• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చరిత్ర చెప్పిన సత్యాలు: అఖండ భారత్‌ను రెండు దేశాలుగా ఎందుకు విభజించారు..?

|

ఆగష్టు,1947..రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యం భారతదేశాన్ని 300 ఏళ్లకు పైగా పరిపాలించి భారత్‌కు స్వాతంత్ర్యం ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యత కలిగి ఉన్న భారతదేశాన్ని వెళుతూ వెళుతూ రెండుగా చీల్చి వెళ్లారు. ఒక్క దేశాన్ని రెండుగా విడగొట్టారు. అఖండ భారతదేశాన్ని రెండుగా చీలుస్తూ ఓ గీతను గీశారు. దీంతో పాకిస్తాన్‌ అనే కొత్త దేశం పురుడు పోసుకుంది. కొన్ని ఏళ్ల తరబడి ఇక్కడ సోదరభావంతో మెలిగిన ప్రజలు బలవంతంగా గ్రామాలను దాటించారు.

భారత సరిహద్దును దాటి కొన్ని లక్షల మంది పాకిస్తాన్‌లోకి ప్రవేశించారు. ఈ క్రమంలో దాదాపు లక్షమంది ప్రాణాలు పొగొట్టుకుని ఉంటారు. అంతేకాదు అప్పటి వరకు ప్రపంచంలోనే శాంతియుత దేశంగా ఉన్న భారతదేశంలో మళ్లీ మతఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలకు ఆజ్యం పోసిన బ్రిటీష్‌ రాజ్యం భారత్‌ లో జరుగుతున్న హింసను చూసి పాశవిక ఆనందం పొందింది. హిందువులు, ముస్లింలు ఎప్పుడూ లేనంతగా ఒకరిపైకొకరు దాడికి దిగారు. ఈ దాడుల్లో అమాయకమైన ప్రజలు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.

కాస్మోపాలిటన్‌గా విరాజిల్లిన లాహోర్ నగరం

కాస్మోపాలిటన్‌గా విరాజిల్లిన లాహోర్ నగరం

1946... అంటే దేశ విభజన జరగక ఒక్క సంవత్సరం ముందు... పరిస్థితి ఒకసారి గమనిస్తే భారతదేశంలో శాంతి సమాధానం, మతసామరస్యంతో అందరూ సోదరభావం కలిగి జీవించారు. ఒకరి కష్టాలను ఒకరు పంచుకుంటూ అత్యంత అన్యూన్యతతో కలిసి మెలిసి ఉన్నారు. అప్పట్లో అంటే దేశవిభజన కంటే ముందు దేశంలో 25కోట్ల50 లక్షల మంది హిందువులు ఉండగా... 9కోట్ల 20 లక్షల మంది ముస్లింలు ఈశాన్య వాయువ్య భారతదేశంలో ఉన్నారు. 60 లక్షల మంది పంజాబ్‌లో నివసిస్తూ ఉండేవారు.

పంజాబ్‌ రాజ్యానికి ప్రాచీన లాహోర్‌ రాజధానిగా ఉండేది. అప్పట్లో లాహోర్‌ ఒక కాస్మోపాలిటిన్‌ నగరంగా విరాజిల్లింది. మంచి విశ్వవిద్యాలయాలకు,విద్యాబోధనలకు లాహోర్‌ పేరుగాంచింది. అభివృద్ధి అంతా లాహోర్‌లోనే కనిపించడంతో చాలామంది చదువుకునేందుకు లాహోర్‌ వెళ్లేవారు. ఎంతో శాంతియుతంగా ఉన్న నగరం కొన్ని నెలల సమయంలోనే అశాంతికి నెలవుగా మారింది.

నాటి పాలకుల పాపమే దేశ విభజనకు ఆజ్యం పోసింది

నాటి పాలకుల పాపమే దేశ విభజనకు ఆజ్యం పోసింది

200 ఏళ్లు పాటు 38 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని బ్రిటీష్‌ వారు పాలించారు. ఇందుకు కారణం భారతదేశం పరిపాలనా పరంగా, ఆర్థికంగా అన్నిటికీ అనువైన ప్రాంతంగా ఉండటమే. బ్రిటీష్‌ వారు సాగిస్తున్న అరాచక పాలనపై సహనం కోల్పోయిన భారతీయులు ఒక్కసారిగా తిరగబడ్డారు. 1946లో పరిస్థితి మొత్తం తారుమారైంది. తిరుగుబాటు దారులని నియంత్రించేందుకు బ్రిటీష్‌ వారు మిలటరీ దళాలను రంగంలోకి దించారు. అప్పటికే రెండో ప్రపంచ యుద్ధం కారణంగా బ్రిటీష్‌ రాజ్యం ఆర్థికంగా చాలా నష్టపోయింది. అదే సమయంలో బ్రిటీష్‌ వారు దేశాన్ని విడిచిన తర్వాత ఏమి చేయాలనే ఆలోచనపై ఆనాటి నేతల్లో భిన్నాభ్రిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

