ఈ రాత్రికే రాష్ట్రాలకు రూ. 20వేల కోట్లు, పరిహార సెస్సు గడువు పొడిగింపు: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: ఈ ఏడాది జీఎస్టీ పరిహారం కింద వసూలైన రూ. 20,000 కోట్ల నిధులను సోమవారం రాత్రి రాష్ట్రాలకు బదలాయిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కాగా, సోమవారం రాష్ట్రాలకు పరిహారం చెల్లింపుల అంశమే ప్రధాన అజెండా జరిగిన 42వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది.

12న మరోసారి భేటీ..
పరిహారం చెల్లింపునకు సంబంధించి రాష్ట్రాల ముందు కేంద్రం ఉంచిన రెండు ఐచ్ఛికాల్లో 21 రాష్ట్రాలు ఒక ఐచ్ఛికాన్ని ఎంచుకోగా, కొన్ని రాష్ట్రాలు ఎలాంటి ఆప్షన్ను ఎంచుకోలేదు. దీనిపై విస్తృతంగా చర్చించేందుకు జీఎస్టీ పాలక మండలి మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. ఈ క్రమంలో అక్టోబర్ 12న మరోసారి కౌన్సిల్ భేటీ జరగనుంది.

ఈ రాత్రికే రాష్ట్రాలకు రూ. 20వేల కోట్లు
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ భేటీ అనంతరం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. జీఎస్టీ పరిహార సెస్స్ కింద ఈ ఏడాది వసూలైన రూ. 2వేల కోట్లను సోమవారం రాత్రి అన్ని రాష్ట్రాలకు విడుదల చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రాల ఆదాయం తగ్గినప్పుడు దాన్ని పూడ్చేందుకు విధిస్తున్న పరిహార సెస్సు గడువును పొడిగించేందుకు అంగీకారం కుదిరిందన్నారు.

పరిహార సెస్సు 2022 జూన్ వరకు పొడిగింపు
జీఎస్టీ అమలైన నాటి నుంచే ఐదేళ్ల వరకు అంటే 2022 జూన్ వరకు పరిహార సెస్సును వసూలు చేయాలని తొలుత నిర్ణయించగా, ఆపై కూడా ఈ సెస్సు వసూలు చేసేందుకు భేటీలో ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు. అలాగే గతంలో తక్కువ మొత్తంలో ఐజీఎస్టీ పొందిన రాష్ట్రాలకు రూ. 24వేల కోట్లను వచ్చే వారాంతానికి విడుదల చేస్తామని తెలిపారు.

చిన్న వ్యాపారులకు ఊరట
2021 జనవరి 1 నుంచి రూ. 5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ కలిగిన వ్యాపారులు ఇకపై నెలవారీ రిటర్నులు సమర్పించాల్సిన అవసరం లేదని ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే తెలిపారు. త్రైమాసికానికోసారి సమర్పిస్తే సరిపోతుందన్నారు. చిన్న వ్యాపారులకు ఇది ఊరట కలిగించే అంశమేనని వెల్లడించారు. కాగా, కరోనా సమస్యలు, జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు వాటిల్లిన 2.35 లక్షల కోట్ల ఆదాయ నష్టాన్ని పూడ్చేందుకు ఆర్బీఐ వద్ద రుణం తీసుకోవడంతోపాటు మార్కెట్ నుంచి రుణాలను సమీకరించుకోవాలని గతంలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కేంద్రం సూచించింది. రుణ అవకాశాలను తోసిపుచ్చిన రాష్ట్రాలు కేంద్రం చెల్లించాల్సిన రూ. 97వేల కోట్ల జీఎస్టీ పరిహారంపై పట్టుబడుతున్నాయి.