అశోక్ గెహ్లాట్ సర్కారుకు మరో షాక్: ఆ ఆరుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
జైపూర్: రాజస్థాన్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు మరో షాక్ తగిలింది. బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో విలీనమైన ఆరుగురు ఎమ్మెల్యేలకు రాజస్థాన్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
కరోనాపై చర్చిస్తాం: గవర్నర్‌కు లేఖలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ట్విస్ట్

ఆరుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు..
ఆరుగురు ఎమ్మెల్యేలతోపాటు స్పీకర్ సీపీ జోషీ, అసెంబ్లీ కార్యదర్శికి ఈ నోటీసులు జారీ అయ్యాయి. విలీనంపై బీఎస్పీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఏకసభ్య ధర్మాసనం ఈ నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 11 లోపు నోటీసులకు సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.

కాంగ్రెస్‌లోకి ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు..
కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ ఏర్పాటుకు సాయపడిన ఆరుగురు ఎమ్మెల్యేలు గత సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌లో విలీనం అయ్యారు. దీనిపై ఆ పార్టీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. తాజా బీఎస్పీ రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఎమ్మెల్యేల విలీనం రాజ్యాంగ విరుద్ధమని ఆ పార్టీ తరపు న్యాయవాది వాదించారు.

బీఎస్పీ ఎమ్మెల్యేలతోనే గెహ్లాట్ సర్కారు..
ఇప్పటికీ వారు బీఎస్పీకి రాజీనామా చేయలేదని, ఒకవేళ వారు విప్ ధిక్కరిస్తే అనర్హత వేటుకు అర్హులని స్పష్టం చేశారు. కాగా, తాజా పరిణామాలు సీఎం అశోక్ గెహ్లాట్ సర్కారుకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టినట్లయింది. తనకు 102 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గెహ్లాట్ ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే, ఇందులో బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా ఉండటం గమనార్హం.

మరోసారి ఉత్కంఠగా మారిన రాజస్థాన్ రాజకీయం..
ఇప్పటికే సచిన్ పైలట్ సుమారు 19 ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీని వీడిన విషయం తెలిసిందే. 200 సీట్లున్న రాజస్థాన్ అసెంబ్లీలో సాధారణ మెజార్టీకి 101 సీట్ల అవసరం ఉంది. ఇక, ముగ్గురు ఆర్ఎల్పీ ఎమ్మెల్యేలతో కలిపి బీజేపీకి 75 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కాంగ్రెస్ పార్టీకి బీఎస్పీ ఎమ్మెల్యేల మద్దతు లేకుంటే ఆ పార్టీ 96కు పడిపోనుంది. బీజేపీతోపాటు సచిన్ పైలట్ వర్గం కూడా అశోక్ గెహ్లాట్‌ను బలం నిరూపించుకోమంటూ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఆగస్టు 14న అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరింత ఉత్కంఠగా రాజస్థాన్ రాజకీయాలు మారాయి.