మహాత్మా గాంధీ, నెహ్రూలు తమకు ఒకే దేశం కావాలని తద్వారా అన్ని వర్గాల వారు, కులాల వారు, మతాల వారు సోదరభావంతో కలిసి ఉంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే మెజార్టీగా ఉన్న హిందూ మతస్తుల కింద ముస్లిం సోదరులు జీవనం సాగించాలంటే భయపడ్డారు. కొంతమంది హిందూమతానికి చెందిన వారు ముస్లింలను వారి ఇళ్లలోకి రానించేవారు కాదు... అదే సమయంలో వారితో కలిసి భోజనం చేసేందుకు ఇష్టపడేవారు కాదు. దీంతో ముస్లింలలో ఒక్కింత అసహనం బయటపడింది. లాహోర్‌ నగర వీధుల్లో కొంత మంది హిందువులు తాగునీటి కుళాయి నుంచి నీళ్లు కూడా తాగనిచ్చేవారు కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ముస్లింలను అంటరానివారిగా చూసేవారని చెప్పాలి. ముస్లింలకు ఉద్యోగాల ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపారు. దీంతో తమకు ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ ముస్లింలలో పుట్టుకొచ్చింది.

హిందూ మెజార్టీ దేశంలో మాకు ప్రాధాన్యత ఉంటుందా: జిన్నా

హిందూ మెజార్టీ దేశంలో మాకు ప్రాధాన్యత ఉంటుందా: జిన్నా

హిందూ మెజార్టీ దేశంలో తమ బతుకులు బాగుపడవనే నిర్ణయానికి వచ్చేశారు ముస్లింలు. ఎక్కడ చూసినా వారిని వేరుగా చూడటంతో తట్టుకోలేకపోయారు. తము ఉండేందుకు ఓ సొంతదేశం కావాలని భావించారు. కానీ అది సాధ్యమవుతుందా అనే ప్రశ్న ప్రతి ముస్లింను వెంటాడింది. తమ బతుకులు బానిస బతుకులే అని డిసైడ్‌ అయిన సందర్భంలో ఓ వ్యక్తి వారి పాలిట దేవుడిలా నిలిచాడు. ప్రత్యేక దేశం ఆవిర్భవించడంలో కీలక పాత్ర పోషించారు. ముస్లింలకు జాతిపితగా నిలిచారు... ఇంతకు ఎవరా వ్యక్తి..? ఆయన చేసిన పోరాటం ఏమిటి...?

బ్రిటీషు వారు స్వాతంత్ర్యం ప్రకటిస్తే ముస్లింల సంగతి ఏమిటి...? అప్పటికే మెజార్టీ హిందువులు దేశంలో ఉన్నారు. మైనార్టీలుగా ముస్లింలున్నారు. మైనార్టీలు ఎప్పుడూ మైనార్టీగానే ఉంటారనే భావన ముస్లింలలో నెలకొంది. తమకు ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్‌ మరింత బలపడింది. దీంతో పండిట్‌ నెహ్రూ దేశవిభజనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పర్యటన చేశారు. దేశవిభజనతో జరిగే నష్టాన్ని ప్రజలకు వివరిస్తూ వచ్చారు. దేశ విభజనకు డిమాండ్ పెరిగిపోతుండటంతో సిమ్లాలో లార్డ్‌ వేవెల్‌ ఆధ్వర్యంలో కేబినెట్‌ మిషన్‌ సమావేశమైంది. కాంగ్రెస్‌-లీగ్‌ల మధ్య సయోధ్య కుదిర్చేందుకు సమావేశమైంది. ఇది చాలా ముఖ్యమైన సమావేశం. ఎందుకంటే ఈ సమావేశంలోనే భారత్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని కేబినెట్‌ మిషన్‌ భావించింది.

అయితే మైనార్టీలుగా ఉన్న ముస్లింలపై తమ ఆధిపత్యాన్ని చాటుతున్నారని పండిట్‌ నెహ్రూ పై కేబినెట్‌ మిషన్‌కు ఫిర్యాదు చేశారు ముస్లిం లీగ్‌ నేత మహ్మద్‌ అలీ జిన్నా. అంతేకాదు తమకు ప్రత్యేక దేశం కావాల్సిందేనంటూ పట్టుబట్టారు. అయితే దీన్ని బలంగా వ్యతిరేకించారు నెహ్రూ. ఎవరూ తగ్గకపోవడంతో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఆ సమావేశం ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది.

