హేమామాలినికి ఆఫర్: 70కోట్ల ప్లాట్ రూ.1.75లక్షలకే!
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి, భారతీయ జనతా పార్టీ ఎంపీ హేమామాలిని మరో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అత్యంత ఖరీదైన ముంబై అంధేరిలోని 2వేల చదరపు మీటర్ల స్థలాన్ని అతి తక్కువ ధరకు హేమామాలినికి కట్టబెట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
రూ. 70 కోట్లు విలువ చేసే ఈ స్థలాన్ని ఆమె ఏర్పాటు చేయనున్న డ్యాన్స్ స్కూల్ కోసం కేవలం రూ. 1.75 లక్షలకే ఇవ్వడం వివాదం రేపుతోంది. హేమామాలిని పట్ల దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం అనుచితమైన ఆపేక్ష కనబరుస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి.
బీజేపీ నేతృత్వంలోని మహా సర్కార్ మాత్రం ప్రస్తుతమున్న రాష్ట్ర విధానం ప్రకారమే ఈ ధర నిర్ణయించామని, 1976 ఫిబ్రవరి 1న నిర్దేశించిన ఈ విధానం ప్రకారం స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలకు 25శాతం ధరకే భూములు కేటాయించవచ్చునని పేర్కొంది.

కాగా, 1976నాటి మార్కెట్ ధర ప్రకారం ఈ స్థలానికి విలువ కట్టడం గమనార్హం. నాటి మార్కెట్ ధర అయిన రూ. 350 చదరపు మీటరు చొప్పున రెండువేల చ.మీ. స్థలానికి రూ. 7 లక్షలు ధర నిర్ణయించారు. అంతేగాక, అందులో 25శాతానికిగాను రూ. 1.75 లక్షలు చెల్లించాల్సిందిగా ఖరారు చేశారు.
నిజానికి ప్రస్తుత ప్రభుత్వ మార్కెట్ ధర ప్రకారం ఈ స్థలం విలువ రూ. 23కోట్లు పలుకుతుండగా.. ఇక ప్రైవేటు మార్కెట్లో రూ. 60 కోట్ల నుంచి 70 కోట్ల వరకు ధర పలుకుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, ఈ విషయంపై హేమామాలిని ఇప్పటి వరకు స్పందించలేదు.