వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆధ్యాత్మికత, ఆధునికత సమ్మేళనం ప్లస్ రాక్ స్టార్ గుర్మీత్

అతనో బాబా. ఒంటికి విబూతి పూసుకుని, ఎల్లప్పుడూ కాషాయ దుస్తుల్లో కనిపించే మిగతా బాబాల్లాంటి వాడు మాత్రం కాదు. రాక్‌స్టార్‌ బాబా. షోకిల్లా రాయుడు. సంప్రదాయ, ఆధునిక జీవన శైలి సమ్మేళన స్వరూపుడు. బయటి ప్రప

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అతనో బాబా. ఒంటికి విబూతి పూసుకుని, ఎల్లప్పుడూ కాషాయ దుస్తుల్లో కనిపించే మిగతా బాబాల్లాంటి వాడు మాత్రం కాదు. రాక్‌స్టార్‌ బాబా. షోకిల్లా రాయుడు. సంప్రదాయ, ఆధునిక జీవన శైలి సమ్మేళన స్వరూపుడు. బయటి ప్రపంచానికి సాధువు, సేవాతత్పరుడు, గాయకుడు, క్రీడాకారుడు, నటుడు, సంగీత దర్శకుడు, పాటల రచయిత... ఇలా పలు పాత్రల్ని తనలో ఇముడ్చుకున్న వింత మనిషి. రీల్ జీవితం,నిజ జీవితం మధ్య హద్దులు చెరిపేసిన వ్యక్తి. అతని ఆహార్యం విలక్షణం. జిగేల్‌ మనిపించే దుస్తుల్లో వెలిగిపోతుంటాడు.
ఖరీదైన రంగురంగుల దుస్తులు, ఆభరలు ధరించి చూపరుల్ని ఇట్టే ఆకట్టుకుంటాడు. గ్లైడింగ్‌ చేస్తూ.. గాల్లో నుంచి కిందికి దుముకుతాడు. అత్యంత ఖరీదైన బైక్‌లపై సవారీ చేస్తాడు. ఈ బాబా లాగానే అతను నడిపే వాహనాలూ రకరకాల అలంకరణలతో విచిత్రంగా ఉంటాయి. వింత వింత వేషధారణలతో ఇతను తెరపై కనిపిస్తుంటాడు. డేరా సచ్చా సౌదా (డీఎస్‌ఎస్‌) అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీంసింగ్‌ జీవన చిత్రమిది!

అభిమానులందరికీ దేవుడు

అభిమానులందరికీ దేవుడు

హర్యానాలోని సిర్సా కేంద్రంగా పనిచేస్తున్న డీఎస్‌ఎస్‌ అధిపతి రామ్‌ రహీంకు పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌లలో లక్షల మంది అనుచరులు ఉన్నారు. వారికి ఆయనో దేవుడు. ఓ సూపర్‌స్టార్‌. అతని మాట వారికి వేదవాక్కు. గుర్మీత్‌ అడుగుజాడల్లో నడిస్తే జీవితం ధన్యమైనట్లు భావిస్తారు. ఆధ్యాత్మికతతోపాటు, వ్యాపారాల్లోనూ గుర్మీత్‌ రాటుదేలాడు. ‘ఎంఎస్‌జీ' పేరుతో స్వదేశీ, సేంద్రీయ ఉత్పత్తుల్ని రెండేళ్ల నుంచి ఆయన బృందం విక్రయిస్తోంది. గుర్మీత్‌ పిల్లలు సిర్సా కేంద్రం నుంచే ఈ వ్యాపారాలు పర్యవేక్షిస్తుంటారు. కాస్మోటిక్స్‌, హెయిర్‌ఆయిల్‌, చాక్లెట్లు, దుస్తులు, బ్యాటరీలు, బిస్కెట్లు, కిరాణా సామగ్రి.. ఇలా వందలకొద్దీ ఉత్పత్తుల్ని విక్రయించడంతో పాటు, పాఠశాలలు, ఆసుపత్రుల నిర్వహణలాంటివి ఎన్నో వీరి వ్యాపార సామ్రాజ్యంలో విస్తరించి ఉన్నాయి. 11 పాఠశాలలు, రెండు కాలేజీల్ని(ఇందులో ఒకటి మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌) నిర్వహిస్తున్నారు. సిర్సా హెడ్‌క్వార్టర్‌లోనే చాక్లెట్ల తయారీ ఫ్యాక్టరీలు ఉన్నాయి. డేరా సచ్చా సౌధా సంస్థ అయిన ‘ఎంఎస్‌జీ ఆల్‌ ట్రేడింగ్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌' దాదాపు 151 ఉ్పత్తుల్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘ప్రేమీలు'గా పిలిచే డేరా అనుచరులే వీటిని ఎక్కువగా వాడతారు. సిర్సాలో ఓ ఆయుర్వేదిక్‌ కేంద్రం, నేచురోపతి ఇన్‌స్టిట్యూట్‌, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్వహిస్తున్నట్లు డేరా వెబ్‌సైట్‌ చెబుతోంది. హరియాణా, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో నామమాత్ర ఫీజుల్ని వసూలుచేస్తుంటారు.

