• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జీఎస్టీ ఎఫెక్ట్: బంగారం ఇక ప్రియమేనా, అక్రమాలకు చెక్?

By Swetha Basvababu
|

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి రావడంతో అన్ని రకాల వస్తువులు, పరికరాలు, సేవలపై పన్నుల్లో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ వనితలకు ఎంతో ప్రీతిపాత్రమైన ఆభరణాలు మరింత ప్రియం కానున్నాయి. ఇప్పటికే ఎక్సైజ్ సుంకం, వ్యాట్ తోపాటు మరో శాతం అదనంగా నూతన పన్ను వ్యవస్థలో చేరుస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది.

మామూలుగానే పసిడి ఎంతో ప్రియం. ఇప్పటివరకు అమలులో ఉన్న విధానం ప్రకారం కేరళలో మాత్రమే ఐదు శాతం వ్యాట్ పన్ను వసూలయ్యేది. అంటే నూతన పన్ను వ్యవస్థ ప్రకారం మలయాళీ మహిళలకు లబ్ది చేకూరనున్నదన్న మాట. దేశవ్యాప్తంగా ఒక్క శాతం పన్ను మాత్రమే అదనంగా నిర్ణయించడం వల్ల మహిళలు పెద్ద భారంగా పరిగణించకపోవచ్చునన్న అభిప్రాయం కూడా ఉన్నది.

ఇక దిగుమతి చేసుకున్న బంగారంపై కస్టమ్స్‌ సుంకం 10 శాతంలో ఎటువంటి మార్పు ఉండదు. విదేశీ విపణులతో పోలిస్తే, ఆ మేర దేశీయంగా అదనపు భారం తగ్గదు. అయితే ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ వల్ల దేశంలో స్వేచ్ఛాయుత రవాణాకు వీలు కలుగుతుందని జ్యువెలరీ వ్యాపార నిఫుణులు భావిస్తున్నారు.

ప్రతి ఆభరణానికీ లెక్క ఉంటుంది కనుక, వాటి నాణ్యతపైనా కొనుగోలుదార్లకు భరోసా లభిస్తుందన్న మాటలు వినిపిస్తున్నాయి. పసిడిపై 3 శాతం, ముడి వజ్రాలపై 0.25 శాతం పన్ను నిర్ణయిస్తూ జీఎస్‌టీ మండలి తీర్మానించింది. మిగిలిన అన్ని వస్తువులు, సేవలకు జీఎస్‌టీ కనీస రేటు 5 శాతం ఉండగా, దేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా బంగారానికి ప్రత్యేక పన్ను శాతాన్ని నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

దేశీయంగా ప్రజల అవసరాల కోసం కూడా దాదాపు పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడిన పరిస్థితులతోపాటు విదేశీ వాణిజ్యంలో లోటు నియంత్రణకు ప్రభుత్వం కస్టమ్స్ సుంకం 10 శాతం విధిస్తున్నది. ఇందువల్ల విదేశీ మార్కెట్లతో పోలిస్తే, ఆభరణాల బంగారంపై దేశీయంగా గ్రాముకు రూ.280 అదనపు భారం పడుతోంది. ఈ సుంకం విషయంలో స్పష్టత రాలేదు. దీనితో పాటు ఆభరణాల తయారీ ఛార్జీలపై సేవాపన్ను విధిస్తారా? లేదా? అనే సందేహమూ ఉంది. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో జరిగే సమావేశంలో వీటిపై స్పష్టత వస్తుందని ఒక కార్పొరేట్‌ సంస్థ ఉన్నతాధికారి తెలిపారు.

ఇవీ ప్రయోజనాలు

ఇవీ ప్రయోజనాలు

ప్రస్తుతం ఆభరణాల విక్రేతలు వేరే రాష్ట్రంలో కనుక సరకు కొంటే, అక్కడ ఒక్క శాతం వ్యాట్‌ కడుతున్నారు. మళ్లీ తమ రాష్ట్రానికి తెచ్చాక, ఇక్కడ మరొక శాతం వ్యాట్‌ చెల్లించాల్సి వస్తోంది. ముందుగా చెల్లించిన పన్ను వాపస్ (ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌) వచ్చే వీలు ఇప్పుడు లేదు. దీన్ని తప్పించుకునేందుకు, వ్యాపారులు లోహం ఇచ్చి, లోహం తీసుకుంటున్నట్లు చూపుతున్నారు. వాస్తవానికి వీరు పెద్ద మొత్తాల్లో నగదు తీసుకెళ్లి, ఆభరణాలు తీసుకొస్తారు.

