వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హాథ్‌రస్ నిజాలు సమాధి అవుతున్నాయా... బాధితురాలి గ్రామంలో ఏం జరుగుతోంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అత్యాచారం

ఇది ఒక అదృశ్య భూమి. ఇక్కడ జరిగిన నేరం క్రమంగా కనుమరుగవుతోంది. ఈ ఊరికి చెందిన ఈ జొన్నచేలోనే బాధితురాలి అంత్యక్రియలు కూడా జరిగాయి.

కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా సెప్టెంబర్‌ 29-30 తేదీల మధ్యా బాధితురాలికి హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించారు. బుల్గారీ అనే గ్రామం హాథ్‌రస్‌లో ఉంది.

ఒక దళితమహిళను అగ్రవర్ణాలకు చెందిన ఠాకూర్లు అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుల్గారీ గ్రామంలో కేవలం నాలుగంటే నాలుగు దళిత కుటుంబాలున్నాయి. ఇప్పటి వరకు ఠాకూర్‌ కులానికి చెందిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అది ఒక్కటి మాత్రమే నిజం. మిగతా అన్నీ అర్ధసత్యాలు, అసత్యాలు, ఊహాగానాలే.

ఇక్కడ ఇంకా ఎన్నో కల్పిత కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ, కళ్ల ముందు జరిగిన ఘటనల జ్జాపకాలు అంత త్వరగా ఎలా మాసిపోతాయి. దుండగులు తన కూతురును జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లడాన్ని, తర్వాత తన జుట్టును ముడేయమని కూతురు వేడుకోవడాన్ని ఆ తల్లి ఎలా మస్తిష్కం నుంచి చెరిపేయగలదు?

ఇక్కడ ఒక్కటి కూడా సత్యంలాగా కనిపించడం లేదు. ఒక వాదనకు ప్రతిగా మరో వాదన వినిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని చంద్‌పా ఒక ప్రశాంతమైన ప్రదేశం. ఆరడుగులకు పైగా పెరిగిన జొన్నచేలు కొన్ని వందల ఎకరాల విస్తీర్ణంలో ఎంతో అందంగా కనిపిస్తుంటాయి.

ఈ ప్రాంతానికి చెందిన ఓ యువతి రెండు వారాలపాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. సెప్టెంబర్‌ 29న ఆమె మృతిచెందారు. సెప్టెంబర్ 14న తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాధితురాలిని ఆమె తల్లి తన చీరతో చుట్టి చంద్‌పా పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

నిందితుడు సందీప్‌పై హత్యాయత్నం కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. తన కూతురు చనిపోతుందని తానసలు అనుకోలేదని ఆ తల్లి అవేదన వ్యక్తం చేశారు. పరువుపోతుందన్న భయంతో ఆమె తన కుమార్తెపై అత్యాచారం జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పలేదన్నారు. చివరకు బాధితురాలు చనిపోయే సమయంలో అసలు విషయం బైట పెట్టారు. నిందితులు ఎవరో వెల్లడించారు.

బాధిత కుటుంబంలో బాధే లేదని ప్రచారం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు

నిజాలు మాయమవుతున్నాయా?

ఇప్పుడు అనుమానాలు, ఆరోపణలన్నీ కొట్టుకుపోయాయి. పరువు హత్య అంశం తెరమీదికి వచ్చింది. చనిపోయిన యువతికి నిందితుడైన యువకుడితో శారీరక సంబంధం ఉందని, వారిద్దరు కలిసి ఉండగా చూసిన ఆమె సోదరుడు అవమానంతో ఆ యువతిని చంపే ప్రయత్నం చేశారని ప్రచారం మొదలైంది.

పరువు కోసం లేదంటే డబ్బు కోసం ఆమెను సోదరుడే ఆ యువతిని చంపే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఇలాంటి ఆరోపణలు చేసేవారు రిపోర్టర్లకు, రాజకీయ నాయకులకు ఈ మాటలను నొక్కినొక్కి చెబుతున్నారు. గ్రామంగుండా నడుస్తూ వెళుతుంటే ఇలాంటి అబద్ధాలెన్నో వినిపిస్తాయి.