ప్రత్యక్ష తిరుగుబాటుకు పిలుపునిచ్చిన జిన్నా

ప్రత్యక్ష తిరుగుబాటుకు పిలుపునిచ్చిన జిన్నా

చర్చలు విఫలమవడంతో ముస్లిం లీగ్‌ నేత మహ్మద్‌ అలీ జిన్నా ప్రత్యక్ష తిరుగుబాటుకు పిలుపునిచ్చారు. ముస్లిం లీగ్‌కు పట్టు ఉన్న కలకత్తానగరంలో ఓ భారీ సభను జిన్నా ఏర్పాటు చేశారు. ఈ సభకు దేశనలుమూలల నుంచి ముస్లింలు హాజరయ్యారు. ఆగష్టు 16 1946న జరిగిన ఈ సమావేశంలోనే ప్రత్యేక పాకిస్తాన్‌ డిమాండ్ తెరపైకొచ్చింది. సభ ముగిసిన అనంతరం కొందరు అతివాదులైన ముస్లింలు కలకత్తా నగరంలో గ్రూపులుగా విడిపోయి అల్లాహో అక్బర్‌ నినాదాలతో హిందువులపై భౌతికంగా దాడులకు దిగారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి చేయిదాటిపోయింది. ఎటు చూసినా హింసే కనిపించింది. వీధుల్లో కనిపించిన ప్రతి హిందువుపై దాడి జరిగింది. వీధుల్లో ఏమి జరుగుతుందో చూద్దామని బయటికొచ్చిన వారి తలలను పగలగొట్టారు. చాలామంది రాడికల్‌ ముస్లింలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వీధుల వెంటా అలజడి సృష్టించారు. భయానక వాతావరణం అక్కడి ప్రజలు అనుభవించారు.

హిందువులను బతకనిచ్చేది లేదు... అంటూ పెద్ద నినాదాలు చేసుకుంటూ కొందరు దుండగులు ఐరన్‌ రాడ్లతో వీధుల్లోకి బయలుదేరారు. ఒక పెద్దాయన చేతులు జోడించి తమను వదిలేయాల్సిందిగా వేడుకున్నాడని... అయితే ఎలాంటి జాలి దయ లేకుండా ఆ పెద్ద మనిషిని తన కళ్ల ముందే ఐరన్‌ రాడ్లతో తలపగలగొట్టి చంపేశారని ఒక పత్రిక కోసం ఈ ఘటనను కవరేజ్‌ చేస్తున్న శంకర్‌ ఘోష్‌ అనే జర్నలిస్ట్‌ తెలిపారు..

తమాషా చూసిన బ్రిటీష్ ప్రభుత్వం

తమాషా చూసిన బ్రిటీష్ ప్రభుత్వం

మూడురోజులపాటు జరిగిన ఈ మతఘర్షణల్లో 5వేల మంది అమాయక ప్రజలు అసువులు బాశారు. వీధులంతా మృతదేహాలే దర్శనమిచ్చాయి. అప్పటి వరకు బ్రిటీష్‌ పాలనపై భారతీయులకు ఎంతోకొంత నమ్మకం ఉండేది. కానీ ఇంత జరుగుతున్న ఒక్క మాట కూడా బ్రిటీష్‌ ప్రభుత్వం నోట నుంచి పెగలలేదు. కనీసం ఆ అల్లర్లను నియంత్రణలోకి తీసుకొద్దామన్న ఆలోచన కూడా చేయలేదు. ఎవరు ఎవరినైనా చంపేసుకోండి మాకెందుకులే అన్నట్లుగా బ్రిటీష్‌ వారు ఆ మూడు రోజులు వ్యవహరించారు....


రోజులు గడిచేకొద్దీ హిందువులు ముస్లీంల మధ్య విఘాతం పెరుగుతూ వచ్చింది. దీన్ని ఒక తమాషాగా చూసింది బ్రిటీష్‌ ప్రభుత్వం. ఇది మరింత ఎక్కువవుతుండటంతో దేశ విభజన ప్రత్యేక పాకిస్తాన్‌ డిమాండ్ కూడా ఊపందుకుంది. అప్పటి వరకు ఒక్క కలకత్తా నగరానికే పరిమితమైన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా పాకాయి. దీంతో విభజన డిమాండ్ కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చిందని ఆనాటి ఆలిండియా రేడియోకు రిపోర్టర్‌గా పనిచేసిన ప్రాణ్‌ చోప్రా తెలిపారు....

కలకత్తా తర్వాత హింస బీహార్‌కు పాకింది. ఇందులో చాలామంది ముస్లింలను హిందువులు హతమార్చారు. మతకల్లోలంలో కొట్టుకుపోతున్న భారతదేశాన్ని మళ్లీ శాంతివైపు నడిపించగలిగే ఒకే ఒక వ్యక్తి మహాత్మాగాంధీ అని బ్రిటీష్‌ పాలకులు భావించారు. అల్లర్ల తర్వాత మహాత్మాగాంధీ స్పందించారు. అందరం కలిసే సోదరభావనతో ఉండాలని పిలుపునిచ్చారు. మతాలకంటే ముందు మనది మానవజాతి. మనుషుల్లా బతుకుదాం అని చెప్పారు. ఇందుకోసం పలు ప్రాంతాల్లో గాంధీ పర్యటించారు. ఒకరోజు హిందువుల ఇంట్లో విశ్రాంతి తీసుకుంటే మరోరోజు ముస్లిం ఇళ్లలో విడిది చేశారు గాంధీ. కానీ గాంధీ మాట కూడా అప్పటి పరిస్థితులు పెడచెవిన పెట్టేలా చేశాయి. గాంధీ మాటలు వినేందుకు ఎవరూ సిద్ధంగా లేరు.

