వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహాత్మాగాంధీకి, నాస్తికుడైన గోరాకు మధ్య అనుబంధం ఎలా ఏర్పడింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
గోరా

హిందూ మత విశ్వాసాలపై మహాత్మాగాంధీకి అపారమైన విశ్వాసం ఉండేది. సర్వమత సామరస్యం ఉండాలన్నది కూడా ఆయన ఆకాంక్ష.

అయితే, మహాత్మాగాంధీ తన అభిప్రాయాలకు భిన్నమైన వారితో కూడా వివిధ రకాల చర్చలు జరపడం చరిత్ర నిండా చూశాం. పూర్తిస్థాయి నాస్తికుడిగా, నాస్తికోద్యమం కోసం కేంద్రాన్ని నెలకొల్పిన గోపరాజు రామచంద్రరావును ప్రత్యేకంగా తన ఆశ్రమానికి గాంధీ పిలిపించుకున్న ఉదంతం దీనికి ఉదాహరణ.

గోపరాజు రామచంద్రరావు తెలుగునాట "గోరా"గా ప్రసిద్ధులు. గుజరాత్‌లోని సేవాగ్రామ్‌ ఆశ్రమంలో ఆయనతో గాంధీ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. గోరా, ఆయన కుటుంబ సభ్యులు రెండేళ్ల పాటు ఆ ఆశ్రమంలో ఉండటం విశేషం.

స్వాతంత్ర్యానికి పూర్వమే గాంధీ, గోరాల మధ్య అనుబంధం ఏర్పడింది. గాంధీ ప్రభావం గోరా మీద పడినట్టుగా ఆయన అనుచరులు భావిస్తారు.

ఆస్తిక, నాస్తిక విషయాల్లో దృఢమైన అభిప్రాయాలు కలిగిన ఈ ఇద్దరు ప్రముఖుల మధ్య జరిగిన ఆ చర్చలు, ఆనాటి పరిణామాల ప్రభావం నేటికీ గోరా ఆశ్రమంపై కనిపిస్తుంది. విజయవాడలోని నాస్తిక కేంద్రంలో బాపూ దర్శన్ పేరుతో గాంధీ జ్ఞాపకాల ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు.

నాస్తిక కేంద్రం

ఒడిశా నుంచి శ్రీలంక వరకూ...

గోరా 1902, నవంబర్‌ 15న ఒడిశాలోని గంజా జిల్లా ఛత్రపురిలో జన్మించారు. పర్లాకిమిడి, కాకినాడలో ఆయన విద్యాభ్యాసం సాగింది. మద్రాస్‌ ప్రెసిడెన్సీ కళాశాల నుంచి వృక్ష శాస్త్రంలో పీజీ డిగ్రీ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన వృక్షశాస్త్ర అధ్యాపకుడిగా మారారు. తమిళనాడులోని మధురై, కోయంబత్తూర్‌తో పాటుగా శ్రీలంకలోని కొలంబోలో కూడా ఆయన అధ్యాపకుడిగా పనిచేశారు.

అప్పట్లో సర్వేపల్లి రాధాకృష్ణ పిలుపు మేరకు విజయవాడలో యూనివర్సిటీ ప్రారంభించగానే అధ్యాపక వృత్తిలో కొనసాగేందుకు మళ్లీ కృష్ణా తీరంలో అడుగుపెట్టారు.

ఈ క్రమంలోనే గోరా మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేశారు. 1930వ దశకంలోనే గ్రహణాల పట్ల ప్రజల్లో ఉన్న అంధ విశ్వాసాలను తొలగించేందుకు పూనుకున్నారు. అందులో భాగంగా తన భార్య సరస్వతీ గోరాతో కలిసి గ్రహణం నాడే ఆహారం తినడం, గర్భిణీగా ఉన్న సమయంలో ఆరుబయట తిరగడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రజల్లో మూఢ నమ్మకాలను తొలగించేందుకు ఆచరణాత్మకంగా కృషి చేశారు.

