• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్ సరిహద్దు ప్రాంతంలోని కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?

By BBC News తెలుగు
|

భారత సరిహద్దులు

"ఖాలిద్ చనిపోయాడా, మీరు చెప్పేది నిజమేనా" సైకాలజిస్ట్ మహేష్ తిల్వానీ కంగారుగా అడిగారు.

ఖాలిద్ అనే మానసిక రోగి గురించి తెలుసుకోడానికి బీబీసీ బృందం జనవరిలో ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రి దగ్గరకు వెళ్లింది.

గుజరాత్ కచ్ జిల్లాలోని భుజ్‌ పట్టణంలో ఒక నిర్బంధ కేంద్రం ఉంది. దానిని జాయింట్ ఇంటర్నేషనల్ సెంటర్(జేఐసీ) అంటారు.

ఆ కేంద్రంలో దాదాపు గత మూడు నెలల్లోనే పాకిస్తానీలుగా చెబుతున్న ఐదుగురు మానసిక రోగులు చనిపోయారు.

ఈ ఐదుగురిలో ఖాలిద్ చివరగా జనవరి 13న మృతి చెందారు.

భారత సరిహద్దు

జేఐసీలో ఖాలిద్‌తోపాటూ పాకిస్తానీలని ఆరోపిస్తున్న చాలా మందికి డాక్టర్ తిల్వానీ గత కొన్నేళ్లుగా చికిత్స అందిస్తున్నారు.

ఆయన ఖాలిద్ తనకు చాలా బాగా తెలుసని బీబీసీకి చెప్పారు.

"అది తెలీగానే నాకు షాకింగ్‌గా అనిపించింది. ఎందుకంటే, తనది అంత పెద్ద వయసేం కాదు. దాదాపు 40 ఏళ్లుంటాయి" అన్నారు.

భద్రతా దళాలు ఐదుగురినీ అదుపులోకి తీసుకున్నప్పుడు వాళ్లు మానసికంగా బలహీనంగా ఉన్నారని, భారత్-పాక్ సరిహద్దుకు చాలా సమీపంలో ఉన్నారని భారత ప్రభుత్వం చెప్పింది.

అరెస్టయ్యే ముందే వాళ్లకున్న వ్యాధుల వల్ల లేదంటే వేరే ఏవైనా సహజ కారణాల వల్ల వాళ్లు చనిపోయుండచ్చని అధికారులు చెబుతున్నారు.

బీబీసీ వారి వాదనలను స్వతంత్రంగా ధ్రువీకరించడం లేదు.

భారత్ సరిహద్దు

ఈ నిర్బంధ కేంద్రం కచ్ ఎస్పీ సౌరభ్ సింగ్ పరిధిలోకి వస్తుంది. "బీఎస్ఎఫ్ ఈ ఖైదీలను సరిహద్దుల్లో వివిధ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకుంది. వాళ్లంతా భారత సరిహద్దులకు చాలా దగ్గరగా ఉండడమో, లేదంటే సరిహద్దు దాటడానికో ప్రయత్నించి ఉండచ్చు. వీళ్లంతా గత పది, పన్నెండేళ్లుగా పట్టుబడినవారే" అని ఆయన చెప్పారు.

ఖాలిద్ చనిపోవడానికి ముందు 2021 జనవరి 11న 60 ఏళ్ల కరీమ్ మృతిచెందారు. ఆయన 2013 నుంచి జేఐసీలో కస్టడీలో ఉన్నారు.

32 ఏళ్ల జావేద్ యకీమ్ 2020 డిసెంబర్‌లో, 45 ఏళ్ల మునీర్ 2020 నవంబర్ 19న చనిపోయారు. మునీర్ 2014 నుంచి జేఐసీలో ఉన్నారు.

2016లో సరిహద్దుల్లో పట్టుబడిన 50 ఏళ్ల పర్వేజ్ కూడా గత ఏడాది నవంబర్ 4న మృతిచెందాడు. వీళ్లందరిలో మునీర్ ఒక్కడే కోవిడ్‌తో చనిపోయారని జేఐసీ అధికారులు చెప్పారు. కానీ, ఐదుగురూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడేవారని తెలిపారు.

జేఐసీ అధికారులు మృతుల కుటుంబ సభ్యులకు వారి గురించి సమాచారం ఇచ్చిందీ లేనిదీ తెలీకపోవడంతో బీబీసీ ఈ కథనంలో మృతుల పేర్లను మార్చి రాసింది.