లార్డ్ మౌంట్ బ్యాటెన్ ఎలా హ్యాండిల్ చేశారు

లార్డ్ మౌంట్ బ్యాటెన్ ఎలా హ్యాండిల్ చేశారు

ఓ వైపు దేశంలో హింస పెరిగిపోతోంది. మరోవైపు గాంధీ శాంతిని విస్తరించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో బ్రిటీషు వారికి ఏమి చేయాలో పాలుపోలేదు. సరిగ్గా ఇదే సమయంలో బ్రిటీష్‌ పాలకులు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు... వారు తీసుకున్న నిర్ణయం ఏమిటి....? ఆ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపింది....

ఫ్రిబ్రవరి 1947... బ్రిటీషు పాలకులు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే ఏడాది జూన్‌ కల్లా భారత్‌కు స్వతంత్రం ప్రకటించాలని డిసైడ్‌ అయ్యారు. కానీ దేశంలో మతఘర్షణలు పెరిగిపోతున్నాయి. ముందుగా మతఘర్షణలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేయాలని భావించారు. ఇందుకోసం కొత్త వైశ్రాయ్‌ను భారత్‌కు పంపించారు. ఆయనే లార్డ్ మౌంట్‌బ్యాటెన్. మార్చి 1947లో లార్డ్ మౌంట్‌ బ్యాటెన్‌ భారత్‌కు చేరుకున్నారు. ఆగ్నేయ ఆసియా కమాండర్‌గా మౌంట్‌బ్యాటెన్‌కు మంచి పేరుంది. నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట అని చెబుతుండేవారు. ఇక ఆయన ముందు ఒకే ఒక లక్ష్యం ఉన్నింది. పేట్రేగిపోతున్న మతఘర్షణల నుంచి దేశాన్ని కాపాడి ఆ తర్వాత స్వతంత్రదేశంగా భారత్‌ను ప్రకటించడం.

లార్డ్‌ మౌంట్‌బ్యాటెన్‌ నివాసం ఉండేందుకు ప్రస్తుత రాష్ట్రపతి భవన్‌ కేటాయించారు. ఇందులో 5వేల మంది సిబ్బందిని నియమించారు. అందరి వైశ్రాయ్‌లా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు మౌంట్ బ్యాటెన్‌. అందుకే భారతీయులు లార్డ్ మౌంట్‌ బ్యాటెన్‌ను ఎంతో గౌరవించారు. అక్కున చేర్చుకున్నారు.

మౌంట్‌ బ్యాటెన్‌ ముందుగా నేతలను కలిశారు. గాంధీ, నెహ్రూ, ముస్లిం లీగ్ నేత మహ్మద్‌ అలీ జిన్నాలతో సమావేశమై సమస్యను ఓకొలిక్కి తీసుకొద్దామని చేసిన ప్రయత్నం వర్కవుట్‌ కాలేదు. ఇలా చర్చలు విఫలమవడం, రాజకీయ పరమైన ఒత్తిళ్లు రావడం, హింస చెలరేగిపోతుండటంతో ఇక తప్పని పరిస్థితుల్లో దేశ విభజన చేయాల్సి వచ్చింది. దేశ విభజన నిర్ణయంతో అన్ని రాష్ట్రాలకంటే ఎక్కువ ప్రభావం పంజాబ్‌ రాష్ట్రంపై చూపింది. అప్పటి వరకు పంజాబ్ ఉమ్మడి దేశంలో అత్యంత ధనిక రాజ్యంగా వెలుగొందింది. హిందువులు, ముస్లింలు, సిక్కు మతస్తులు కలిసి మెలసి ఉండేవారు. ఆ రాష్ట్రం తమదే అన్నట్లుగా ఉన్నవాళ్లలో ఒక్కసారిగా విభజన నిర్ణయం భారీ ప్రభావం చూపింది. అదే సమయంలో పంజాబ్ రాష్ట్రంలో ముస్లింలు ఎక్కువగా ఉండటంతో ఆ రాష్ట్రం పాకిస్తాన్‌లో కలిసిపోతుందేమోనన్న భయం పంజాబీల్లో నెలకొంది. అది ఎంతమాత్రం వారికిష్టం లేదు. ఒకవేళ అదే జరిగితే తామంతా ముస్లిం పాలకులకు ఊడిగం చేయాల్సి వస్తుందని భయపడ్డారు. దీంతో పంజాబ్‌లో కూడా మతఘర్షణలు పెరిగాయి...

పంజాబ్‌లో సిక్కులకు ముస్లింల మధ్య మతఘర్షణలు

పంజాబ్‌లో సిక్కులకు ముస్లింల మధ్య మతఘర్షణలు

ఇక దేశ విభజన జరిగితే సిక్కు మతానికి నామరూపాలు లేకుండా పోతుందని భావించిన కొందరు... సమావేశాలు ఏర్పాటు చేసి సిక్కు మతం ప్రమాదంలో పడిపోతుందనే ప్రసంగాలతో రెచ్చగొట్టారు. దీంతో పంజాబ్ రాజధాని లాహోర్‌లో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. యూనివర్శిటీలో చదివే సిక్కు విద్యార్థులు స్కూలు బిల్డింగ్‌లపై కాంగ్రెస్‌ జెండాను ఎగురవేశారు. దీంతో ముస్లిం విద్యార్థులు కూడా ముస్లిం లీగ్‌ జెండాలను ఎగురవేయడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు పంజాబ్‌ను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడా చూసినా పోలీసు కవాతులతో లాహోర్‌ నగరం దద్దరిల్లింది. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకించిన సిక్కు మతస్తులు కూడా సైనికులుగా తయారయ్యారు. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్‌ రాజ్యానికి సహకరించారు. ఆ యుద్ధంలో వాడిన ఆయుధాలు వారిదగ్గర అలానే ఉండటంతో వాటికి మళ్లీ పదును పెట్టారు. ఎటు చూసినా సిక్కు యువకులు ఆయుధాలతో నడిరోడ్లపై కనిపించేవారు. ఆయుధాలు ఎలా వాడాలో తెలియని వారికి శిక్షణ ఇచ్చారు.

