కమల్, రజనీ రహస్య భేటీ, కాలాతో రాజకీయం ఓకే, జాతీయ జెండాలో కాషాయం, షరతులు!

చెన్నై: రాజకీయ రంగప్రవేశానికి ముందే తాను సూపర్ స్టార్ రజనీకాంత్ తో రహస్యంగా భేటీ అయ్యానని మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్ హాసన్ తెలిపారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో సమావేశం అయిన రోజు తన రాజకీయ రంగప్రవేశంపై సుదీర్ఘంగా చర్చించానని, కాలాతో కలిసి పని చెయ్యడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కమల్ హాసన్ వివరించారు. జాతీయ జెండాలోనే కాషాయం ఉందని కమల్ గుర్తు చేశారు.

గత ఏడాది
కమల్ హాసన్ తమిళ వారపత్రిక ఆనంద వికటన్ కు రాసిన వ్యాసంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను రాజకీయాల్లోకి రావాలని గత ఏడాది మానసికంగా సిద్దం అయ్యానని, ఇప్పుడు ఆచరిస్తున్నానని కమల్ హాసన్ ఆనంద వికటన్ కు రాసిన వ్యాసంలో వివరించారు.

కాలా, బిగ్ బాస్
చెన్నై నగరం సమీపంలో పూనామల్లిలో తానుబిగ్ బాస్ షూటింగ్ లో పాల్గొన్నానని, అక్కడికి సమీపంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా సినిమా షూటింగ్ జరుగుతుందని, ఆ సమయంలో తాను రజనీకాంత్ కు ఫోన్ చేసి మీతో మాట్లాడాలని చెప్పానని కమల్ హాసన్ ఆనంద వికటన్ వ్యాసంలో వివరించారు.

షూటింగ్ గ్యాప్ లో
రజనీకాంత్ సూచన మేరకు షూటింగ్ గ్యాప్ లో తామిద్దరం రహస్యంగా కలిసి రాజకీయ అంశాలపై మాట్లాడామని కమల్ హాసన్ స్పష్టం చేశారు. మొదట తన రాజకీయ రంగప్రవేశంపై రజనీకాంత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని, అనంతరం ప్రజాసేవ చెయ్యడానికి సిద్దం కావాలని తనను ఆయన ప్రోత్సహించారని కమల్ హాసన్ వివరించారు.

కాషాయ రాజకీయం
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న కాషాయ రాజకీయాలను తాను వ్యతిరేకిస్తున్నాని కమల్ హాసన్ మరోసారి ఆనంద వికటన్ కు రాసిన వ్యాసంలో స్పష్టం చేశారు. కాషాయాన్ని తాను కించపరుస్తున్నానని కొందరంటున్నారని, అది ఏమాత్రం వాస్తవం కాదని, కషాయం త్యాగానికి ప్రతీక అని ప్రపంచానికే తెలుసని కమల్ హాసన్ వివరించారు.

జాతీయ జెండాలో కాషాయం
మన జాతీయ జెండాలో కాషాయం రంగు ఉందని, అయితే ఆ కాషాయం జెండా మొత్తం వ్యాపించకూడదని ఆనంద్ వికటన్ కు రాసిన వ్యాసంలో కమల్ హాసన్ వివరించారు. రజనీకాంత్, బీజేపీ తమిళనాడు నాయకులను దృష్టిలో పెట్టుకుని కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలిసింది.

కుడి, ఎడమ కాదు
కుడి, ఎడమ (వామపక్షాలు) సిద్దాంతాలు తాను తీసుకోలేదని, మధ్య మార్గంలో ప్రయాణించాలని నిర్ణయించానని కమల్ హాసన్ వివరించారు. తన మార్గంలో ద్రవిడ సిద్దాంతాలు పుష్కలంగా ఉన్నాయని, అందులో ఎలాంటి సందేహం లేదని కమల్ హాసన్ స్పష్టం చేశారు.

రజనీతో ఓకే అయితే ?
సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి రాజకీయాల్లో పని చెయ్యడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కమల్ హాసన్ మరోసారి స్పష్టం చేశారు. అయితే రజనీకాంత్ బీజేపీని, హిందూవాదాన్ని అనుసరిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఆయనతో కలిసే ప్రసక్తేలేదని, అయితే ఒకరిని ఒకరు గౌరవించుకోవాలని తాము ఏడాది క్రితం జరిగిన రహస్య భేటీలో నిర్ణయించామని ఆనంద్ వికటన్ కు రాసిన వ్యాసంలో కమల్ హాసన్ వివరించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!