1990 నుంచి డేరా అధిపతిగా..

1990 నుంచి డేరా అధిపతిగా..

గుర్మీత్‌ 1967 ఆగస్టు 15వ తేదీన రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ జిల్లా శ్రీగురుసర్‌ మోడియా గ్రామంలో మగర్‌ సింగ్‌, నజీబ్‌ కౌర్‌ దంపతులకు జన్మించాడు. అతని తండ్రి ఓ భూస్వామి. చిన్నతనంలో గుర్మీత్‌ వ్యవసాయ పనుల్లో తన తండ్రికి సహకరించేవాడు. తన ఏడో ఏట నుంచే ఆధ్యాత్మికత వైపు మళ్లాడు. దీంతో సిర్సాలోని డేరా సచ్చా సౌధా అధిపతి షా సత్నాం సింగ్‌ ఇతన్ని తన డేరాకు తీసుకువచ్చి రామ్‌ రహీంగా పేరు మార్చాడు. 1990 సెప్టెంబరు 23న తన అనుచరుడిగా ప్రకటించారు. అప్పట్నుంచి గుర్మీత్‌ రామ్‌ రహీం డేరా అధిపతిగా ఉన్నాడు. కేవలం పదోతరగతి వరకు మాత్రమే చదువుకున్న గుర్మీత్‌- హర్జీత్‌ కౌర్‌ అనే మహిళను పెళ్లిచేసుకున్నాడు. వారికి చరణ్‌ప్రీత్‌, అమన్‌ప్రీత్‌ అని ఇద్దరు కూతుళ్లు, జస్మీత్‌ అనే కొడుకు ఉన్నారు. హనీప్రీత్‌ ఇన్సాన్‌ అనే ఓ బాలికనూ గుర్మీత్‌ దత్తత తీసుకున్నాడు. ఆమె నటి, దర్శకురాలు.