డాక్టర్ తిల్వానీ

ఐదుగురిలో ముగ్గురి శవాలు ప్రస్తుతం జేఐసీకి 250 కిలోమీటర్ల దూరంలో జామ్‌నగర్‌లోని ఒక మార్చురీలో ఉన్నాయి.

పర్వేజ్ శవాన్ని మాత్రం పాకిస్తాన్ పంపించామని అధికారులు చెబుతున్నారు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం దానిని ఇప్పటివరకూ బీబీసీకి ధ్రువీకరించలేదు.

ఖాలిద్‌కు కూడా చికిత్స కొనసాగింది. కానీ, ఆయన ఏ మానసిక వ్యాధికి గురయ్యారో తెలీలేదు. చివరికి, జనవరి 13న భుజ్‌లోని ఒక ఆస్పత్రిలో ఆయన చనిపోయారు. ఖాలిద్‌ను 2009లో కచ్‌లో సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నారు.

ఖాలిద్‌ది పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని బదీన్ ప్రాంతం అని మీడియా రిపోర్టులను బట్టి తెలుస్తోంది. భారత్-పాక్ సరిహద్దులకు ఇది కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.

ఐదుగురి స్వస్థలాల గురించి వివరాలు ఇవ్వాలని బీబీసీ అధికారులను అడిగింది. కానీ, అది నిఘాకు సంబంధించిన సమాచారం అని వారు చెప్పలేదు.

"పాకిస్తాన్ ప్రభుత్వానికి మృతుల గురించి సమాచారం ఇచ్చాం. కానీ, భారత్‌లోని పాక్ రాయబార కార్యాలయం, ఇస్లామాబాద్‌లోని పాక్ విదేశాంగ కార్యాలయం నుంచి కూడా మాకెలాంటి సమాధానం రాలేదు" అన్నారు.

మృతుల చిరునామా, గుర్తింపు తెలియకపోతే, పాకిస్తాన్ కూడా శవాలు తీసుకోనప్పుడు అధికారులు వాటికి భారత్‌లోనే ఖననం చేస్తుంటారు.

ఉదాహరణకు, "2019లో ఇదే కేంద్రంలో పాకిస్తానీగా చెబుతున్న ఒక మానసిక రోగి చనిపోయాడు. పాకిస్తాన్ ఆయన పౌరసత్వం ధ్రువీకరించలేదు. శవం కూడా తీసుకోలేదు. దాంతో, దానిని భుజ్‌లోని ఒక శ్మశానంలో మత సంప్రదాయాల ప్రకారం ఖననం చేశారు" అని భారత హోంశాఖ చెప్పింది.

సరిహద్దు ప్రాంతం

భారత్‌లో నిర్బంధంలో ఉన్న పాకిస్తాన్ పౌరులకు సంబంధించిన ఒక జాబితాను 2019లో ఆ దేశానికి అందించింది. దానిలోని వివరాల ప్రకారం భారత్‌లో ప్రస్తుతం 249 మంది పాక్ పౌరులు అదుపులో ఉన్నారు. అటు, పాకిస్తాన్‌లోని నిర్బంధ కేంద్రాల్లో 537 మంది భారత పౌరులు ఉన్నారు.

భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలను సరిచేయడానికి పనిచేస్తున్న ఆగాజ్-ఎ-దోస్తీ సంస్థ ఆ జాబితాను ఇచ్చింది. దానిలోని వివరాలను బట్టి ఈ కేంద్రాల్లో ఉన్నవారిలో ఎక్కువ మంది మత్స్యకారులేనని తెలుస్తోంది. గుజరాత్, సింధ్‌లో రెండు దేశాల నావికాదళాలు వీరిని అదుపులోకి తీసుకున్నాయి.

అయితే, గుజరాత్, సింధ్ తీరాల్లో ఉన్న వివాదిత సర్‌క్రీక్ ప్రాంతంలో రెండు దేశాల నావికా దళాలు మత్స్యకారులను అరెస్ట్ చేయడం మామూలుగా ఎప్పుడూ జరిగేదే.

అయితే, ఈ నిర్బంధ కేంద్రంలో ఉంటూ చనిపోయిన ఈ ఐదుగురిని మాత్రం గుజరాత్, సింధ్ మధ్య సరిహద్దుల్లోంచి అదుపులోకి తీసుకున్నారు.

భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దులో ఒకప్పుడు స్మగ్లింగ్ జోరుగా సాగేదని గుజరాత్ బోర్డర్ రేంజ్ మాజీ ఐజీ ఏకే జడేజా చెప్పారు.

