
భివానీలో విరిగిపడ్డ కొండచరియలు.. 4 మృతి, శిథిలాల కింద చిక్కుకున్న పలువురు
హర్యానాలో ఘరో ప్రమాదం జరిగింది. మైనింగ్ ప్రాంతంలో కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. దీంతో నలుగురు చనిపోయారు. శిథిలాల కింద పదుల సంఖ్యలో చిక్కుకున్నారు. బివానీ జిల్లాలోని తోషమ్ ప్రాంతంలో దాడమ్ మైనింగ్ జోన్లో ప్రమాదం జరిగింది. శిథిలాల కింద దాదాపు 20 మంది ఉన్నారని విశ్వసనీయ సమాచారం.
దాడమ్ మైనింగ్ జోన్లో క్వారీ పనులు చేస్తుండగా కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ఉన్న వాహనాలతోపాటు పనిచేస్తున్న కూలీలు కొండచరియల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ముగ్గురిని కాపాడినట్లు పేర్కొంటున్నారు. ముగ్గురు మృతదేహాన్ని వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. మరొకరి మృతదేహం వెలికి తీయాల్సి ఉంది.

శిథిలాల కింద మరో 15 నుంచి 20 మంది ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడమ్ మైనింగ్ జోన్లో కొండచరియలు విరిగిపడటం దురదృష్టకరం అన్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించారు.
అక్కడ పదుల సంఖ్యలో మైనింగ్ కార్యకలాపాలు చేస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడ్డాయి. శనివారం ఉదయం 9.30 గంటలకు ప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని హర్యానా మంత్రి జేపీ దలాల్, బివానీ ఎస్పీ అజిత్ సింగ్ షెకావత్ పరిశీలించారు. శిథిలాల కింద నాలుగు ప్రొక్లెయ్లు, 4 డంపర్లు, ఇతర వాహనాలు చిక్కుకున్నాయి.