గుర్మీత్‌పై లైంగిక ఆరోపణలు ఇలా

గుర్మీత్‌పై లైంగిక ఆరోపణలు ఇలా

గుర్మీత్‌పై 2002లో తొలిసారిగా వివాదాలు, అత్యాచారం, హత్య, బలవంతపు ఆపరేషన్లలాంటి నేరారోపణలు మొదలయ్యాయి. 2002లోనే తన అనుచర మహిళల్ని వశపరుచుకుని లైంగిక వాంఛ తీర్చుకున్నారన్న కేసు నమోదైంది. ఆ తర్వాత ఇద్దరు సాధ్విలతో లైంగిక వాంఛలు తీర్చుకున్నారని వెలుగులోకి వచ్చిన ఓ లేఖ ప్రస్తుతం అతనిపై అభియోగాలు నమోదుకావడానికి కారణమైంది. అప్పటి ప్రధాని వాజ్‌పేయికి ఓ బాధితురాలు ఈ లేఖ రాశారు. డేరా సచ్చా కార్యకలాపాల్ని నివేదిస్తున్న రాంచందర్‌ ఛత్రపతి అనే జర్నలిస్టును 2002లో హత్యచేసినట్లు గుర్మీత్‌పై అభియోగం నమోదైంది. ఓ అడ్వర్‌టైజ్‌మెంట్‌లోపదో సిక్కు గురువు గోవింద్‌సింగ్‌లాగా గుర్మీత్‌ వేషం ధరించినందుకు 2007లో పంజాబ్‌, హర్యానాల్లో పలు రోజుల పాటు హింస చెలరేగింది. ఆ తర్వాత ఈ కేసును కోర్టులు కొట్టేశాయి. సిక్కులు, డేరాల మధ్య గొడవల్ని ఖలిస్థాన్‌ అనుకూల వర్గాలు సొమ్ము చేసుకున్నాయనేది ప్రచారం. డేరా మద్దతుదారులు ఆత్మాహుతి దళాలంటూ ఓ కేసు కూడా నమోదైంది. ఎన్ని వివాదాలున్నా... అనుచరుల్లో గుర్మీత్‌కు విపరీతమైన పలుకుబడి ఉంది. వారితో కలిసి అతను ఎల్లప్పుడూ ఖరీదైన వాహనాల్లో తిరుగుతుంటాడు. రేంజ్‌ రోవర్‌ ఎస్‌యూవీలో గుర్మీత్‌ వెళుతుంటే.. దాదాపు వంద వాహనాలు (ఇందులో 16 ఫోర్డ్‌ ఎండీవర్‌లు) వెంట వెళుతుంటాయి. గతంలో సిక్కు తీవ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్నాడు. దేశంలో జడ్‌ కేటగిరీ భద్రత పొందుతూ వచ్చిన 36 మంది అత్యంత ప్రముఖుల్లో గుర్మీత్‌ ఒకరు (లైంగిక దాడి కేసులో దోషిగా కోర్టు నిర్ధారించడంతో ఇప్పుడు దానిని ఉపసంహరించారు). బిగ్‌బాస్‌-9లో పాల్గొనడానికి ఒక దశలో అతను సమ్మతించాడు. తెలిపాడు. అయితే అనుచరుల్ని కలుసుకోవడానికి ప్రతి రెండు మూడు గంటలకోసారి తనను బయటికి పంపించాలని అతను షరతు విధించాడు.

గుర్మీత్ సందేశాల కోసం వేల మంది రాక

గుర్మీత్ సందేశాల కోసం వేల మంది రాక

సచ్చా సౌధా అంటే ‘సత్యాన్ని పలికే ప్రదేశం' అని అర్థం. మస్తానా బలూచిస్థానీ అనే వ్యక్తి 1948లో దీనిని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా దీనికి దాదాపు 50 ఆశ్రమాలున్నాయి. దాదాపు 4 కోట్ల మంది అనుచరులు ఉంటారని చెబుతారు. సిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌధా ప్రధానకేంద్రం దాదాపు వెయ్యి ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఇందులోనే పాఠశాల, క్రీడాగ్రామం, ఆసుపత్రి, సినిమా హాలు తదితర వసతులు ఉన్నాయి. పితాజీ(గుర్మీత్‌) సందేశాలు వినడానికి వివిధ ప్రాంతాల నుంచి వేలమంది ‘ప్రేమీ'లు సిర్సాకు వస్తుంటారు. అన్ని పార్టీల నాయకులూ వచ్చిపోతుంటారు. ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలన్న దానిని తన రాజకీయ విభాగానికి గుర్మీత్‌ వదిలిపెడుతుంటారు. 2014 ఎన్నికల్లో హర్యానాలో బీజేపీకి డేరా రాజకీయ విభాగం మద్దతిచ్చింది. 2007 పంజాబ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బలపరిచింది.