నిజాలు సమాధి అవుతున్న ఈ సమయంలో రిపోర్టర్ల పని చాలా కష్టమవుతుంది. ఆ రిపోర్టర్‌ మహిళ అయినప్పుడు ఆ ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. కానీ, ఇప్పటికే అక్కడ చాలా విషయాలను మార్చేశారు. మెడికల్ రిపోర్ట్‌ మీద స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అత్యాచారం

ఇప్పుడు పరువు హత్య అంశం తెరమీదికి వచ్చింది. అవకాశవాద రాజకీయాలు కూడా మొదలయ్యాయి. విమర్శల నుంచి తప్పించుకోడానికి, నష్ట నివారణకు పోలీసులు నేతలను, పాత్రికేయులను ఆ ఊళ్లోకి వెళ్లడానికి అనుమతించారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంకాగాంధీ ఆ గ్రామానికి వచ్చారు.

అయితే ,ఠాకూర్లకు అన్యాయం జరుగుతోందని చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు చెందిన అనేకమంది పంచాయితీ పెద్దలు వాదించారు. వారిని అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తున్నారని, అరెస్టులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఇక అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు ఇక రకరకాల కథనాలను వండి వారుస్తున్నారు. ఇక్కడ నైతికతకు చోటులేదు. ఈ గ్రామంలోకి వెళ్లినప్పుడు నేను ఇదే గమనించాను. వేరే కారణాల వల్ల ఆమె మెడ విరిగిందని అక్కడి వారు చెప్పడం మొదలు పెట్టారు.

హాథ్‌రస్

స్టూడియోగా మారిన గ్రామం

అక్టోబర్‌ 4న అంటే పోలీసులు మీడియాను గ్రామానికి వెళ్ళడానికి అనుమతించడానికి ముందు రోజున వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు అక్కడ ఆందోళనకు దిగారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. అయితే ఎలాగోలా సందు చేసుకుని వెళితే ఎవరూ ఆపరు. “ఇక్కడి నుంచి మీరు రెండు కిలోమీటర్లు నడవాలి’’ అని పోలీసు అధికారి చెప్పారు.

అప్పుడప్పుడు బైక్‌లు రావడం మినహా ఆ రహదారి ఖాళీగా ఉంది. నేరం జరిగింది కూడా ఈ ప్రాంతంలోనే. ఇక్కడున్న అన్ని సాక్ష్యాలను తొలగించారు. ఒకే ఒక్క సాక్ష్యమైన మృతదేహాన్ని కూడా బూడిద చేశారు.

అటుగా రోడ్డు మీద వెళుతున్న ఓ వ్యక్తి తాను పొరుగు గ్రామానికి చెందినాడినని తెలిపారు. తాను కూడా ఠాకూర్‌నేనని వెల్లడించారు. పేరు నర్సింగ్. “ మీడియాలో చూపిస్తున్నదంతా నిజం కాదు. ఆ అమ్మాయికి నిందితుడితో అక్రమ సంబంధం ఉంది. ఆమె కూడా మా బిడ్డలాంటిదే ”అని ఆయన చెప్పారు.

“మరి అలాంటప్పుడు ఆమెపై అత్యాచారం ఎందుకు జరిగింది? ” అంటే “మీరు వెళ్లి తెలుసుకోండి” అని చెప్పి వెళ్లిపోయారు.

అత్యాచారం

నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో న్యాయం కోసం పోరాడినట్లుగానే ఇక్కడ కూడా అనేకమంది రిపోర్టర్లు గుమి గూడారు. కేబుళ్లు, మైకులు, కెమెరాలతో అంతా హడావుడిగా ఉంది అక్కడి పరిస్థితి.