నాస్తిక కేంద్రం

80 వసంతాలు పూర్తి చేసుకున్న నాస్తిక కేంద్రం

స్వాతంత్ర్యానికి పూర్వమే ప్రజల్లో నాస్తికత్వం పట్ల ఆలోచనలు పెంచేందుకు గోరా పట్టుదలగా పనిచేశారు. ఇందుకోసం 1940 ఆగస్టు 10న ఆయన కృష్ణా జిల్లాలో నాస్తిక కేంద్రం ఏర్పాటు చేశారు. దేశంలోనే అది తొలి నాస్తిక కేంద్రం. ప్రపంచంలో కూడా ఇలాంటి కేంద్రం అరుదని చెబుతారు. ఆ కేంద్రంలో 80 మంది యువకులతో నిత్యం నాస్తికత్వం గురించి ప్రచారం జరిగేది. అక్షరాస్యత గురించి వయోజనుల్లోనూ చైతన్యం తెచ్చేందుకు కృషిచేశారు. అంటరానితనం భావనలు తీవ్రంగా ఉన్న ఆనాటి రోజుల్లో గోరా దానికి వ్యతిరేకంగా పనిచేశారు. ముదునూరు చుట్టుపక్కల పలు గ్రామాల్లో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత స్వాతంత్ర్యం సిద్ధిస్తున్న వేళ ముదునూరు నుంచి నాస్తిక కేంద్రం 1947 ఏప్రిల్‌లో విజయవాడకు తరలింది.

గోరా తర్వాత ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు కూడా నాస్తిక కేంద్రం నిర్వహణ కొనసాగించారు. గోరా ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఉన్న నాస్తిక కేంద్రం నేటికీ నిర్విరామంగా కార్యకలాపాలు సాగిస్తోంది. వివిధ సమావేశాలు, చర్చలు, అధ్యయనం కోసం గ్రంథాలయం, సమతా ఆర్థిక మండలి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇటీవలే ఈ నాస్తిక కేంద్రం 80 వసంతాలను పూర్తి చేసుకుంది.

ప్రస్తుతం బాపూ దర్శన్ , గోరాతో పాటుగా ఆయన భార్య సరస్వతి గోరా చేపట్టిన కార్యక్రమాల వివరాలను నాస్తిక కేంద్రంలో ఎగ్జిబిషన్స్‌గా ఏర్పాటు చేశారు. గోరా సైన్స్ కేంద్రం కూడా ఇందులో ఉంది. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు రచించిన పుస్తకాలతో గ్రంథాలయం కూడా నడుస్తోంది.

నాస్తిక కేంద్రం

గోరా కృషిని మెచ్చుకున్న గాంధీ

సామాజిక అసమానతలు వైదొలగాలని గోరా ఆశించారు. అందుకోసం ఆయన విశేషమైన కృషి చేశారు. ప్రధానంగా నాటి హరిజనవాడలను కేంద్రంగా చేసుకుని ఆయన కార్యక్రమాలు సాగించారు.

అప్పటికే అంటరానితనం నిర్మూలన కోసం మహాత్మ గాంధీ కూడా పిలుపునిచ్చారు. గోరా చేస్తున్న కృషి కూడా ఆయన దృష్టికి వెళ్లింది. దీంతో గోరాను చర్చల కోసం మహాత్మ గాంధీ స్వయంగా ఆహ్వానించారు.

సేవాగ్రామ్‌లో గాంధీతో గోరా సుదీర్ఘంగా చర్చలు సాగించారు.

ఆస్తిక, నాస్తిక అంశాలతో పాటుగా దేశంలో అప్పటికే సాగుతున్న క్విట్ ఇండియా ఉద్యమం, దేశ పునర్నిర్మాణం వంటి అనేక అంశాలపై వారు చర్చలు జరిపేవారని గోరా తనయుడు నియంత బీబీసీతో అన్నారు. తమ కుటుంబ సభ్యులంతా సేవగ్రామ్‌కి వెళ్లామని, గాంధీతో తమకు మరిచిపోలేని స్మృతులున్నాయని ఆయన చెప్పారు.