"బంగారం, వెండి, ఆహార పదార్థాలతోపాటూ, ఒకప్పుడు తమలపాకులు కూడా స్మగ్లింగ్ చేసేవారు. అప్పట్లో సరిహద్దుల్లో కంచె లేని స్తంభాలే ఉండేవి. కానీ, ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. కొన్ని కిలోమీటర్ల మినహా, భారత్-పాకిస్తాన్‌ సరిహద్దు అంతటా ముళ్ల కంచె ఏర్పాటు చేశాయి" అన్నారు.

అంతే కాదు, సరిహద్దుల్లో ఇప్పుడు నిఘా కూడా పెరిగింది. దీంతో, పొరపాటున ఎవరైనా సరిహద్దు దాటే ఘటనలు చాలావరకూ తగ్గిపోయాయి.

"నాకు తెలిసి, మానసికంగా బలహీనంగా ఉన్న వాళ్లు మాత్రమే ఎక్కువగా రెండు వైపులా సరిహద్దులకు దగ్గరగా వస్తుంటారు. లేదంటే, బోర్డర్ దాటుతూ పట్టుబడుతుంటారు. జేఐసీకి తీసుకొచ్చే మానసిక రోగులకు ఇక్కడి ప్రాంతాలు, భాష గురించి తెలిసుండదు" అని ఏకే జడేజా చెప్పారు.

భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా, ముఖ్యంగా భారత్ వైపున్న ప్రాంతం, రాకపోకలకు చాలా కఠినంగా ఉంటుంది. చాలా విశాలంగా ఉండే ఈ ప్రాంతంలో నీళ్లు కూడా దొరకవు, దాంతో పౌరులు చాలాసార్లు దారితప్పిపోతారు. దిక్కులు తెలీక ప్రమాదంలో పడిపోతారు. మానసికంగా బలహీనంగా ఉన్నవారికి అది మరింత ప్రమాదం.

పొరపాటున లేదా అక్రమంగా సరిహద్దు దాటుతూ పట్టుబడినవారు, లేదంటే తప్పుడు పత్రాలతో భారత్‌లోకి రావడానికి ప్రయత్నించిన వందమందికి పైగా జేఐసీలో అదుపులో ఉన్నారు. వీరిలో దాదాపు 20 మంది పాకిస్తానీలు ఉండచ్చని అధికారులు చెబుతున్నారు. వీరిలో 8 మంది మానసిక రోగులు కూడా ఉన్నారు.

జేఐసీలో ఇతర దేశాలకు చెందిన పౌరులు కూడా ఉంటున్నారు.

జేఐసీలో నిర్బంధంలో ఉన్న వారిని దాదాపు 22 ఏజెన్సీలు విచారిస్తుంటాయి. మృతులు ఐదుగురూ పాకిస్తానీ పౌరులని, వారి మానసిక స్థితి సరిగా లేదని వారి దర్యాప్తు వల్లే తమకు తెలిసిందని భారత అధికారులు చెబుతున్నారు.

భారత్-పాక్ సరిహద్దు

భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దులో ఎక్కువ ప్రాంతం బీఎస్ఎఫ్ నిఘాలో ఉంది. అందులోని నిఘా వింగ్ టెక్నాలజీ సాయంతో సరిహద్దులను దాటేవారిని గుర్తిస్తుంది.

కానీ, భారత సరిహద్దుల్లో ఉన్న ఒక వ్యక్తిని విదేశీయుడుగా తేల్చడం, అతడు ఏ దేశం పౌరుడనేది నిరూపించడం చాలా కష్టం. వాళ్ల దగ్గర గుర్తింపు కార్డులేవీ ఉండవు. అందుకే, వారెవరో గుర్తించడానికి నిఘా విభాగం రకరకాల పద్ధతులు ఉపయోగిస్తుంది. కానీ, వాటి ఫలితాలు పక్కాగా ఉంటాయని చెప్పలేం.

ఉదాహరణకు, భద్రతా అధికారులు సరిహద్దులో అదుపులోకి తీసుకున్న ఒక వ్యక్తి ఏ దేశస్థుడో గుర్తించడానికి, వారికి వివిధ దేశాల కరెన్సీ నోట్లు కూడా చూపిస్తారు.

