• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఢిల్లీ పీఠంపై మళ్లీ అరవింద్ కేజ్రీవాల్ ఎలా?: ఐదు కీలక పాయింట్లు

|

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఇప్పటికే 62 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. బీజేపీ 8 స్థానాల్లోనే ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఇక కాంగ్రెస్ జాడ లేకుండా పోయింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ గట్టి పోటీనిస్తుందని అంతా అంచనా వేసినప్పటికీ.. ఫలితాల్లో మాత్రం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశపరిచింది. బీజేపీ నేతలు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేసినప్పటికీ అవేమీ ఓటర్లు పట్టించుకోలేదు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలనే ప్రాతిపదికగా తీసుకుని అరవింద్ కేజ్రీవాల్‌‌కు మరోసారి పట్టం కట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని 7 పార్లమెంటు స్థానాలనూ బీజేపీనే కట్టబెట్టినప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చీపురు పార్టీకే ప్రజలుఓటేశారు. ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ పార్టీ పట్టం కట్టడానికి గల కారణాలను పరిశీలించినట్లయితే..

మంచి పనులు, పాలన

మంచి పనులు, పాలన

తమ ప్రభుత్వం గత ఐదేళ్ళు ప్రజల కోసమే పనిచేసిందని భావిస్తే తమకు ఓటేయండని.. లేదంటే బీజేపీకి పట్టం కట్టండని అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల సమయంలో ఓటర్లకు పిలుపునిచ్చారు. ఉచిత విద్యుత్, ఉచిత నీరు, విద్యా సంస్కరణలు, మంచి ఆరోగ్య సేవలు, అవినీతి లేని పాలన లాంటి అంశాలతో కేజ్రీవాల్ పార్టీ ప్రజలను ఓటువేయమని అడిగింది. 2013, 2015 ఎన్నికల ప్రచారంలోనూ అంశాలనే ప్రధానంగా చూపింది.

గత ఐదేళ్లలో 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందించింది ఆప్ ప్రభుత్వం. 20వేల లీటర్ల నీరు వాడకం వరకు ఉచితంగా సరఫరా చేస్తోంది. ప్రైవేటు స్కూళ్లు ఫీజులను అత్యధికంగా పెంచకుండా కట్టడి చేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో గత ఐదేళ్లలో సేవలను మెరుగుపర్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే రోగులకు ఉచిత మందులను అందించారు. అంబులెన్స్ సేవలను కూడా అందుబాటులో ఉంచారు. ఇలాంటి కొన్ని మంచి పనులు కేజ్రీవాల్‌కు మరోసారి ప్రజలు పట్టం కట్టేలా చేశాయి.

మంచి నేతగా గుర్తింపు

మంచి నేతగా గుర్తింపు

ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసినప్పటికీ.. అరవింద్ కేజ్రీవాల్ ఎంతో హుందాగా వ్యవహరించారు. వారి విమర్శలు, ఆరోపణలను సానుకూలంగా మార్చుకోవడంలో సఫలమయ్యారు. దేశ ద్రోహులను కాల్చి పారేయాలంటూ.. కేజ్రీవాల్ ఉగ్రవాది అని.. ఉగ్రవాదులకు మద్దతిస్తున్నారని.. కేజ్రీవాల్ పార్టీని పాకిస్థాన్ పోలుస్తూ.. బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. అయితే, అరవింద్ కేజ్రీవాల్ మాత్రం తొందరపడకుండా వారిపై తిరిగి ఎలాంటి విమర్శలు చేయలేదు. మీకు మంచి చేయాలనే ఉద్దేశంతో మరోసారి మీ ముందుకు కొడుకు వచ్చారంటూ అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం నిర్వహించారు. తనను తాను శ్రావణకుమారుడితో పోల్చుకున్నారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలు మీరు నమ్మితే బీజేపీకే ఓటేయమంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ వ్యవహరించిన హుందాతనం ప్రజలకు బాగా నచ్చింది. దీంతో ఢిల్లీ ఓటర్లకు మరోసారి అరవింద్ కేజ్రీవాల్‌కే పట్టం కట్టారు.

హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసినా..

హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసినా..

బీజేపీ హిందుత్వాన్ని తమ ఎజెండాగా చెప్పుకుంటూనే ఉంటుంది. కాంగ్రెస్ కూడా లోక్‌సభ ఎన్నికల సమయంలో హిందుత్వాన్ని ప్రచారాస్త్రంగా వాడుకుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పలు ఆలయాల చుట్టూ తిరిగారు. ప్రధాని మోడీపై మితిమీరిన విమర్శలు, ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. దీన్నుంచి పాఠాలు నేర్చుకున్న అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ నేతలు నేరుగా ప్రధాని మోడీపై విమర్శలు చేయడం మానుకున్నారు. ఇతర మతాల పట్ల సానుకూలంగా ఉంటూనే.. తాను హనుమాన్ భక్తుడిని అని కేజ్రీవాల్ ప్రచారం చేసుకున్నారు. ఢిల్లీలోని ప్రముఖ హనుమాన్ ఆలయాలను ఆయన దర్శించుకున్నారు. బీజేపీ హిందూ వ్యతిరేకి అని విమర్శలు చేసినా.. ఆయన పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయారు. ఇది కూడా ప్రజలకు ఆకట్టుకునే అంశంగా మారింది.

మధ్యతరగతి ప్రజలకు దగ్గరగా..

మధ్యతరగతి ప్రజలకు దగ్గరగా..

లోక్‌సభ ఎన్నికల్లో మధ్యతరగతి ప్రజలంతా బీజేపీకే ఓట్లు వేశారు. ఈ నేపథ్యంలో వారిని ఆకర్షించేందుకు అరవింద్ కేజ్రీవాల్.. పలు ఉచిత పథకాలను ప్రకటించారు. నిజాయితీ పాలనకు ఓటేయాలని కోరారు. అయితే, కొన్ని చోట్ల కేజ్రీవాల్ ర్యాలీల్లో కేంద్రంలో మోడీ.. ఢిల్లీకి మాత్రం కేజ్రీవాల్ అనే నినాదాలను ప్రజలు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆస్పత్రి బిల్లులు బీజేపీ కట్టదని, విద్యుత్ బిల్లులు చెల్లించదని, ఉచిత విద్య అందించదని కేజ్రీవాల్ వ్యాఖ్యనించారు. అంతేగాక, స్థానిక నేతలు, కార్యకర్తల ద్వారా తమ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు. ఢిల్లీ ప్రజల కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందని కేజ్రీవాల్ పదే పదే వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రజలు కూడా ఆయన మాటలను విశ్వసించి భారీ మెజార్టీతో గెలిపించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మళ్లిన కాంగ్రెస్ ఓటు బ్యాంక్..

ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మళ్లిన కాంగ్రెస్ ఓటు బ్యాంక్..

2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు శాతం 9.7శాతం ఉండగా.. తాజాగా ఎన్నికల్లో 5 శాతానికి పడిపోయింది. అంటే.. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కూడా అరవింద్ కేజ్రీవాల్ పార్టీవైపు మళ్లిందనే విషయం తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే ముస్లిం ఓటర్లు కూడా ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా నిలించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితిలో లేదని, ఆ పార్టీకి ఓటు వేయడానికి బదులు తమ పార్టీకి ఓటు వేయాలని ఆప్ నేతలు కోరారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ కూడా ఆప్ వైపు మళ్లించడంలో ఆ పార్టీ నేతలు సఫలమయ్యారు. ఈ ఐదు కీలక కారణాలతో కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోనున్నారు.

English summary
Arvind Kejriwal is set to take oath as the Delhi chief minister for the third straight time. The Aam Aadmi Party (AAP) has retained power in Delhi on the back of an extremely bitter election campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X