"ఆశ్రమంలో అందరూ తమకు వీలైన పని చేయాలి. అప్పటికి నేను ఇంకా చిన్న పిల్లాడిని. మా అన్నయ్య వాళ్లూ ఓసారి కూరగాయాలు శుభ్రం చేసే పనిలో ఉన్నారు. అప్పుడు గాంధీ అక్కడికి వచ్చారు. 'శుభ్రం చేస్తున్న వాటిలో కొన్ని పండ్లు నువ్వు తీసుకోవచ్చు కదా' అని అన్నారు. అప్పుడు మా అన్నయ్య... 'లేదు, లేదు ఆ పండ్లన్నీ శుభ్రం చేసి అక్కడ పెడితే అందరికీ సమానంగా పంచుతారు' అని జవాబు ఇచ్చాడు. దీనికి గాంధీ మంత్రముగ్ధులయ్యారు. 'దేశంలో అందరికీ కనీస అవసరాలు అందుబాటులో ఉంటే ఇతర పద్ధతుల్లో దానిని దక్కించుకోవాలనే ఆలోచన ప్రజలకు రాదని, దానికి ఈ పిల్లాడి జవాబే ఉదాహరణ' అంటూ నాడు గాంధీ చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. గాంధీతో మా అందరికీ అనేక అనుభవాలుండేవి. మా అన్న పెళ్లికి గాంధీ రావాలి. 1948 మార్చిలో పెళ్లి ఉందనగా, జనవరిలోనే ఆయన హత్యకు గురయ్యారు. దీంతో మా కుటుంబంలో తొలి హరిజన, హరిజనేతర వివాహం ఆయన లేకుండానే జరిగిపోయింది. నాటి ప్రధాని నెహ్రూ సహా అనేక మంది ఆ వివాహానికి హాజరయ్యారు. ఆశ్రమంలో జరిగిన తొలి మూడు కులాంతర వివాహాలు తెలుగువారివే. అందులో రెండు మా అన్న, అక్కలవే" అని నియంత వివరించారు.

నాస్తిక కేంద్రం

గాంధీ స్ఫూర్తితో సాగిన గోరా

ఓవైపు నాస్తికత్వం విషయంలో తన కృషిని కొనసాగిస్తూనే... సామాజిక మార్పు, సేవా దృక్పథాల గురించి గోరా కృషి చేశారు. ఈ విషయాల్లో గోరాపై గాంధీ ప్రభావం చాలా ఎక్కువగా కనిపించేదని ఆయన సమీకాలికుడు, నాస్తికోద్యమంలో పనిచేసిన పి. రామారావు అభిప్రాయపడ్డారు.

"నాస్తికత్వం అంటే దేవుడూ, దెయ్యం లేవని చెప్పి, అక్కడితో ఆగిపోయే భావనగా దాన్ని మిగల్చలేదు. మనిషి కోసం, మానవ జీవన ప్రగతి కోసం, సమతాసమాజం కోసం ఆలోచించే తాత్వికత నాస్తికత్వంలో ఉందని గోరా నిరూపించారు. దానిని జీవితాచరణలో భాగంగా చేసుకున్నారు. గాంధీ ఆశయాల సాధనలో చివరి వరకూ పనిచేశారు. మనిషిలోని నిజమైన మానవత్వమే పునాదిగా నాస్తికత్వం తీర్చిదిద్దారు. హేతుబద్ధమైన ఆలోచనలకు అంకురార్పణ చేసే సంస్కృతికి ఆయన బీజం వేశారు. ప్రపంచంలోని హేతువాద, నాస్తికోద్యమాలను ఆయన స్థాపించిన నాస్తిక కేంద్రం చాలావరకూ ప్రభావితం చేసింది. తక్కువ మందితోనే మొదలైన నాస్తిక కేంద్రం తన పరిధిని విస్తరించుకుంటూ అనేక కార్యక్రమాలను నిర్వహించింది. దీనికి ఇప్పుడు దేశం వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేకమంది సభ్యులున్నారు. అదే సమయంలో గాంధీ ఆలోచనలకు అనుగుణంగా కులాంతర వివాహాలు, సామాజిక రుగ్మతలపై తుది వరకూ గోరా ఉద్యమించారు. సేవాగ్రామ్ నుంచి దిల్లీలోని రాజ్ ఘాట్ వరకూ పాదయాత్ర చేసి, మార్గం మధ్యలో అనేకమందిలో చైతన్యం పెంచే ప్రయత్నం గోరా చేయడం గాంధీ ప్రభావానికి నిదర్శనం" అని రామారావు పేర్కొన్నారు.

నాస్తిక కేంద్రం

గోరా కుటుంబంలో పేర్లు, పెళ్లిళ్లు ప్రత్యేకమే..