ఇన్‌స్పెక్టర్ గులాబ్ సింగ్ జడేజా గత ఏడాది రిటైరవడానికి ముందు 15 ఏళ్లు జేఐసీ చీఫ్‌గా పనిచేశారు. అక్కడి మానసిక రోగులు, అదుపులో ఉన్న వారి గురించి వివరంగా చెప్పారు.

"మానసికంగా బలహీనంగా ఉన్నవారు ఎవరినీ గుర్తించలేరు. కానీ, కరెన్సీని గుర్తుపడతారు. అందకే, మేం అన్ని దేశాల కరెన్సీ నోట్లు వాళ్ల ముందు పెడతాం. ఇంకో పద్ధతి కూడా ఉంది. మేం వాళ్లకు వివిధ దేశాల జెండాలు కూడా వాళ్లకు చూపిస్తాం. కొన్నిసార్లు వాళ్లు వాటిని కూడా గుర్తుపడుతుంటారు" అన్నారు.

"పట్టుబడిన వ్యక్తి వచ్చిన దిశ, అతడు ఏ దేశం వాడు అనేది తెలుసుకోడానికి భద్రతా అధికారులకు సహకరిస్తుంది. సరిహద్దుల్లో పగ్ కుక్కలు ఉంటాయి. వాళ్ల జాడలు పసిగట్టి, అతడు ఏ ప్రాంతం నుంచి వచ్చాడో తెలుసుకోడానికి సాయం చేస్తాయి. వాళ్లు ఎవరు అనేది వాళ్ల భాషను బట్టి కూడా తెలిసిపోతుంది. అంతే కాదు, రకరకాల ఏజెన్సీలు వీరిని విచారిస్తాయి. అతడు గూఢచారా లేక మానసికంగా బలహీనంగా ఉన్నాడా అని తెలుసుకోడానికి, సైకాలజిస్టుల అభిప్రాయం కూడా తీసుకుంటాం. ఈ ఐదుగురినీ అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా భద్రతా ఏజెన్సీలు అలాగే చేశాయి" అన్నారు జడేజా

"దీనిని గుర్తించడానికి ఒక సులభమైన పద్ధతి ఉంది. గూఢచారి కావాలనే విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. అసలైన మానసిక రోగి ఎప్పుడూ అసాధారణంగానే ఉంటాడు. కానీ మానసిక రోగుల్లో వ్యక్తీకరణ మందకొడిగా ఉంటుంది. అది అలా నటించేవారి గుట్టును బయటపెడుతుంది" అంటారు డాక్టర్ తిల్వానీ.

భారత్‌లోని ఒక మాజీ పోలీస్ అధికారి ఒక పద్ధతిని కనుగొన్నారు. గుఢచారులను గుర్తించడానికి, మానసిక రోగుల వివరాలు తెలుసుకోడానికి అప్పుడప్పుడూ దానిని ఉపయోగిస్తున్నారు.

"ఇప్పుడు మెడికల్ సైన్స్ చాలా డెవలప్ అయ్యింది. అదుపులో ఉన్నవారికి ఒక టాబ్లెట్ ఇస్తారు. అది వేసుకున్న తర్వాత, వాళ్లు నిజంగా మానసిక రోగులైతే మామూలుగానే ఉంటారు. కానీ, అలా నటించేవారి పొట్టలో గందరగోళంగా ఉంటుంది. వాంతులు మొదలవుతాయి. వాళ్లు నాటకం ఆడుతున్నారనే విషయం బయటపడుతుంది" అన్నారు తిల్వానీ.

కచ్ సరిహద్దు ప్రాంతం

తాము అదుపులోకి తీసుకునేటప్పటికే ఆ ఐదుగురూ చాలా నీరసంగా ఉన్నారని, ఏం జరుగుతోందో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని జేఐసీకి సంబంధించిన చాలా మంది అధికారులు బీబీసీతో అన్నారు.

"వాళ్లకు తినడానికి ఎక్కువ ఇస్తే, ఎక్కువ తింటారు. తక్కువ ఇస్తే తక్కువ తింటారు. ఎంతపెడితే అంతే.. తర్వాత కావాలని అడగరు. దాంతో, మిగతావాళ్లు కూడా వాళ్లకు తమ భోజనం ఇచ్చేసేవారు. దాంతో అతిగా తినడం వల్ల వాళ్ల పొట్ట పాడయ్యేది. బట్టలు కూడా పాడు చేసుకునేవారు" అని నిర్బంధ కేంద్రంలోని అధికారులు చెప్పారు.