మైకుల్లో పెద్దపెద్దగా మాట్లాడుతూ లైవ్‌లు నడిపిస్తున్నారు. టీఆర్పీ రేటింగుల కోసం సత్యాన్ని సమాధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి రెండు మీటర్లకు ఒక లైవ్ జరుగుతోంది. బాధితుడి ఇంటికి దారితీసిన ఇరుకైన సన్నగా ఉండేయ దారిపక్కన ఒక రిపోర్టర్‌ వాయిస్‌ వినిపిస్తోంది. అది లైవ్‌. ఇక్కడ అందరిలాగే రాష్ట్ర-ప్రాయోజిత నిజాలు చెబుతున్నారు. రెండు రోజుల్లో కథనం మారింది.

ఇద్దరు స్థానిక జర్నలిస్టులు మీరు నిజం కోసం చూస్తున్నారా అని అడిగారు. వారు తమకు తెలిసిన సత్యాన్ని ఎటువంటి ఖర్చు లేకుండా అందరు రిపోర్టర్లకు అందిస్తున్నారు."ఇక్కడ ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలున్నాయి. నా దగ్గర ఆధారాలున్నాయి. ఠాకూర్లు నిర్దోషులు ” అని ఆ ఇద్దరు జర్నలిస్టులలో ఒకరు చెప్పారు.

అంతకు ముందు ఈ రెండు కుటుంబాల మధ్య ఓ భూమి విషయంలో జరిగిన గొడవ, బాధిత కుటుంబం ఠాకూర్లకు వ్యతిరేకంగా 15 సంవత్సరాల కిందట పెట్టిన ఎస్సీ-ఎస్టీ యాక్ట్‌ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను ఆ జర్నలిస్టు చూపిస్తున్నారు.

హాథ్‌రస్

మరణ వాంగ్మూలానికి విలువ లేదా?

ఈ కేసులో నిందితులైన వారి ఇంటి బయట కూర్చున్నాం. అక్కడ ఒక మహిళ బట్టలుతుకుతోంది. అసలు విషయం ఎవరూ చెప్పడం లేదని ఆ మహిళ వ్యాఖ్యానించింది. “నిందితులు నిజంగా దోషులు కారు’’ అని ఆమె చెప్పింది.

“బాధితురాలి సోదరుడి పేరు సందీప్. మా బావ పేరు కూడా సందీప్‌. మరి ఆమె ఏ సందీప్‌ పేరు చెప్పిందో’’ అని ఆ మహిళ సందేహం వ్యక్తం చేసింది. అంటే ఇక్కడ బాధితురాలి మరణ వాంగ్మూలానికి అర్ధం లేదన్న మాట.

“చెప్పుడు మాటలు, ఊహాగానాల కన్నా మరణ వాంగ్మూలానికి ఎక్కువ విలువ ఉంటుంది. పీవీ రాధాకృష్ణ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక కేసులో చనిపోతున్నప్పుడు బాధితుడు చెప్పిన విషయానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చనిపోతూ కూడా ఒక మనిషి అబద్ధం చెప్పాలనుకోడని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

బాధితురాలి బూడిద అక్కడే ఉంది. ఆ జొన్నచేలోంచి కొంచెం ముందుకు వెళితే బాధితురాలిని దహనం చేసిన ప్రదేశం వస్తుంది. అక్కడి నుంచి ఒక రిపోర్టర్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.

పోలీసులు అంత హడావుడిగా ఈ బాధితురాలిని ఎందుకు దహనం చేశారో ఎవరికీ తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అల్లర్లు జరక్కుండా ముందు జాగ్రత్తగా చర్యగా దహనం చేశామని చెప్పింది.

“ మేం చేయకపోయినట్లయితే ఇక్కడి గ్రామస్తులే ఆ పని చేసేవారు. ఇక్కడి కుల సమీకరణలు మీకు అర్ధం కావు’’ అని ఓ పోలీసాఫీసర్‌ అన్నారు. ఆ యువతి చేలో పడి ఉన్నప్పుడు ఆమె నాలుక తెగి ఉందని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ ఆమె ఆసుపత్రిలో మరణ వాంగ్మూలం ఇచ్చారు. ఇదెలా సాధ్యం అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు.

