వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సునీల్ గావస్కర్ సర్ బ్రాడ్‌మన్ రికార్డును ఎలా బ్రేక్ చేశారు... అప్పుడు అసలేం జరిగింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఆస్ట్రేలియాకు చెందిన సర్ డాన్ బ్రాడ్‌మన్ టెస్ట్ క్రికెట్‌లో 29 సెంచరీలు సాధించి రికార్డ్ నెలకొల్పారు. ఈ రికార్డును బద్దలుగొట్టడానికి 35 ఏళ్లు పట్టింది. ఎందరో క్రికెటర్లు వచ్చారు, పోయారు. కానీ, డాన్ బ్రాడ్‌మన్ రికార్డ్‌ను అందుకోవడం ఎవరి వల్లా కాలేదు. ఎట్టకేలకు 1983లో సునీల్ గావస్కర్ ఆ రికార్డు బ్రేక్ చేశారు.

గావస్కర్‌ ఈ రికార్డ్ బద్దలుగొట్టడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది.

1983 డిసెంబర్... ఇండియా, వెస్టిండీస్ మధ్య ఆరు టెస్టుల సీరీస్ జరుగుతోంది. ఆరోజు చివరి టెస్ట్ ఆరంభమైంది. అప్పటికే క్లైవ్ లాయిడ్ నేతృత్వంలో వెస్ట్ ఇండీస్ సీరీస్‌లో 3 టెస్టులు గెలిచి ఆధిపత్యంలో ఉన్నారు.

దీనికి ముందు భారత్, పాకిస్తాన్‌తో ఒక సీరీస్ ఆడింది. అందులో సునీల్ గావస్కర్ బెంగళూరులో తన 28వ సెంచరీ సాధించారు.

వెస్టిండీస్‌తో ఆడుతున్న సీరీస్‌లో గావస్కర్ రెండు సెంచరీలు చేసి డాన్ బ్రాడ్‌మన్ రికార్డును అధిగమించాలని అభిమానులందరూ కోరుకున్నారు.

దిల్లీలో జరిగిన టెస్ట్‌లో గవాస్కర్ 29వ సెంచరీ చేసి బ్రాడ్‌మన్ రికార్డ్ సమం చేశారు. అయితే, తరువాతి ఐదు ఇన్నింగ్స్ పేలవంగా ఆడి అభిమానులను నిరాశ పరిచాడు. గావస్కర్‌పై ఒత్తిడి పెరిగింది.

మద్రాస్ టెస్ట్‌లో వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసి 313 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్‌కు దిగిన భారత్, అంశుమన్ గైక్వాడ్, నవజోత్ సింగ్ సిద్ధూలను ఓపెనింగ్ పెయిర్‌గా పంపింది.

ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా వెళ్లకపోవడం గావస్కర్ టెస్ట్ కెరీర్‌లో ఇదే మొదటిసారి. అయితే, దానివల్ల ఏమాత్రం తేడా రాలేదు...మొదటి ఓవర్ ముగియకుండానే గవాస్కర్ క్రీజులోకి వెళ్లే పరిస్థితి వచ్చింది.

సునీల్ గావస్కర్

ఆరోజు మ్యాచ్ గురించి సునీల్ గావస్కర్ తన పుస్తకంలో ఇలా రాశారు.

"నేను డ్రెస్సింగ్ రూంలో షూస్ వేసుకుంటూ ఉన్నాను. ప్రేక్షకుల అరుపులు కేకలతో గైక్వాడ్ వికెట్ పడిపోయిందని అర్థమైంది. వన్ డౌన్‌లో దిలీప్ వెంగ్‌సర్కార్ వెళ్లాడు. థై ప్యాడ్ కట్టుకుంటున్నాను. మళ్లీ అరుపులు, కేకలు...వెంగ్సర్కార్ కూడా వెంటనే వెనుదిరిగాడు.

