బెయిల్ మంజూరైన గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ మళ్లీ అరెస్ట్
న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రంలోని వడగాం స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీకి పోలీసులు మరోసారి షాకిచ్చారు. బెయిల్ ఇచ్చిన కాసేపటికే ఆయనను మళ్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ట్వీట్ వ్యవహారంలో ఏప్రిల్ 19న జిగ్నేశ్ ను అస్సాంలోని కొక్రాఝర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో సోమవారం కొక్రాఝర్ కోర్టు జిగ్నేశ్ కు బెయిల్ మంజూరు చేసింది. అయితే, తాజాగా, బార్పేట్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. జిగ్నేశ్‌ను ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నది మాత్రం పోలీసులు ఇంకా చెప్పలేదు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ ఏప్రిల్ 18న చేసిన ట్వీట్ చేశారు.

జాతిపిత మహాత్మాగాంధీని కాల్చి చంపిన నాథూరాం గాడ్సే పేరును ప్రస్తావిస్తూ మోడీపై చేసిన ట్వీట్‌పై కొక్రాఝర్ ప్రాంతంలో బీజేపీ నేత అరూప్ కుమార్ డే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో అస్సాం పోలీసులు.. ఏప్రిల్ 19న రాత్రి 11.30 గంటల సమయంలో గుజరాత్ లోని పాలన్‌పూర్‌లో జిగ్నేశ్‌ను అరెస్ట్ చేశారు.
అనంతరం ఆయనను కొక్రాఝర్ కోర్టులో ప్రవేశపెట్టగా.. మూడు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. బెయిల్ పిటిషన్ పై ఆదివారం విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసిన కోర్టు.. జిగ్నేశ్ కు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ వ్యవహారం చట్టపరమైన వివాదంగా మారడంతో జిగ్నేశ్ పోస్టును ట్విట్టర్ నిలిపివేసింది. జిగ్నేశ్ ట్వీట్ విషయంలో అస్సాం పోలీసుల చర్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. తాజాగా బెయిల్ వచ్చిన తర్వాత మరోసారి అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.