బాధితురాలి చెప్పులు

బాధిత కుటుంబంలో బాధ లేదా?

ఆ అమ్మాయి చనిపోయినందుకు ఆ కుటుంబానికి బాధే లేదని, వారికి ఇప్పటికే చాలా డబ్బు వచ్చిందని మరికొందరు గుసగుసలాడుతున్నారు. అక్కడ చాలామంది రిపోర్టర్లు ఉన్నారు. వారిలో చాలామంది మగవాళ్లే.

బాధితులు ఎంత పేదవారైనా, పరిహారం ఎంత ఎక్కువ ఇచ్చినా కుటుంబానికి బాధ లేకుండా ఎలా ఉంటుంది ? చనిపోయిన మనిషి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు ? కళ్ల వెంట నీరు కారితేనే బాధ ఉన్నట్లా?

అక్టోబర్‌ 4 నుంచి బాధిత కుటుంబం ఇంట్లో పొయ్యి వెలగలేదు. కానీ చాలామంది పాత్రికేయులు వచ్చి ఆ కుటుంబంతో మాట్లాడిస్తున్నారు. దూరంగా ఓ న్యూస్‌ యాంకర్‌ పెద్దపెద్దగా ఏదో చెబుతోంది. అన్నీ లైవ్‌లే. ఆ గ్రామం, ఆ ఇల్లూ ఓ స్టూడియోలా మారిపోయాయి.

ఆ ఇంట్లో విషాదమే లేదనే వారు ఆమె కోసం ఒక్క కన్నీటి చుక్క కూడా రాల్చి ఉండరు. ఆమె తల్లి చెప్పే మాటలు విని ఉండరు, కనీసం చూసి ఉండరు. అందుబాటులో ఉన్న సాక్ష్యాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదు.

విలేకరులంతా వెళ్లిపోయిన తర్వాత ఆమె పెద్దగా ఏడ్చారు. రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల నాయకులు ఆ కుటుంబాన్ని చుట్టు ముట్టారు.

హాథ్‌రస్

వాల్మీకి కులస్తులు ఎవరు?

వాల్మీకి కులస్తులను హిందువులుగా, దానికి సమానమైన పౌరులుగా ఠాకూర్లు ఎప్పుడూ పరిగణించరు. అంటరానివారు, అంటదగినవారు అన్న భేదం అక్కడి కులాల స్థాయిని మాత్రమే తెలుపుతుంది. కానీ శరీరాన్ని తాకవచ్చు. సెక్స్‌ కోరికలు వ్యక్తం చేయవచ్చు. అక్కడ ఎలాంటి కులం అడ్డంకులు ఎదురు కావు.

నిమ్న కులాలకు చెందిన వారిపై అగ్రకులాల వారు అత్యాచారం చేయడం అక్కడ సర్వసాధారణమైన విషయం. వాల్మీకి కులస్తులు ఇక్కడ సమాజంలో అత్యంత కింది స్థాయిలో ఉన్న ప్రజలు. వారిని భంగీలు అని పిలుస్తారు. ఊరికి దూరంగా వారి ఇళ్లు ఉంటాయి.

సంధ్య అనే మహిళ బాధితురాలికి వదిన అవుతుంది. ఆమె సోదరి ప్రీతి ఎటావాలోని ఒక గ్రామంలో ఉంటారు. అక్కడ పరిస్థితులు ఇంత ఘోరంగా లేవంటారామె. “ ఇక్కడ ఓ షాపుకు వెళ్లి ఏదైనా కొనుక్కుని అది బాగలేకపోతే దాన్ని తిరిగివ్వాలంటే షాపు వాళ్లు తీసుకోరు. మా స్పర్శ వల్ల అది అపవిత్రమైందని వారు భావిస్తారు. దళితుల నీడ కూడా ఠాకూర్ల మీద పడకూడదు’’ అని చెప్పారు ప్రీతి.