ఓవైపు స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకుంటూనే, మరోవైపు నాస్తికత్వం, సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ, వివిధ అంశాలపై పుస్తకాలు రాస్తూ ముందుకు సాగారు గోరా. కేవలం మాటలతో సరిపెట్టకుండా, తాను చెప్పిన విషయాలను ఆచరణలోనూ పెట్టారు గోరా.

గోరాకు మొత్తం 9 మంది పిల్లలు. వారి పేర్లు కూడా ఆనాటి పరిస్థితులకు అద్దంపట్టేలా విలక్షణంగా ఉండడం విశేషం.

శ్రీలంకలో ఉన్న సమయంలో పుట్టిన బిడ్డకు మనోరమ అని ఆయన పేరు పెట్టారు. ఉప్పు సత్యాగ్రహం సాగుతున్న కాలంలో పుట్టిన కుమారునికి లవణం అని... గాంధీ, ఇర్విన్ ఒడంబడికకు సూచికగా మైత్రీ అంటూ ఓ అమ్మాయికి పేరు పెట్టారు.

చదువు ప్రాధాన్యతను చాటిచెప్పేందుకు విద్య అని మరో కుమార్తెకు పేరు పెట్టారు. భారతీయులు ఛట్ట సభల్లో నిలిచి గెలిచిన కాలంలో పుట్టిన కొడుకు పేరుకు విజయం అని, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో పుట్టిన కుమారులకు సమరం, ఆ తర్వాత నాటి ప్రపంచ పాలకులకు సూచికగా నియంత అని, తొమ్మిదో సంతానానికి నవ్ అని పేర్లు పెట్టారు గోరా. సందర్భోచితంగా పేర్లు పెట్టే కొత్త విధానానికి గోరా ఆద్యుడయ్యారు.

అంటరానితనం నిర్మూలన కోసం కులాంతర వివాహాలు ఎక్కువగా జరగాలని అభిలాషించిన గోరా తన కుటుంబ సభ్యులతోనూ అందుకు అనుగుణంగా అడుగులు వేయించారు.

తన బిడ్డలను హరిజన, హరిజనేతర వివాహాల వైపు ప్రోత్సహించారు. తొలుత మనోరమని అర్జునరావుకి ఇచ్చి, వారి వివాహం సేవాగ్రామ్‌లో జరిపించారు. ఆ తర్వాత గోరా బాటలో నాస్తికోద్యమానికి సారథిగా వ్యవహరించిన లవణం కూడా నవయుగ కవి చక్రవర్తిగా పిలుచుకునే గుర్రం జాషువా కుమార్తె హేమలతను వివాహం చేసుకున్నారు.

ఆ తర్వాత కూడా వారి కుటుంబంలో కులాలు, మతాలకు అతీతంగా వివాహాలు జరిగాయి.

నేటికీ అదే పద్ధతిలో కొనసాగుతున్నామని గోరా కుమార్తె నవ్ బీబీసీకి తెలిపారు. "మా నాన్న స్ఫూర్తి అందరిలో ఉంది. అందుకే కులాలు, మతాలకు అతీతంగా గోరా అనుచరులంతా వ్యవహరిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి తీరు పెరుగుతోంది. వివిధ దేశాల్లో మానవతా దృక్పథమే మిన్నగా భావించే వారి సంఖ్య 51 శాతానికి చేరింది. మరింత పెరుగుతుందని భావిస్తున్నాం" అని అన్నారు.

నాస్తిక కేంద్రం

గోరా వారసత్వంతో కుటుంబీకులు..

గోరా స్ఫూర్తి నేటికీ ఆయన కుటుంబ సభ్యుల్లో కనిపిస్తోంది.

నాస్తిక కేంద్రం కొనసాగించడంలోనూ, వివిధ అంశాలలో ప్రపంచవ్యాప్త కార్యక్రమాలు చేపట్టడంలోనూ గోరా, సరస్వతి గోరా అనంతరం వారి తనయుడు లవణం సహా అనేక మంది చొరవ ప్రదర్శించారు.

గోరా కాలంలోనే విజయవాడ కేంద్రంగా ప్రపంచ నాస్తిక మహాసభలు జరిగాయి. 1972లో తొలి మహాసభలు నిర్వహించగా, గోరా మరణానంతరం 1980లో ప్రపంచ నాస్తిక రెండో మహాసభ జరిగింది.