నేను క్రీజులోకి వెళ్లి మొదటి బంతి ఆడాను. అయితే, అది..అప్పటికే రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి హ్యాట్రిక్ మీదున్న మాల్కం మార్షల్ బంతి అని నాకు తెలీనే తెలీదు. మామూలుగా ఆడేశాను. ఓవర్ ముగిసిన వెంటనే వివియన్ రిచర్డ్స్ నా దగ్గరకొచ్చి, మీరు బ్యాటింగ్ ఆర్డర్‌లో లేట్‌గా వచ్చినా పెద్ద తేడా ఏం లేదు. స్కోరు ఇంకా సున్నా దగ్గరే ఉంది అని అన్నారు."

ఆ ఇన్నింగ్స్‌లో వెస్ట్ ఇండీస్ ఫాస్ట్ బౌలర్ల మెరుపు దాడిని ఎదుర్కొంటూ గవాస్కర్ 236 పరుగులు చేసారు. అప్పటికి అది ఒక భారత్ బ్యాట్స్‌మన్ నమోదు చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా.

డిసెంబర్ 28... సునీల్ గావస్కర్ 30 సెంచరీలు చేసి సర్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డ్ బ్రేక్ చేసిన రోజు. భారత క్రికెట్ చరిత్రలో అపురూపమైన రోజు.

సునీల్ గావస్కర్

ఆ టెస్ట్ ఆడడానికి గావస్కర్ సంసిద్ధంగా లేరు

"కోల్‌కతా టెస్ట్ తరువాత క్యాప్టన్ కపిల్ దేవ్ ఇచ్చిన ఇంటర్వ్యూ మీడియాలో వచ్చింది. జట్టులోని సీనియర్ ఆటగాళ్లు ఆటకంటే ఎక్కువగా డబ్బుపట్ల ఆసక్తి చూపిస్తున్నారు" అని కపిల్ దేవ్ అన్నారు. అది ఒక కెప్టెన్‌ నుంచి వచ్చిన కఠినమైన మాట.

దీని గురించి కపిల్ దేవ్ ఏదైనా వివరణ ఇస్తారేమోనని నేను కొన్ని రోజులు వేచి చూశాను. అలాంటిది ఏమీ జరగకపోయేసరికి భారతీయ క్రికెట్ బోర్డు సభ్యులైన సాల్వేకు ఫోన్ చేశాను. జట్టు ఆటగాళ్లు ఆటకు పూర్తి న్యాయం చేయడం లేదని కపిల్ దేవ్ భావిస్తే నేను మద్రాస్ టెస్ట్‌నుంచీ విరమించుకుంటానని సాల్వేకు చెప్పాను.

క్రికెట్ బోర్డు కపిల్ దేవ్‌ను పిలిచి అడిగితే.. తాను అలాంటి ప్రకటన ఏమీ చెయ్యలేదని అన్నారు. కానీ, నాకు తృప్తిగా లేదు. మద్రాస్ టెస్ట్ ఆడకూడదనే అనుకున్నాను. మా మావయ్య మధు మంత్రి నన్ను పిలిచి.. ఆడడం ఇష్టం లేకపోతే గాయం అయిందనో, అనారోగ్యంగా ఉందనో సాకు చెప్పమని సలహా ఇచ్చారు. నా కెరీర్‌లో నేనెప్పుడూ సాకులు చెప్పలేదు. ఇకముందు కూడా చెప్పను అని స్పష్టం చేశాను.

ఒక విజేత ఎప్పుడూ పోటీనుంచి వైదొలగలేడు. పోటీనుంచి వైదొలిగినవాడు విజేత కాలేడు..ఈ విషయం నాకు గుర్తు వచ్చింది. చాలా ఆలోచించిన మీదట మద్రాస్ టెస్ట్ ఆడాలని నిర్ణయించుకున్నాను" అని గావస్కర్ తన పుస్తకంలో రాశారు.

ఇదే సీరీస్‌లో అహ్మదాబాద్ టెస్ట్‌లో 90 పరుగులు చేసి టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా గావస్కర్ రికార్డు సృష్టించారు.

అంతకుముందు ఈ రికార్డు 8,114 పరుగులు చేసిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జెఫ్ బాయ్‌కాట్ పేరుమీద ఉండేది. రెండేళ్లు తిరగకుండానే గావస్కర్ ఆ రికార్డు బద్దలుగొట్టి టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసారు.