సిక్కులు యుద్దానికి తయారవుతున్నారని తెలుసుకున్న ముస్లింలు... ముందుగా జాగ్రత్తపడి రావల్పిండిలోని సిక్కు గ్రామాలపై తొలిదాడి చేశారు. అల్లాహో అక్బర్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సిక్కులను ఊచకోత కోసేందుకు సిద్ధమయ్యారు. సిక్కుల భయమంతా ఒక్కటే. సిక్కు యువతులను కొట్టి ఎత్తుకెళ్లి వారిపై ఎక్కడ అత్యాచారం చేస్తారనే భయం సిక్కులను వెంటాడింది. ఎందుకంటే అంతకుముందే ఓ యువతిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో గ్రామాల్లోని మహిళలంతా భయంతో ఓ చోటు తలదాచుకున్నారు. యువతులు ముస్లిం చేతుల్లో అత్యాచారానికి గురికాకూడదని చెప్పి సొంత తండ్రే సొంత కూతురును నరికి చంపిన ఘటనలు వెలుగు చూశాయి. ఇక పెరిగిపోతున్న అసహనం, అశాంతితో దేశ విభజన అంశం ప్రాముఖ్యత సంతరించుకుంది.

దేశ విభజనే అన్ని సమస్యలకు సమాధానం అన్న నెహ్రూ

దేశ విభజనే అన్ని సమస్యలకు సమాధానం అన్న నెహ్రూ

దేశంలో హింసాత్మక ఘటనలు, మతఘర్షణలు పెరిగిపోతున్నాయ్. ఇక అప్పటికే సమయం మించిపోయిందని భావించిన కాంగ్రెస్‌ నేతలు వెంటనే సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌లో నెహ్రూ మాటంటే అందరికీ వేదం. దీంతో నెహ్రూ నేతృత్వంలో కాంగ్రెస్‌ అగ్రనేతలంతా సమావేశమయ్యారు. ఇక్కడే కథ మరో మలుపు తీసుకుంది. దేశంలో మతసామరస్యం శాంతి నెలకొనాలంటే ముందుగా బ్రిటీష్‌ పాలనకు స్వస్తి పలకాలని నెహ్రూ భావించారు. అప్పటి వరకు దేశవిభజనకు పూర్తి వ్యతిరేకంగా ఉన్న నెహ్రూ... ఒక్కసారిగా తన నిర్ణయం మార్చుకోవడంపై అందరినీ విస్మయానికి గురిచేసింది. దేశ విభజనే అన్ని సమస్యలకు పరిష్కారం అని సమావేశంలో నెహ్రూ చెప్పారు. నెహ్రూ నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు. అదే విషయాన్ని లార్డ్ మౌంట్ బ్యాటెన్‌కు లిఖిత పూర్వకంగా తెలిపారు నెహ్రూ.

నెహ్రూ నుంచి లిఖిత పూర్వకంగా తన నిర్ణయాన్ని అందుకున్న లార్డ్ మౌంట్‌ బ్యాటెన్‌ విషయాన్ని పై అధికారులకు చేరవేస్తానని తెలిపారు. ఆ తర్వాత రాజ్యాధికారాలు బ్రిటీష్‌ చేతుల నుంచి భారత ప్రభుత్వానికి కట్టబెడుతూ ప్రకటన చేస్తామని వివరించారు. మౌంట్ బ్యాటన్‌ చెప్పినట్లుగానే... జూన్‌ 3 రాత్రి లార్డ్ మౌంట్ బ్యాటెన్‌, నెహ్రూ, జిన్నాలు ఆలిండియా రేడియోలో ప్రకటన చేశారు. దేశ విభజన జరుగుతోందని రేడియో వార్తల ద్వారా ప్రకటించారు. భారత దేశంలో శాంతి నెలకొనాలంటే దేశవిభజన తప్పనిసరి అంటూ ఇకపై భారత్‌ రెండు దేశాలుగా విభజించబడుతుందని జిన్నా ప్రకటన చేశారు.