నేటికీ నాస్తిక కేంద్రం, సైన్స్ సెంటర్ నిర్వహణలో వారంతా భాగస్వాములవుతున్నారు. గోరా తనయుడు డాక్టర్ సమరం తెలుగువారందరికీ చిరపరిచితులు.

గోరా, సరస్వతి

గోరా బాటలోనే సరస్వతి

మహిళలు బయట అడుగుపెట్టాలంటేనే పలుమార్లు ఆలోచించే నాటి సమాజంలో సరస్వతి గోరా ఎంతో చొరవ ప్రదర్శించారు. గోరా బాటలోనే ఆమె సాగారు. ఆయనతో పాటు కలిసి అడుగులు వేస్తూ అనేక మార్లు అరెస్టయ్యారు. జైలు పాలయ్యారు.

క్విట్ ఇండియా ఉద్యమంలో తన రెండున్నరేళ్ల కుమారుడు నియంతతో కలిసి జైలు జీవితం గడిపారు. ఎక్కడా వెనకాడకుండా ఉద్యమాల బాటలో సాగారు. గ్రహణాలపై ప్రజల్లో అవగాహన పెంచేడం, నిప్పుల మీద నడుస్తూ మూఢ నమ్మకాలను దూరం చేశారు. దేవదాసీ, జోగినీ వ్యవస్థలను రద్దు చేసేందుకు కృషి చేశారు.

మతాచారాలను సూచించే ఎటువంటి ఆభరణాలు ధరించకుండా, నూలుతో తయారైన చేనేత వస్త్రాలను ధరించేవారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అవార్డు సహా పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు ఆమెకు దక్కాయి. 1975 జూలై 26న గోరా తుది శ్వాస విడవగా, 2006 ఆగస్టు 19న సరస్వతి గోరా మరణించారు.

1969 నుంచి వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళల ఆర్థిక స్వావలంబనకు చేస్తున్న కృషిలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. పలు శిక్షణా కేంద్రాలను వాసవ్య మహిళా మండలి నడుపుతోంది.

ఈ కార్యక్రమాల గురించి డాక్టర్ కీర్తి బీబీసీకి వివరించారు.

"హింసకు గురైన మహిళలకు పునరావాసం కల్పించేందుకు ఈ మండలి ప్రాధాన్యతను ఇస్తోంది. సామాజిక సమస్యలతో బాధపడుతున్న మహిళలకు గోరా అభయ్ నివాస్‌ ద్వారా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం. మహిళలే కేంద్రంగా సమగ్రాభివృద్ధి జరగాలన్నది నాస్తిక కేంద్రం లక్ష్యం. గోరా, సరస్వతి గోరా కూడా అదే ప్రయత్నం చేశారు. వారి ఆశయాలకు అనుగుణంగా ఆరోగ్యం, పారిశుధ్యం, విద్య, జీవనోపాధి, గ్రామీణ పునర్నిర్మాణం, మానవతా సహాయం అందించే ప్రయత్నాల్లో ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది గ్రామాలకు 'వాసవ్య మహిళా మండలి' సేవలు అందుతున్నాయి. వీధి బాలల్లో నేర సంస్కరణ, జోగినీ సంస్కరణ లక్ష్యాలతో 'సంస్కార్‌' అనే కార్యక్రమాన్ని గత కొన్ని దశాబ్దాలుగా నిర్వహిస్తున్నాం" అంటూ వివరించారు.

గోరా స్థాపించిన నాస్తిక కేంద్రం ఇప్పటికే అంతర్జాతీయ గుర్తింపు సాధించింది. వివిధ దేశాల నుంచి నాస్తిక సంఘాల ప్రతినిధులు నిత్యం ఇక్కడికి వస్తూ ఉంటారు.

రెండేళ్లకోమారు ఒక బృందం జపాన్, జర్మనీ వంటి దేశాల్లో పర్యటనకు వెళుతుంటుంది. ఆయా దేశాల నుంచి పలువురు విజయవాడ నాస్తిక కేంద్రానికి వస్తూ ఉంటారు. ఆ సందర్భంగా వివిధ చర్చలు, సమావేశాలు జరుపుతామని నాస్తిక కేంద్రం నిర్వాహకులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Gandhi and Goparaju Ramachandra Rao popularly called as Gora had good relation though Gora was an aethist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X