విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖపట్నం ‘నాన్‌లోకల్ లీడర్ల’ అడ్డాగా ఎలా మారింది? 30 ఏళ్లుగా వారి హవా కొనసాగుతుండటానికి కారణాలేంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
విశాఖపట్నం

విశాఖపట్నం స్థానికేతర నాయకులకు అడ్డాగా మారింది. ఇతర ప్రాంతాలకు చెందినవారే ఇక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. వీళ్లు పార్టీలు మారుతున్నా, విశాఖను మాత్రం వదిలిపెట్టకపోవడం గమనార్హం.

విశాఖలో స్థానికేతరుల రాజకీయాలు మూడు దశాబ్దాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వైజాగ్ లోక్‌సభ స్థానంలో వారి ఆధిపత్యం నడుస్తోంది. రాజకీయ పార్టీలు కూడా స్థానిక నేతలకు టికెట్ ఇచ్చిన దాఖలాలు పెద్దగా కనిపించవు.

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ నుంచి బరిలోకి దిగిన నేతలంతా స్థానికేతరులే. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైసీపీ పార్టీలతోపాటు కొత్తగా ఎన్నికల బరిలోకి దిగిన జనసేన సైతం స్థానికులకు ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదు. గతంలోకి వెళితే... 1989లో నిర్వహించిన ఎన్నికల్లో కేరళలో పుట్టి, విజయనగరం రాజ కుటుంబానికి కోడలుగా వచ్చిన ఆనందగజపతి రాజు భార్య ఉమాగజపతి (కాంగ్రెస్) విశాఖ ఎంపీగా గెలుపొందారు. ఈ ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యాపార వేత్త ఎంవీవీఎస్ మూర్తి నిలబడ్డారు.

రెండేళ్లకే మధ్యంతర ఎన్నికలు రాగా మరోసారి కాంగ్రెస్, టీడీపీల తరుఫున వీరిద్దరే పోటీ పడ్డారు. ఎంవీవీఎస్ మూర్తి విజయం సాధించారు. 1996లో నెల్లూరుకు చెందిన పారిశ్రామికవేత్త టి.సుబ్బిరామిరెడ్డి (కాంగ్రెస్) ఆనందగజపతి రాజు (టీడీపీ) మీద పోటీచేసి గెలుపొందారు.

అనంతరం జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మరోసారి వీరిద్దరే పోటీపడగా, విజయం సుబ్బరామిరెడ్డినే వరించింది. 1999లో ఎంవీవీఎస్ మూర్తి (టీడీపీ) గెలుపొందారు. 2004లో నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి ఎన్.జనార్దన రెడ్డి (కాంగ్రెస్) గెలుపొందారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈయన మళ్లీ విశాఖ ఎంపీగా పోటీ చేయడం విశేషం.

వాసుపల్లి గణేశ్

2009 ఎన్నికల్లో ఎంవీవీఎస్ మూర్తి (టీడీపీ)పై మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి (కాంగ్రెస్) గెలుపొందారు. 2014లో ప్రకాశం జిల్లాకి చెందిన కంభంపాటి హరిబాబు బీజేపీ తరపున, వైసీపీ నుంచి రాయలసీమకు చెందిన వైఎస్ విజయమ్మ పోటీ పడ్డారు. హరిబాబు గెలిచారు.

ఇక 2019లో...ఎంవీవీఎస్ మూర్తి మనవడు శ్రీ భరత్ (టీడీపీ), తణుకుకి చెందిన ఎంవీవీ సత్యనారాయణ (వైసీపీ), కడపలో పుట్టి, శ్రీశైలంలో పెరిగిన వీవీ లక్ష్మీనారాయణ (జనసేన), చెన్నైలో పుట్టిన దగ్గుబాటి పురందేశ్వరి (బీజేపీ) ప్రధాన పార్టీల తరపున విశాఖ బరిలోకి దిగారు. 1952 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో 1990 వరకు కొంత స్థానికుల హవా నడిచింది. ఆ తరువాత క్రమంగా స్థానికేతరుల రాక మొదలైంది.