ఆగష్టు 15న భారత్‌కు స్వాతంత్ర్యం ప్రకటిస్తామన్న మౌంట్‌బ్యాటెన్

ఆగష్టు 15న భారత్‌కు స్వాతంత్ర్యం ప్రకటిస్తామన్న మౌంట్‌బ్యాటెన్

దేశవిభజన అనివార్యం అవడంతో ముస్లింలు మెజార్టీగా ఉన్న ప్రాంతాలను పాకిస్తాన్‌గా... హిందువులు మెజార్టీగా ఉన్న ప్రాంతాలను భారత్‌లో కలిపారు. అంతేకాదు... ఎవరి ఇష్టం మేరకు వారు భారత్‌లో కానీ, పాకిస్తాన్‌లో కానీ ఉండేందుకు అనుమతి ఇచ్చారు. అయితే అత్యధికంగా ముస్లింలు కలిగిఉన్న పంజాబ్, బెంగాల్‌లు మాత్రం భారత్‌లోనే ఉంటాయని వాటిని వేరుగా చూడాలని మౌంట్‌ బ్యాటెన్‌, నెహ్రూలు నిర్ణయించారు.పంజాబ్‌ను బెంగాల్‌ను రెండుగా విడగొట్టి కొంత భాగం పాకిస్తాన్‌ మరికొంత భాగం భారత్‌ల మధ్య పంచాలని నిర్ణయించారు. దీనిపై జిన్నా కూడా అంగీకరించాల్సి వచ్చింది. ఇది జరిగిన మరుసటి రోజే... లార్డ్‌ మౌంట్‌ బ్యాటెన్‌ మరో ప్రకటన చేసి అందరికీ సంతోషకరమైన వార్త చెప్పారు. బ్రిటీషు ప్రభుత్వం భారతదేశానికి ఆగష్టు 15న స్వాతంత్ర్యం ప్రకటించేందుకు సిద్ధమైందని చెప్పారు. అంతా ఒక కొలిక్కి వచ్చినందున...ఇక ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నట్లు బ్యాటెన్‌ తెలిపారు. ఆలస్యం చేస్తే పరిస్థితి ఇంకా విషమించే అవకాశం ఉందని భావించిన మౌంట్‌ బ్యాటెన్‌ శాంతిభద్రతలు అదుపు తప్పితే అందుకు తను బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. ఇందుకోసమే వీలైనంత త్వరగా భారత్‌ను విడిచి వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చినట్లు లార్డ్ మౌంట్ బ్యాటెన్‌ చెప్పారు.


అంతా బాగానే ఉంది. అయితే రెండుగా విడిపోతున్న దేశాలకు సరిహద్దు ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమైంది. సమయం తక్కువగా ఉండటంతో వెంటనే దేశ సరిహద్దులు కూడా నిర్ణయించాలని భావించారు. బ్రిటీష్‌ వారు ఈ పనిని బ్రిటీష్‌ బారిష్టర్‌ అయిన సిరిల్ రాడ్‌క్లిఫ్‌కు అప్పగించారు. జూలై 8..1947లో రాడ్‌క్లిఫ్ భారత్‌ చేరుకున్నారు. విభజనకు 36 రోజుల మాత్రమే మిగిలి ఉండటంతో వెంటనే పనిని ప్రారంభించారు రాడ్‌ క్లిఫ్‌. మతపరమైన అంశాలు, భౌగోళిక పరమైన అంశాలు, రైల్వే లైన్ల అంశాలు, వ్యవసాయానికి కావాల్సిన నీటి వనరులు లాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. అయితే లాహోర్‌ నగరం ఏ దేశంలోకి వస్తుందో అన్న టెన్షన్‌ వాతావరణం ప్రజల్లో ప్రారంభమైంది. లాహోర్‌ ప్రాంతంలో ఉండే మెజార్టీ ఆస్తులు హిందువులకు చెందినవి కనుక ఈ ప్రాచీన నగరం భారతదేశానికే చెందుతుందన్న వార్త షికారు చేసింది.

ఇక దేశవిభజనకు నెల రోజుల మాత్రమే సమయం ఉండగా... పరిస్థితులు చేయిదాటి పోయాయి. ఏదైనా చేయాలంటే ఈ నెల రోజుల సమయంలోనే చేయాలని ఇరు మతాల ప్రజలు భావించారు. దీంతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. తమ మతంవారని కాదని తెలిస్తే చాలు పొరిగింటి వారిని కూడా వదలకుండా దాడులకు దిగారు. చంపుకున్నారు. ఎక్కడ చూసినా మృతదేహాలు దర్శనమిచ్చాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేసినా ఎక్కడోచోట ఈ ఘర్షణలు జరుగుతూనే కనిపించాయి.

లార్డ్ మౌంట్ బ్యాటెన్ నెహ్రూల మధ్య రహస్య ఒప్పందం ఏమిటి..?

లార్డ్ మౌంట్ బ్యాటెన్ నెహ్రూల మధ్య రహస్య ఒప్పందం ఏమిటి..?

భారత్‌ పాక్‌ల మధ్య సరిహద్దులను డిసైడ్‌ చేశారు... అంతా బాగుందనుకున్న సమయంలో లార్ఢ్ మౌంట్ బ్యాటన్‌కు మరో తలనొప్పి వచ్చి చేరింది. ఇంతకీ ఆ తలనొప్పి ఏమిటి...? దానికి పరిష్కారం ఎలా కనుగొన్నారు....? నెహ్రూతో లార్డ్ మౌంట్ బ్యాటెన్‌ చేసుకున్న రహస్య ఒప్పందం ఏమిటి..?