బీసీలు.. అట్టడుగు వర్గాలకు అగ్ర తాంబూలం

బీసీలు.. అట్టడుగు వర్గాలకు అగ్ర తాంబూలం

డేరా బాబా అనుచరుల్లో ఎక్కువమంది బీసీలు, తెగల వారు. ముఖ్యంగా దళితులు, అణగారిన వర్గాల వారు. అన్ని కులాలకూ సమానత్వ హోదా ఇవ్వడం వల్లనే ఎక్కువమంది ఇటువైపు మొగ్గుతున్నారు. ప్రతి ఒక్కరి పేరు పక్కన ‘ఇన్సాన్‌' అని చేర్చుకుంటారు. ఇది మానవత్వానికి నిదర్శనమంటారు. రాష్ట్రాన్ని జోన్లు, యూనిట్లుగా విభజించి, ప్రతి యూనిట్‌కు ఒక ‘భంగీ దాస్‌'ను నియమిస్తారు. భంగీ అనేమాట నిమ్నజాతుల వారిని ఉద్దేశించినది. అందుకే అట్టడుగు వర్గాల వారు దీనినో గౌరవంగా భావించి, ఇటువైపు వస్తున్నారు. పంజాబ్‌, హర్యానాల్లో భూస్వాములైన జాట్ల ఆధిపత్యం ఎక్కువ. శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ లాంటి వాటిలో జాట్‌ తదితర అగ్రవర్ణాల సిక్కులు ఉన్నారనే వాదన ఉంది. అందుకే డేరా సచ్చా సౌధాలాంటి వాటివైపు దళితులు, ఇతర బీసీలు మొగ్గు చూపుతున్నారు. తమ విశ్వాసాల్ని గుర్మీత్‌ కించపరుస్తున్నారని ప్రధాన సిక్కు మతనేతలు ఆరోపిస్తుంటారు. మాదకద్రవ్యాలు, మత్తుపానీయాలకు వ్యతిరేకంగా డేరాలు గళం విప్పుతారు కాబట్టి మహిళల్లో వీరికి విపరీతమైన మద్దతు ఉంది.

నిస్వార్థ సేవలోనూ ఇతరులకు స్ఫూర్తి

నిస్వార్థ సేవలోనూ ఇతరులకు స్ఫూర్తి

గుర్మీత్‌కు ఉన్న ఇతర ఆసక్తులు, వ్యాపకాల్లో సినిమా అత్యంత ముఖ్యమైనది. దాదాపు నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించి నటించాడు. మొదటి సినిమా పేరు ‘మెసెంజర్‌ ఆఫ్‌ గాడ్‌'. ఈ సినిమాల్లో ప్రమాదకరమైన స్టంట్‌లు చేయడం ద్వారా అనుచరుల గుండెల్లో సూపర్‌హీరో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ నాలుగు సినిమాలు దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూలుచేశాయని అతని అనుచరులు చెబుతారు. ఐదో సినిమా ఈ ఏడాది విడుదల కావాలి. దాదాపు అరడజను అల్బంలను గుర్మీత్‌ విడుదల చేశాడు. అతనే స్వయంగా సంగీతాన్ని సమకూర్చిన, దర్శకత్వం వహించినవి ఇవన్నీ. ‘రూ-బా-రూ నైట్స్‌' పేరుతో దాదాపు వంద కచేరీలూ అతను నిర్వహించాడు. ఆధునిక రూపంలో సందేశాన్ని అందివ్వడం తన వ్యూహమని గుర్మీత్‌ చెబుతాడు. ఇక నిస్వార్థ సేవ చేయడంలో తమ అధిపతి లక్షల మందికి స్ఫూర్తిగా నిలిచారని గుర్మీత్‌ అనుచరులు చెబుతారు. రక్తం, అవయవ దానాలు, పేదలకు విద్యాబోధన లాంటి కార్యకలాపాల్ని గుర్మీత్‌ అనుచరులు చేస్తుంటారు. రాయితీ ధరలకు ఆహారం, ఉచిత మందులు అందివ్వడం కూడా వీరివైపు చాలా మంది ఆకర్షితులు కావడానికి కారణం. సిర్సా కేంద్రంలో, జిల్లా యూనిట్లలో సభ్యులకు రాయితీ ధరలకు తిండిగింజల్ని సరఫరా చేస్తారు. ఇది పేదలకు వరం. డేరాలు సంగ్రూరు, బర్నాలా, మానస, బటిండా, ఫజిల్కా, ఫరీద్‌కోట్‌, ఫిరోజ్‌పూర్‌ జిల్లాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. ఈ ప్రాంతాల్లో కేన్సర్‌, మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు ఎక్కువ. ఇలాంటి వారందరికీ డేరా అనుచరులు ఉచిత చికిత్స అందిస్తుంటారు.

English summary
NEW DELHI: From a philanthropist to a rape convict – the journey of Rockstar Baba, as Guru Gurmeet Ram Rahim Singh is popularly known, has been nothing less than the masala films he writes, directs, produces and acts in. Though Rockstar Baba has courted enough controversies, his popularity hasn’t waned over the years. Born into money to a rich landlord’s family in Sri Ganganagar (Rajasthan) in 1967, Singh took over Dera Sacha Sauda in 1990. He was barely 23 years old. The dera expanded its influence beyond the borders of states (UP, Delhi, Punjab, Haryana, Rajasthan) to US, UK, Canada, Australia and UAE.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X