగా చాలా కష్టపడ్డారనే చెప్పాలి. అతని సొంత కోటరీని నిర్మించుకున్నారు . వ్యూహకర్తలను నియమించుకున్నారు. సోషల్ మీడియాలో పార్టీని ఎలా ప్రమోట్ చేసుకోవాలో ప్రణాళిక రూపొందించాడు.అంతేకాదు దాదాపు 145 సభల్లో ఆయన పాల్గొన్నారు. బహిరంగ సభల్లో మోడీ విధానాలను విమర్శించారు. ఉద్యోగాల కల్పనలో మోడీ ప్రభత్వం విఫలమైందని నిప్పులు చెరిగారు , రాఫెల్ అవినీతిని పదే పదే ప్రజల ముందు ఉంచారు. కానీ అవేమీ మోడీ మేనియా ముందు వర్కౌట్ కాలేదు.