'వ్యాపారాల కోసం వచ్చి... రాజకీయ అధిపత్యం'

సహజసిద్ధమైన ప్రకృతి, మైమరపించే పర్యాటక ప్రదేశాలు, పెద్దపెద్ద పరిశ్రమలు, పోర్టు, షిప్ యార్డ్, స్టీల్ ప్లాంట్ వంటి ప్రభుత్వరంగ సంస్థలు... ఇలా విశాఖలో ఎటు చూసినా వ్యాపారానికి అవకాశం ఉన్న అంశాలే కనిపిస్తాయి. దీంతో దశాబ్దాలుగా వ్యాపారం కోసం అనేక మంది విశాఖ వస్తూనే ఉన్నారు. అందులో ఎక్కువ లాభాలను ఇచ్చే షిప్పింగ్, ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేట్ లాంటి వ్యాపారాలు చేయడానికి ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది.

దీంతో వివిధ ప్రాంతాల నుంచి విశాఖ వచ్చి... వ్యాపారాల్లో సక్సెస్ అయినవారు కోట్ల రూపాయలకు పడగలెత్తారు. దీంతో తమ వ్యాపారాలను మరింత విస్తరించుకోవడానికి, తమ వ్యాపారాలకు ఎటువంటి రాజకీయ ఇబ్బందులు రాకుండా ఉండడానికి రాజకీయాలను ఎంచుకున్నారు. వ్యాపారం చేసుకోవడానికి విశాఖ వచ్చి...ఇక్కడి రాజకీయాలను కూడా శాసించే స్థాయికి ఎదిగారు. ఇది 1990 నుంచి ఎక్కువైంది.

గంటా శ్రీనివాస్

ఎంవీవీఎస్ మూర్తి విద్యా సంస్థలు, షిప్పింగ్... టి. సుబ్బిరామిరెడ్డి రోడ్డు కాంట్రాక్టులు, అవంతి శ్రీనివాస్ విద్యాసంస్థలు, ఎంవీవీ సత్యనారాయణ స్థిరాస్తి, నిర్మాణ రంగ వ్యాపారాల్లో విశాఖని కేంద్రంగా చేసుకుని విజయాలు సాధించారు. అలాగే ప్రస్తుత ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు షిప్పింగ్ వ్యాపారం చేస్తుండగా...వెలగపూడి రామకృష్ణ బాబు లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు షిష్పింగ్, చింతలపూడి వెంకటరమణ భవనాలు, పార్కుల నిర్మాణ కాంట్రాకులు చేస్తున్నారు. ఇలా విశాఖకి వ్యాపారాల కోసం వచ్చిన ఈ మాజీ, తాజా ఎంపీ, ఎమ్మెల్యేలు జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారు. కొందరు ఎన్నికల సమయంలో డైరెక్టుగా విశాఖ వచ్చి వాలతారు. వీరిలో నేదురమల్లి జనార్దన్ రెడ్డి, పురందేశ్వరి, జేడీ లక్ష్మీనారాయణ వంటివారు ఉన్నారు.

'ఇక్కడి వాళ్లే ఉండాలి'

"ఒకప్పుడు విశాఖ మత్స్యకారుల పల్లె. ఇప్పుడు పెద్ద నగరంగా మారింది. ఈ నగరంలో 1990వ దశకం వరకూ స్థానికులే ఎంపీలుగా ఉండేవారు. విశాఖపట్నానికి చెందిన తెన్నేటి విశ్వనాథం, భాట్టం శ్రీరామమూర్తి, ద్రోణంరాజు సత్యనారాయణ ఎంపీలుగా ఎన్నికయ్యారు. కానీ ఆ తర్వాత కథ మారిపోయింది. 1991 నుంచి 2019 వరకు ఎంవీవీఎస్ మూర్తి, టి. సుబ్బిరామిరెడ్డి, నేదురుమల్లి జనార్దన రెడ్డి, దగ్గుబాటి పురందేశ్వరి, హరిబాబు, ఎంవీవీ సత్యనారాయణ విశాఖ ఎంపీలుగా గెలిచారు. వీరంతా స్థానికేతరులే. ప్రజా ప్రతినిధులంతా బయటి వారే కావడంతో స్థానికంగా నివాసముండి, సమస్యలను పరిశీలించి, పరిష్కరించే వ్యవస్థే లేకుండా పోయింది." అని మత్స్యకారుల సంఘం ప్రతినిధి రాము బీబీసీతో అన్నారు.

'అందుకే, విజయమ్మ పోటీ చేశారు'

రాజకీయ, కుటుంబ నేపథ్యంతోపాటు డబ్బులు బాగా ఖర్చు పెట్టగల వ్యాపారవేత్తలకే ఇక్కడ టిక్కెట్లు లభిస్తుంటాయని ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగాధిపతి ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి బీబీసీతో చెప్పారు.