అంతా బాగుంది... విభజనకు మూడువారాల మాత్రమే సమయం మిగిలుంది. ఈ సమయంలో లార్డ్‌ మౌంట్‌ బ్యాటెన్‌కు సరికొత్త తలనొప్పి భారత్‌లో ఉన్న రాచరిక రాజ్యల రూపంలో వచ్చింది. భారత్‌లో ప్రిన్స్‌లీ స్టేట్స్‌ చాలా ఉండేవి. వాటిని ఎలా పంచుతారు. అప్పటివరకు ప్రిన్స్‌లీ స్టేట్స్‌ పరిపాలనా వ్యవహారాలన్నీ బ్రిటీష్‌ పాలనతో సంబంధం లేకుండా కొనసాగాయి. కానీ దేశవిభజనతో వాటి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అయితే బ్రిటీషు వారు భారత్‌ను వీడిన తర్వాత ఆ రాజ్యాధికారుల నిర్ణయం మేరకు ఎటు వెళ్లాలంటే అటు వెళ్లొచ్చని లార్డ్ మౌంట్ బ్యాటన్‌ చెప్పారు. బయటికి మౌంట్‌ బ్యాటెన్ ఇలా చెప్పినప్పటికీ... నెహ్రూతో మాత్రం రహస్యంగా ఒప్పందం చేసుకున్నారు. ప్రిన్స్‌లీ స్టేట్స్‌ మొత్తం భారత్‌కే చెందాలనేదే ఆ రహస్య ఒప్పందం ముఖ్యఉద్దేశం.

జూలై 25న ఢిల్లీలో రాచరిక రాష్ట్రాల అధిపతులతో లార్డ్ మౌంట్ బ్యాటన్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మౌంట్‌బ్యాటెన్‌ ఒక్కటే చెప్పారు. రెండు అవకాశాలు మాత్రమే మీ ముందున్నాయి. ఒకటి భారతదేశంలో విలీనం అవడమా లేక బలవంతంగా బ్రిటీష్‌ పాలకులు రాచరిక రాష్ట్రాలను భారత్‌లో విలీనం చేయడమా అంటూ మౌంట్ బ్యాటన్‌ బెదిరించారు. అప్పటి వరకు తమ రాజ్యాలను తమే పరిపాలించుకోవచ్చన్న భావనలో ఉన్న రాజులకు ఈ నిర్ణయం పెద్ద షాక్‌ నిచ్చింది. దీంతో చిన్న రాజ్యాల రాజులు భారత్‌లో తమ రాజ్యాన్ని విలీనం చేసేందుకు ఒప్పుకున్నారు.

సరిహద్దులపై రాడ్‌క్లిఫ్ ఇచ్చిన నివేదిక

సరిహద్దులపై రాడ్‌క్లిఫ్ ఇచ్చిన నివేదిక

ఇక దేశ సరిహద్దులపై లీకులు బయటకు వచ్చాయి. లాహోర్‌ నగరం పాకిస్తాన్‌కు చెందుతుందన్న వార్త జోరుగా షికారు చేసింది. దీంతో హిందువులలో అసహనం నెలకొంది. ఇక సమయం మించిపోతోంది. దీంతో ముస్లింలు లాహోర్‌ నగరంలోని హిందూ ప్రాంతాలను తగులబెట్టారు. రాత్రి రాత్రికే మతవిద్వేశాలకు చారిత్రాత్మక నగరం లాహోర్‌ నేలమట్టమైంది. ఇక రాడ్‌క్లిఫ్‌ సరిహద్దులను డిసైడ్‌ చేసి నివేదిక రూపొందించారు. అందులో లాహోర్‌ను పాకిస్తాన్‌లో చేర్చాల్సిందిగా ఆయన సూచించారు.

ఇక ఆగష్టు 14న ముస్లింల కోసం కొత్త దేశం పాకిస్తాన్‌ ఆవిర్భవించింది. ముస్లింలు కన్న కల సాకారం అయ్యింది. కొత్తగా పాకిస్తాన్‌ ఆవిర్భావం జరుగుతోందని ప్రకటన చేసేందుకు లార్డ్ మౌంట్ బ్యాటన్‌ పాకిస్తాన్‌కు చేరుకున్నారు. కొత్త దేశానికి తొలి గవర్నర్‌ జనరల్‌గా మహ్మద్‌ అలీ జిన్నాను ప్రకటించారు.

దేశ విభజన గాంధీకి రుచించలేదు

దేశ విభజన గాంధీకి రుచించలేదు

ఆగష్టు 15 ఇక భారత్‌ వంతు. లక్షలాది మంది ప్రజలు పార్లమెంట్‌ వద్దకు చేరుకున్నారు. వారి మధ్య నుంచి లార్డ్‌ మౌంట్‌ బ్యాటెన్‌ నెహ్రూలు తమ వాహనాల్లో పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు. లార్డ్ మౌంట్‌ బ్యాటన్‌ భారత దేశాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించారు. బ్రిటీష్‌ జెండా కిందకు దిగి...భారత త్రివర్ణ పతకం రెపరెపలాడింది. అప్పటి వరకు దేశం ఒక్కటిగా ఉండాలంటూ గాంధీ చేపట్టిన నిరాహార దీక్ష ఏమాత్రం ఫలితమివ్వలేదు. గాంధీకి దేశవిభజన రుచించలేదు. అంతవరకు ఆయనకు దగ్గరగా ఉన్న వ్యక్తులంతా దేశవిభజన అంశంతో ఒక్కొక్కరుగా దూరమవుతూ వచ్చారు.