కొన్ని సందర్భాల్లో దొంగల వల్ల నష్టపోతున్నా, అధికారికం కాదు కనుక, కేసులు పెట్టేందుకూ జ్యువెలరీ వ్యాపారులు వెనుకాడే పరిస్థితి ఉన్నదని చెప్తున్నారు. జీఎస్‌టీ అమలులోకి రావడం వల్ల వేరే రాష్ట్రంలో చెల్లించిన పన్ను మొత్తాన్ని వాపసు పొందగలుగుతారు. అందువల్ల నగదును ఆన్‌లైన్‌లో బదిలీ చేయడం ద్వారా, సరకు పొందగలుగుతారు. రవాణా ఖర్చులు ఎప్పుడైనా ఒకటే, అయితే అధికారిక పద్ధతుల్లో బీమా కూడా లభిస్తుంది కనుక వ్యాపారులకు కలిసి వస్తుంది. ప్రస్తుతం ఒక రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో వ్యాపారుల మధ్య జరిగే లావాదేవీలకే ఇలా పన్ను వాపసు పొందే వీలు ఉన్నది.

ఇలా అక్రమాలకు చెక్

ఇలా అక్రమాలకు చెక్

నగదు చెలామణి తగ్గించి, లావాదేవీల్లో పారదర్శకత తెచ్చేందుకు, లెక్కల్లో చూపని నగదు పోగుబడకుండా చూసేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పుడు రూ.2 లక్షలకు మించి నగదుతో ఏదీ కొనే వీలు లేదు. ఇంతకుమించిన మొత్తానికి ఆభరణాలు కొనాలంటే చెక్‌ ద్వారా గానీ, ఆన్‌లైన్‌లో గానీ నగదు బదిలీ చేయక తప్పదు. రూ.5 లక్షల మేర నగదు బ్యాంకులో ఒకేసారి ఉపసంహరిస్తే, ఆదాయం పన్ను శాఖ దృష్టికి వెళ్తుంది. ఆ మొత్తాన్ని ఏం చేశారో వివరాలు అడుగుతూ నోటీసులు వస్తున్నాయి.

ఎవరైనా రూ.2 లక్షలకు మించిన నగదుతో ఆభరణాలు కొన్నామని, బదులిస్తే, సదరు వ్యాపారి వద్ద తనిఖీలు జరిపి, వారి నుంచి అంతమేర జరిమానాగా వసూలు చేయాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఇదే తరహాలో ఒకే బిల్లుగా రూ.5 లక్షల విలువైన ఆభరణాలు ఎన్ని విక్రయించారో, ప్రతి నెలా ఆభరణాల విక్రేతలు ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అసిస్టెంట్‌ కమిషనర్‌కు తెలపాల్సి ఉంటుంది. సదరు ఖాతాదారు వివరాలు ఐటీ శాఖకు వెళ్లిపోతాయి. ఇక ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ ఉన్నందున, బిల్లుతో విక్రయాలు జరిపేందుకే వ్యాపారులు ప్రయత్నిస్తారనే అభిప్రాయం ఉంది. కొనుగోలుదార్ల వద్ద నగదు లభ్యత పెద్దమొత్తంలో ఉండదు కనుక, వీరు అధికారికంగానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అందువల్ల బిల్లు లేకుండా జరిపే, దొంగచాటు అమ్మకాలు బాగా తగ్గుతాయని చెబుతున్నారు.

చిన్న వ్యాపారులకు ఇబ్బందులు తప్పవా?

చిన్న వ్యాపారులకు ఇబ్బందులు తప్పవా?

దేశవ్యాప్తంగా, రాష్ట్రాల వారీగా పలు ప్రాంతాల్లో శాఖలు నిర్వహిస్తూ, ఆభరణాల లావాదేవీలు పారదర్శకంగా నిర్వహించే కంపెనీలు, గొలుసుకట్టు విక్రయసంస్థలకు జీఎస్‌టీ వల్ల ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ రూపేణ కలిసి వస్తుంది. దీనికితోడు జీఎస్‌టీ రేటును ప్రత్యేకంగా 3 శాతంగా నిర్ణయించడం వల్ల, ఆభరణాల తయారీ, విక్రయసంస్థలకు ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయం ఏర్పడింది. అయితే జీఎస్‌టీ కోసం లావాదేవీలన్నీ నమోదు, పన్ను వాపసు పొందే ప్రక్రియల కోసం చిరు వ్యాపారులు కష్టపడక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద సంస్థలతో పోలిస్తే, చిరు వ్యాపారుల వద్ద తరుగు, తయారీ ఛార్జీల వంటివి తక్కువ ఉంటాయనే కొనుగోలుదార్లు వస్తారు. సేవాపన్ను ఏ రూపేణ ఉంటుందనే స్పష్టత కోసం జువెల్లరీ పరిశ్రమ ఎదురు చూస్తోంది.

English summary
Although slightly, gold will become costlier than it already is after Goods and Services Tax (GST) comes into effect from midnight. The yellow metal much-loved by Indians will attract taxes to the tune of three per cent under the new tax regime, around one per cent higher than what it is today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X