గావస్కర్‌ను ప్రశంసించిన డాన్ బ్రాడ్‌మన్

గావస్కర్ 30 సెంచరీలు చేసి రికార్డ్ నెలకొల్పినప్పుడు బ్రాడ్‌మాన్ ఆయనను ప్రశంసించారు. గావస్కర్, టెక్నిక్, వైఖరి, ఉత్సాహం నేనెప్పుడూ ఇష్టపడతాను అని అన్నారు. గావస్కర్ క్రికెట్‌కే అందం తెచ్చారని, ప్రపంచంలో అత్యుత్తమ ఓపెనర్ అని బ్రాడ్‌మాన్ ప్రశంసించారు.

1985లో ముంబై బ్యాట్స్‌మన్ శిశిర్ హట్టంగడికి సర్ డాన్ బ్రాడ్‌మన్‌ను కలిసే అవకాశం వచ్చింది.

శిశిర్ హట్టంగడి, తన స్నేహితులతో కలిసి బ్రాడ్‌మన్‌ ఇంటి బయట తచ్చాడుతూ ఉండగా మొక్కలకు నీళ్లు పొయ్యడానికి ఆయన బయటకి వచ్చారు. శిశిర్‌ సహా తన దోస్తులందరూ బ్రాడ్‌మన్‌కు గుడ్ మార్నింగ్ చెప్పి పలకరించారు. బ్రాడ్‌మన్‌ పలకరింపుగా నవ్వి..’మీరు ఏ దేశంనుంచీ వచ్చారు?’ అని అడిగారు. మేము భారతదేశంనుంచి వచ్చామని చెప్పగా..’మీలో ఎవరు గావాస్కర్‌తో కలిసి క్రికెట్ ఆడారు?’ అని అడిగారు.

గావస్కర్‌తో కలిసి ఓపెనింగ్ చేసానని శిశిర్ తెలిపారు. వెంటనే బ్రాడ్‌మన్‌ అందరినీ లోపలికి ఆహ్వానించి, మాట్లాడారు. ఇది కొంత ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే బ్రాడ్‌మన్‌ చాలా అరుదుగా మనుషులను కలుస్తారు.

డాన్ బ్రాడ్‌మన్

ఈ పోలికను నేను సమర్థించను

గావస్కర్‌ను బ్రాడ్‌మన్‌తో పోల్చడం గురించి పలుసార్లు అడిగారు. దానికి జవాబుగా...ఈ పోలికను సమర్థించలేనని, రెండు విభిన్న సమయాలకు, పరిస్థితులకు చెందిన బ్యాట్స్‌మెన్‌ను ఎలా పోల్చగలరని గావస్కర్ అన్నారు.

సునీల్ గావస్కర్ టెస్ట్ కెరీర్ ముగిసే సమయానికి...టెస్ట్ క్రికెట్‌లో పదివేల పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్స్‌గా రికార్డ్ సాధించారు. తొమ్మిదేళ్ల తరువాత ఈ రికార్డ్‌ను ఆస్ట్రేలియాకు చెందిన అలన్ బోర్డర్ బద్దలుగొట్టారు.

సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్

తరువాత టెండూల్కర్ వచ్చాడు

అంతర్జాతీయ క్రికెట్‌లో గవాస్కర్ తరువాత టెండూల్కర్ ఆ స్థాయిలో రాణించి అనేక రికార్డులు సొంతం చేసుకున్నాడు.

అయితే, గావస్కర్ చేసిన 34 సెంచరీలను అధిగమించడానికి సచిన్‌కు 22 ఏళ్లు పట్టింది.

2005లో భారత్, శ్రీలంకల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సచిన్ తన 35వ సెంచరీ చేసి గావస్కర్ రికార్డును బద్దలుగొట్టాడు. టెండూల్కర్ కెరీర్ ముగిసే సమయానికి 51 సెంచరీలు చేసి ధ్రువతారగా నిలిచాడు.

సచిన్ రికార్డ్ ఎవరు బద్దలుగొడతారా అని ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరు ముగ్గురూ వారి ఫాంను కొనసాగిస్తే సచిన్ రికార్డును చేరుకోవచ్చు.

52వ సెంచరీ ఎవరు చేస్తారో వేచి చూడాల్సిందే!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
How did Sunil Gavaskar break Bradman record
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X