బాధితురాలి మృతదేహం వచ్చినప్పటి నుంచి ప్రీతి ఇక్కడే ఉన్నారు. ఆమెకు బాధితురాలి గురించి బాగా తెలుసు. " ప్రేమించిన వ్యక్తిని రేప్ చేయమని ఎవరైనా అడుగుతారా ? ప్రేమించడం ఒక నేరమా? వాళ్ల బలాన్నంతా ఆడవాళ్ల మీదే చూపిస్తారు. ఈ అనైతిక విధానాలను వ్యతిరేకించాలి'' అని ప్రీతి అన్నారు.

ఊళ్లో అమలవుతున్న అనైతిక చట్టాల పట్ల ప్రీతి ఆగ్రహంగా ఉన్నారు. “ తక్కువ కులంలో జన్మించినప్పుడే కుల వ్యవస్థ ఎంత దారుణంగా ఉంటుందో తెలుస్తుంది. మనం పొరపాటున వారికి తగిలినా, వాళ్లు స్నానం చేసి వస్తారు. ఇలాంటివన్నీ మాకు తెలుసు. వీటని మేం రోజూ అనుభవిస్తూనే ఉన్నాం’’ అన్నారు ప్రీతి.

“ మేం భయం మధ్య బతుకుతున్నాం. మా దగ్గర డబ్బు లేదు. దాన్ని ఎలాగోలా సంపాదించుకుంటాం. కానీ గౌరవం మాటేంటి? అని ప్రశ్నించారు ప్రీతి.

గ్రామంలో ఎక్కడ చూసినా పోలీసులు కనిపిస్తున్నారు. అక్టోబర్‌ 4న దళిత హక్కుల సంఘం భీమ్‌ సేన నాయకుడు చంద్రశేఖర ఆజాద్‌ ఇక్కడికి వచ్చారు. ప్రభుత్వం వీరికి వై-ప్లస్‌ కేటగిరి రక్షణ కల్పించకపోతే తాను ఈ కుటుంబాన్ని తీసుకుని వెళతానని ఆయన అన్నారు.

కంగనా రనౌత్‌కు భద్రత కల్పించినప్పుడు ఈ కుటుంబానికి ఎందుకు కల్పించలేరు’’ అని ఆయన ప్రశ్నించారు. “నాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. సుప్రీంకోర్టు మీదే విశ్వాసం ఉంది. వారు కూడా ఈ కుటుంబానికి రక్షణ కల్పించకపోతే నేనే వారిని నా ఇంటికి తీసుకెళతాను’’ అన్నారు భీమ్‌ సేన నేత చంద్రశేఖర ఆజాద్‌.

కానీ, ఆయన వారిని తీసుకెళ్లకుండానే వెళ్లిపోయారు. ఎందుకని ప్రశ్నిస్తే తనకు అనుమతి లభించలేదని చెప్పారు. 144 సెక్షన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయనపై కేసు నమోదైంది. మరో 400మందిపై కూడా పోలీసులు కేసులు పెట్టారు.

అత్యాచారం

సుప్రీం కోర్టుకు చెందిన రిటైర్డ్‌ జడ్జితో నిర్ణీత కాల పరిమితిలో కేసు విచారణ జరిపించాలని చంద్రశేఖర ఆజాద్ డిమాండ్‌ చేశారు. ఆయన ఈ కుటుంబాన్ని కలవడానికి వచ్చినట్లు తెలియగానే రాజపుత్‌ కర్ణిసేన కూడా తన ప్రతినిధులను ఆ గ్రామానికి పంపింది. “ చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఇక్కడికి వచ్చారు కాబట్టి మేం కూడా వచ్చాం’’ అని కర్ణిసేన ప్రతినిధులు అన్నారు.

“సుశాంత్‌ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో మేం విజయం సాధించాం. మీడియా మాకు చాలా సహకరించింది’’ అని వారు అన్నారు. వీటన్నింటినీ చూస్తే ఇక్కడి పరిస్థితులు ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

ఏపీలో వరుస వివాదాల్లో పోలీసులు: అక్రమాలు పెరిగాయా? చర్యలు పెరిగాయా?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Facts are being burried in Hathras Rape incident
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X