ఆధారాలుంటే కోర్టును ఆశ్రయించాలి: అమిత్‌షా
న్యూఢిల్లీ: తన కుమారుడు జే షా కంపెనీలో అవినీతి చోటుచేసుకోలేదని బీజేపీ చీఫ్ అమిత్ షా చెప్పారు. ఆధారాలుంటే కోర్టును ఆశ్రయించవచ్చని అమిత్‌షా సవాల్ విసిరారు.
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జే షా కంపెనీ సంపద పెరిగిందన్న ఓ వెబ్సైట్ కథనాన్ని ఆయన తోసిపుచ్చారు. ఈ అంశం ఆధారంగా కాంగ్రెస్ పార్టీ తనపై, ప్రధాని నరేంద్ర మోదీపై దాడికి దిగుతోందని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ పలుమార్లు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా ఎప్పుడూ క్రిమినల్ దావా వేయలేదని, రూ 100 కోట్ల పరువు నష్టం దావా వేయలేదని ఎద్దేవా చేశారు. తన కుమారుడు జే షా పరువు నష్టం దావా వేశారని, న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తూ విచారణ చేపట్టాలని కోరారని చెప్పారు.
తమపై బురద చల్లే వారు ఇప్పుడు ఆధారాలతో కోర్టును సంప్రదించవచ్చని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం జే షా కంపెనీ టర్నోవర్ 16,000 రెట్లు పెరిగిందని దివైర్ వెబ్సైట్ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే.
అయితే దీన్ని సవాల్ చేస్తూ ఈనెల 9న జే షా అహ్మదాబాద్ మెట్రపాలిటన్ కోర్టులో ఆ వెబ్‌సైట్‌పై రూ 100 కోట్లకు పరువునష్టం దావా వేశారు. తప్పుడు కథనంతో తమ ప్రతిష్టను దిగజార్చిన నిందితులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ జే షా కోర్టును ఆశ్రయించారు.