"చలి వాతావరణంలో రాత్రిళ్లు వారు మూత్రం లేదా టాయిలెట్ వెళ్లినా, దాని గురించి సిబ్బందికి చెప్పలేకపోయేవారు. అక్కడ మిగతా వాళ్లు కూడా నిద్రపోతుండడంతో, రాత్రంతా వాళ్లు అలా తడి బట్టలతో చలిలో అలాగే ఉండిపోయేవారు" అన్నారు.

నిర్బంధ కేంద్రంలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురిలో మునీర్‌కు మినహా, మిగతా నలుగురికీ చనిపోయే ముందు శ్వాస ఇబ్బందులు వచ్చాయి. కానీ వాళ్లకు ఆ సమస్య చలి వల్లా, లేక, కోవిడ్ వల్లా అనేది కచ్చితంగా తెలీడంలేదు.

మృతుల పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇవ్వడానికి లేదా చూపించడానికి ఆస్పత్రి సిబ్బంది, పోలీసు అధికారులు ఒప్పుకోలేదు.

ఐదుగురూ కరోనా వల్లే చనిపోయారా అనే విషయాన్ని కూడా జేఐసీ అధికారులు చెప్పడం లేదు. "కేంద్రంలో ఎంతోమంది పోలీసులు, ఖైదీలు కలిసే ఉంటారు. కరోనా ఉంటే అది అందరికీ వ్యాపించేది కదా" అంటున్నారు.

నిర్బంధ కేంద్రం లోపలికి వెళ్లడానికి అధికారులు బీబీసీని అనుమతించలేదు. అక్కడ లోపలికి వెళ్లడానికి ఎవరికీ అనుమతి ఉండదని చెప్పారు. కేంద్రంలో పనిచేసే అధికారులు రిటైర్ అయినా, లోపల ఫొటోలు తీసుకోవడం ఉండదని చెప్పారు.

నిర్బంధ కేంద్రంలో తక్కువ వ్యవధిలోనే ఐదుగురు చనిపోవడంపై ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. కానీ అధికారులు మాత్రం తాము ఖైదీలతో చాలా మృదువుగా ప్రవర్తిస్తామని చెబుతున్నారు.

ఖైదీలతో తాము అప్పుడప్పుడూ క్రికెట్, వాలీబాల్, క్యారమ్స్ కూడా ఆడుతుంటామని జేఐసీ అధికారులు చెబుతున్నారు.

"నేను అప్పుడప్పుడు మానసికంగా బలహీనంగా ఉన్నవారితోపాటూ, మిగతా ఖైదీలను కూడా కూర్చోబెట్టి పాటలు పెట్టేవాడిని. నాకు పాటలంటే ఇష్టం. అందరినీ డాన్స్ చేయమనేవాడిని. వాళ్లంతా తమకు తోచినట్లు డాన్స్ వేసేవాళ్లు. మాట్లాడలేకపోయినా, సంగీతానికి మాత్రం స్పందించేవారు" అని గులాబ్ జడేజా చెప్పారు.

ఐదుగురు మృతుల్లో 2009 నుంచి నిర్బంధంలో ఉన్న ఖాలిద్ జేఐసీలో అందరికంటే ఎక్కువకాలం ఉన్నారు.

"ఖాలిద్ కుటుంబం గురించి తెలుసుకోడానికి పాకిస్తాన్ టీవీ చానళ్లలో భారత్ ప్రకటనలు కూడా ఇచ్చింది. అధికారులు చికిత్స కోసం అతడిని అప్పుడప్పుడూ డాక్టర్ తిల్వానీ దగ్గరకు తీసుకెళ్లేవారు. ఆయనకు వాళ్లు బాగా పరిచయం" అని గులాబ్ జడేజా చెప్పారు.

"మనం ప్రతి నెలా ఎవరినైనా కలుస్తుంటే, వాళ్లతో ఒక తెలీని బంధం ఏర్పడిపోతుంది. ఖాలిద్‌ అయితే నాకు చాలా బాగా తెలుసు. మేమంతా తన కోసం చాలా కష్టపడ్డాం కూడా. తను అసలు మాట్లాడేవాడు కాదు, కానీ, మేం ఆయన్ను అహ్మదాబాద్ ఆస్పత్రికి పంపించాక, అక్కడ కొద్ది కొద్దిగా మాట్లాడగలిగారు" అన్నారు తిల్వానీ

BBC Iswoty

ఇవికూడాచదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
five Pakistanis die in the Kutch detention center on the Indian border
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X