హత్రాస్ ఘటనలో పోలీసులకు షాక్ ...అత్యాచారం జరిగిందని నిర్ధారించిన నివేదిక
హత్రాస్ హత్యాచార ఘటనలో బాధితురాలిపై అత్యాచారం జరిగిందా లేదా అన్నది దేశవ్యాప్త చర్చకు కారణమైంది. ఒక పక్క బాధితురాలు మరణ వాంగ్మూలంలో తనపై సామూహిక అత్యాచారం జరిగినట్టు చెప్తే, పోలీసులు బాధితురాలిపై అత్యాచారం జరగలేదని వాదించడంతో దేశం ఒక్కసారిగా భగ్గుమంది . హత్రాస్ లో దళిత యువతి సామూహిక అత్యాచారం నుండి ఆమె మరణం తర్వాత అంతిమ సంస్కారాల వరకు అన్నీ అనుమానాలకే కారణం అయ్యాయి . యూపీ ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోశాయి.
యూపీలో ఉంది రామరాజ్యం కాదు అటవీ రాజ్యం ... ప్రజాస్వామ్యంపై సామూహిక అత్యాచారం : శివసేన ఫైర్

హత్రాస్ సామూహిక హత్యాచార ఘటన.. ఫోరెన్సిక్ నివేదిక ఇలా
సామూహిక అత్యాచార ఘటనలో దాడి జరిగిన కొద్ది రోజులకే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ కు చెందిన దళిత యువతికి సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక ఆమెపై అత్యాచారం జరిగినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని, ఆమె తీవ్ర గాయాలతోనే ప్రాణం కోల్పోయినట్లుగా వెల్లడించింది.
అత్యాచారం జరిగిన పదకొండు రోజుల తర్వాత నిర్వహించిన ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా అత్యాచారం జరగలేదని పోలీసులు వెల్లడించడంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి.

అత్యాచారం జరగలేదని వెల్లడించిన పోలీసులు
యూపీ శాంతిభద్రతలు ఏడీజీ ప్రశాంత్ కుమార్ దళిత యువతిపై అత్యాచారం జరగలేదని పేర్కొన్నారు. ఆగ్రాలోని ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ లో యువతిపై అత్యాచారం చేసినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆయన పేర్కొన్నారు . పోస్టుమార్టం నివేదికలో బాధిత యువతి మెడకు గాయం కారణంగా మరణించిందని తేలిందని పోలీసులు చెప్పారు. కొందరు కావాలని కులవిద్వేషాలు రేకెత్తించడానికి ఈ విషయాన్ని వక్రీకరించి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్పిన విషయం తెలిసిందే.

ఫోరెన్సిక్ నివేదికతో విబేధించిన అలీఘర్ ముస్లిం
విశ్వవిద్యాలయం జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్
అత్యాచారం జరిగిన 11 రోజుల తర్వాత మహిళ నుంచి తీసుకున్న నమూనాలలో అత్యాచారం జరిగినట్లుగా ఆధారాలు ఉండకపోవచ్చని అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ వైద్యులు పేర్కొన్నారు. ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన జవహర్ లాల్ నెహ్రూ వైద్యకళాశాల ఇచ్చిన నివేదిక బాధితురాలు అత్యాచారానికి గురైనట్లు స్పష్టంగా పేర్కొంది. బాధితురాలి పై దాడి జరిగిన వెంటనే తీసుకునే నమూనాను పరీక్షించినప్పుడు, పదకొండు రోజుల తర్వాత నమూనాలను పరీక్షించినప్పుడు కచ్చితంగా తేడా ఉంటుందని వైద్య నిపుణులు తెలిపారు.

54 పేజీల నివేదిక.. అత్యాచారం జరిగానట్టు తేల్చిన వైద్య నిపుణులు
మరణానికి ముందు బాధితురాలు ఇచ్చిన మరణ వాంగ్మూలం కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ హమ్జా మాలిక్ తెలిపారు . బాధితురాలికి సంబంధించి ప్రాధమిక పరీక్షల ఆధారంగా, బలప్రయోగం సంకేతాలు ఉన్నాయని నా అభిప్రాయం అని నమూనాలను ప్రాధమికంగా పరీక్షించిన వైద్యుడు జెఎన్ఎంసిహెచ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ మెడికల్ ఎగ్జామినర్ డాక్టర్ ఫైజ్ అహ్మద్ తెలిపారు. 54 పేజీల JNMCH నివేదిక, రెండు వారాల పాటు జీవితంతో పోరాడి మరణించిన యువతిపై అత్యాచారం జరిగినట్టు , మరియు ఆమెగొంతు కోసి చంపబడినదని నేరానికి సంబంధించిన పలు కీలక అంశాలను పేర్కొంది .