చాలా మనోవేదనకు గురైన గాంధీ... తనకు చనిపోవాలని ఉందంటూ సన్నిహితుల దగ్గర చెబుతుండేవాడట. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడంతో లార్డ్ మౌంట్ బ్యాటన్‌ కొత్త సరిహద్దులను ప్రకటించారు. బెంగాల్‌ పంజాబ్ రాష్ట్రాలు భారత్‌కు కేటాయించారు. లాహోర్‌ పాక్‌కు తరలివెళ్లింది.పాకిస్తాన్‌లో ఉన్న హిందువులు భారత్‌కు చేరుకున్నారు. భారత్‌లో ఉన్న ముస్లింలు పాకిస్తాన్‌కు తరలి వెళ్లారు. వీరికి పోలీస్‌ ఎస్కార్ట్ కూడా ఇచ్చారు.

ఒకప్పుడు నెహ్రూను ప్రేమించిన ప్రజలు ఎందుకు ద్వేషించారు..?

ఒకప్పుడు నెహ్రూను ప్రేమించిన ప్రజలు ఎందుకు ద్వేషించారు..?

భారత్‌ పాకిస్తాన్ ల నుంచి ఇరుదేశాల శరణార్థులు తరలి వెళుతున్నారు. దారి మధ్యలో వారికి తాగేందుకు మంచినీళ్లు లేవు. దొరికిన కలుషితమైన నీరునే తాగి అంతుచిక్కని రోగాలు కొని తెచ్చుకున్నారు. కొందరికి తినేందుకు తిండిలేక ఆకలితో అలమటించారు. ఇలా చిన్నపిల్లలు కూడా ఆకలితో అలమటించి ప్రాణాలు వదిలారు. కొంత మంది కాలినడకన పాక్‌ చేరుకుంటే చాలా మంది పాకిస్తాన్‌ కురైలు ఎక్కారు. అంబాలా నుంచి పాకిస్తాన్‌కు రైలు బయలుదేరింది. ఇక్కడ కూడా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రైల్లో ప్రయాణిస్తున్న వారిని కూడా ఒకవర్గం హతమార్చింది. చాలామంది అనాథలుగా మిగిలారు. ఇంకొంత మంది శరణార్థులు సరిహద్దుల్లోనే చిక్కుకుపోయారు.

దేశ తొలి ప్రధాని హోదాలో పండిట్‌ జవహర్‌లాల్ నెహ్రూ ఆ ప్రాంతాలను పర్యటించారు. అయితే ఆ శరణార్థులకు నెహ్రూను చంపేయాలన్నంత కోపం వచ్చింది. ఒకప్పుడు నెహ్రూను ఎంతలా ప్రేమించారో తన సొంత లాభం కోసం దేశాన్ని విడగొట్టాలన్న నిర్ణయం నెహ్రూ తీసుకున్నారని భావించి ఆయనపై రగిలిపోయారు. ఇక లాహోర్‌లో అక్కడక్కడ ఉన్న హిందూ కుటుంబాలను ముస్లిం వర్గానికి చెందిని వారు హతమార్చారు.

ప్రపంచంలో మతపరంగా విభజన జరిగిన దేశాల్లో ఒక్క భారత్‌ మాత్రమే నిలిచింది. అప్పటి వరకు మతసామరస్యంతో విరాజిల్లిన భారత దేశం... విభజన చిచ్చు రెండు దేశాలకు మార్గం సుగమం చేసింది. చాలామంది ప్రాణాలు తీసింది. మరెందరినో అనాథలుగా చేసింది. రెండు నెలల సమయంలోనే ఒక దేశాన్ని రెండుగా విభజించేందుకు లార్డ్ మౌంట్ బ్యాటన్‌ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక తప్పిదమని పలువురు చరిత్రకారులు చెబుతున్నారు.

జమ్మూకశ్మీర్‌పై సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో... స్వతంత్రం సిద్దించి 70 ఏళ్లు కావొస్తున్నప్పటికీ ఆ అంశం ఇప్పటికీ అపరిష్కృతంగానే మిగిలిపోయింది. ఇందుకు కారణం ఆనాడు నెహ్రూ సరైన నిర్ణయం తీసుకోకపోవడమేనని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ రోజుకీ రావణకాష్టంలా కశ్మీర్‌ రగిలిపోతోందంటే కారణం నెహ్రూనే అని చెబుతున్నారు.

English summary
India was declared independence on 15th of August 1947. But we need to know what was the struggle that was invovled and what made the British Raj to declare independence. How was the people's reaction when the country was bifurcated into India and Pakistan. Why did people hate Nehru all of a sudden.. and how many people sacrificed their lives for the sake of freedom.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X