• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

గుంటూరు జిల్లా: ఇంట్లో తల్లీకూతుళ్ల దారుణ హత్య - ప్రెస్ రివ్యూ

By BBC News తెలుగు
|

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని నాగార్జున నగర్‌లో బంధువే ఆస్తి కోసం తల్లీకూతుళ్లను నరికి చంపాడని సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం.. సత్తెనపల్లి పట్టణంలోని నాగార్జుననగర్‌కు చెందిన కోనూరు శివప్రసాద్‌ గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేసి రిటైరయ్యారు.

అనారోగ్యంతో కొంతకాలం కిందట ఆయన మృతిచెందారు. శివప్రసాద్‌కు భార్య పద్మావతి (55), కుమార్తె లక్ష్మీ ప్రత్యూష (30), కుమారుడు లక్ష్మీనారాయణ ఉన్నారు.

లక్ష్మీనారాయణ గుంటూరు ఆర్డీఓ సీసీగా పనిచేస్తున్నాడు. లక్ష్మీ ప్రత్యూష గర్భిణి కావడంతో తల్లి వద్ద ఉంటోంది.

శివప్రసాద్‌ మరణానంతరం ఆయన సోదరుడు మధుసూదనరావు కుటుంబంతో విభేదాలు తలెత్తాయి. బెల్లంకొండ మండలం నందిరాజుపాలెంలో సుమారు ఆరు ఎకరాల పొలం శివప్రసాద్‌ పేరుతో ఉంది.

అందులో తమకు వాటా ఉందని మధుసూదనరావు కుమారుడు శ్రీనివాసరావు తరచూ ఘర్షణ పడుతున్నాడు.

ఈ నేపథ్యంలో.. లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ గుంటూరులో ఉంటున్న శ్రీనివాసరావు శనివారం సత్తెనపల్లి వచ్చి పిన్ని పద్మావతి, సోదరి లక్ష్మీ ప్రత్యూషను కిరాతకంగా నరికి చంపాడని సాక్షి కథనం పేర్కొంది.

మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసిందని సాక్షి వివరించింది.

వాహనాల రిజిస్ట్రేషన్

రాష్ట్ట్రం మారినా వాహనం రిజిస్ట్రేషన్ మారదు

వాహనదారులు రాష్ట్రాలు మారినప్పుడు వాటి రిజిస్ట్రేషన్‌ మార్పిడిలో వస్తున్న ఇబ్బందులకు స్వస్తి పలికేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చిందని ఈనాడు దిన పత్రిక కథనం ప్రచురించింది.

సెప్టెంబర్‌ 15 నుంచి దేశవ్యాప్తంగా భారత్‌ సిరీస్‌ పేరుతో ఒకే రిజిస్ట్రేషన్‌ విధానం అమలు చేయడానికి సిద్ధమైంది.

ఉద్యోగ రీత్యా తరచూ వివిధ రాష్ట్రాలకు బదిలీ మీద వెళ్లే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు వాహనాల రీరిజిస్ట్రేషన్‌ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడానికి ఈ విధానాన్ని తీసుకొచ్చింది.

బీహెచ్‌ సిరీస్‌ రిజిస్ట్రేషన్‌ ఉన్న వాహనాలను ఉద్యోగులు ఇక ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రానికైనా ఇబ్బందుల్లేకుండా తీసుకుపోవచ్చు.

వెళ్లిన రాష్ట్రంలో మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ మేరకు కేంద్ర రహదారి రవాణాశాఖ తాజాగా భారత్‌ సిరీస్‌ (బీహెచ్‌ సిరీస్‌) పేరుతో కొత్త రిజిస్ట్రేషన్‌ మార్క్‌ ప్రవేశపెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆల్మట్టి ఎత్తు పెంచుతాం-కర్ణాటక సీఎం

ఆల్మట్టి ఎత్తు పెంచుతామని కర్ణాటక ముఖ్యమంత్రి ప్రకటించినట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

అప్పర్‌ కృష్ణా ప్రాజెక్టులో భాగంగా ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును 524 అడుగులకు పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై ప్రకటించారు.

అవసరమైతే ఈ అంశంపై మరోమారు న్యాయనిపుణులతో చర్చిస్తామన్నారు.

ట్రైబ్యునల్‌ తీర్పునకు లోబడి కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా హక్కును వినియోగించుకునే విషయంలో రాజీ ప్రశ్నేలేదన్నారు.

సొంత జిల్లా హావేరి పర్యటనలో భాగంగా శనివారం ఆయన హీరేకెరూర్‌లో మీడియాతో మాట్లాడారు.

ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంపునకు సంబంధించి ప్రస్తుతం సుప్రీంకోర్టులో వివాదం పెండింగ్‌లో ఉందన్నారు.

ఇటీవలి ఢిల్లీ పర్యటన సందర్భంగా జల వివాదాలకు సంబంధించి కేసుల పురోగతిని సమీక్షించామన్నారు.

ఆల్మట్టి ఎత్తు పెంపుతో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో ఆనకట్టలన్నీ పటిష్ఠంగా ఉన్నాయని, వాటికొచ్చిన ముప్పేమీ లేదన్నారు.

ఆల్మట్టి ఎత్తు పెంపు, మేకెదాటు, మహదాయి ప్రాజెక్టుల విషయంలో పొరుగు రాష్ట్రాల అభ్యంతరాల నేపథ్యంలో ప్రభుత్వం చట్టబద్ధంగానే ముందుకు సాగాలని భావిస్తోందన్నారని ఆంధ్రజ్యోతి వివరించింది.

రోడ్డుపై ఆటో తగలబెట్టిన డ్రైవర్

హనుమకొండలో ఒక ఆటో డ్రైవర్ నడిరోడ్డుపై తన ఆటో తగలబెట్టినట్లు నమస్తే తెలంగాణ దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం నిత్యం పెరుగుతున్న డీజిల్‌ ధరలు ఓ వైపు.. కోవిడ్‌ కారణంగా బండిసరిగా నడువక ఫైనాన్స్‌ కిస్తీలు కట్టలేని పరిస్థితులు మరోవైపు.. తిండిపెడుతుందని కొనుగోలు చేసిన బతుకు 'బండి'ని అదే పెట్రోల్‌ పోసి తగులబెట్టాడో వ్యక్తి.

నిత్యం జనంతో రద్దీగా ఉండే హనుమకొండ అదాలత్‌ జంక్షన్‌ వద్ద శనివారం ఈ ఘటన చోటుచేసుకొంది.

హనుమకొండ గుండ్లసింగారానికి చెందిన శ్రీనివాస్‌ ఫైనాన్స్‌ నుంచి ఆటో కొని నడిపించుకుంటున్నాడు.

కొంతకాలంగా డీజిల్‌ ధర పెరుగుతూ వస్తోంది. దీనికితోడు ఏడాన్నరగా కరోనా కారణంగా ఫైనాన్స్‌ కంపెనీకి డబ్బులు చెల్లించలేదు. కరోనా తగ్గుముఖం పడుతున్నా గిరాకీ లేక కుటుంబపోషణ భారమైంది.

ఈ పరిస్థితులతో విసిగివేసారిన శ్రీనివాస్‌ శనివారం మధ్యాహ్నం నడిరోడ్డులో ఆటోపై పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు.

పెరిగిన డీజిల్‌ ధర, ఫైనాన్స్‌ వేధింపులు ఎలా భరించాలంటూ వచ్చీపోయేవారికి తన బాధ చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Guntur district: Brutal murder of mother and daughters at home
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X