"విశాఖ ఎంపీ సీటును రాజకీయపార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి. పైగా విశాఖలో ఎక్కవగా ఉద్యోగులు... అందులోనూ వేరే రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన వారే అధికంగా ఉంటారు. అంటే ఇక్కడి ప్రజల్లో స్థానికేతరులు పెద్ద సంఖ్యలో ఉంటారు. అలాగే మురికివాడల్లో నివసించే కూలీలు, చిరు వ్యాపారులు కూడా అధికంగా ఉంటారు. ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగాల కోసం వచ్చిన వీరు ఇక్కడి రాజకీయాలను పెద్దగా పట్టించుకోరు. చిన్నచిన్న పనులు, వ్యాపారాలు చేసుకునే వారికి రాజకీయాల కోసం ఆలోచించే సమయమే ఉండదు. దీంతో స్థానికత ఇక్కడ పెద్దగా ప్రభావం చూపదు. ఏపీ సీఎం జగన్ తల్లి విజయమ్మ కూడా గతంలో ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి అది కూడా ఒక కారణం" అని చెప్పారు.

విశాఖపట్నం

'మా ఎమ్మెల్యేకు మేము తెలియదు'

"ఈ నెల చేతికి జీతం ఎంత వస్తుందో? పండుగకి బోనస్ ఎంతిస్తారో? రిటైర్మెంట్ సమయానికి డబ్బు ఎంత జమవుతుంది?... లాంటి ఆలోచనలతోనే సగటు నగరవాసి జీవితం గడిచిపోతుంది. పత్రికలు, టీవీల ద్వారా రాజకీయాలు పైపైన తెలుసుకోవడమే కానీ... వాటి కోసం లోతుగా ఆలోచించే సమయం ఉండటం లేదు. స్థానికుడైనా, స్థానికేతరుడైనా మంచి చేసే నాయకుడు వస్తే చాలు" అని స్టీల్ ప్లాంట్ ఉద్యోగి దందేటి బాలబ్రహ్మం అన్నారు.

"నేను పేదల ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాను. కట్టుకునే స్థోమత నాకు లేదు. నాయకులు పట్టించుకోవడం లేదు. ఎంతో కాలంగా ఇక్కడే ఉంటున్న నేను మా ఎమ్మెల్యేకు పెద్దగా తెలియదు. ఎందుకంటే అతను ఇక్కడి మనిషి కాదు. ఎక్కడి నుంచో వచ్చాడు. స్థానికులతో సంబంధాలు ఉన్న వ్యక్తి నాయకుడైతే మంచిది" అని షాపింగ్ మాల్‌లో పని చేస్తున్న ఆనందబాబు బీబీసీతో అన్నారు.

'ఐదేళ్లకోసారి వలస పక్షుల్లా వస్తారు'

''ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఇక మా జీవితాలు విశాఖకే అంకితమంటూ ప్రచారాలను ఊదరగొట్టేస్తారు. గెలిచిన వారు ఏదో తూతూ మంత్రంగా ఇక్కడ ఉన్నామనిపిస్తే, ఓడిపోయిన అభ్యర్థులు తిరిగి వారి సొంత ప్రాంతాలకు వెళ్లిపోతారు. అసలు విశాఖని పట్టించుకోరు'' అని ఉత్తరాంధ్ర డెవలప్‌మెంట్ ఫోరం సభ్యుడు ఎస్. మూర్తి బీబీసీతో అన్నారు.

"ఎన్నికల కోసం ఐదేళ్లకొకసారి వలస పక్షుల్లాగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లిపోవడం సర్వసాధారణమైపోయింది. ఆ తర్వాత ఓడినవారంతా ఎక్కడున్నారో, అసలు ఉన్నారో? లేదో? కూడా తెలియని పరిస్థితి. ఇక్కడి మట్టి మీద ప్రేమ లేకపోతే, వాళ్లు స్థానికులతో ఎలా కలుస్తారు? అందుకే స్థానిక నేతలకే సీట్లు కేటాయిస్తే, తర్వాత ఎన్నికల కోసమైనా వీళ్లు ప్రజల్లో తిరుగుతారు. దీనివల్ల గెలిచిన అభ్యర్థికి కూడా తన ప్రత్యర్థి గమనిస్తున్నాడనే భయం ఉంటుంది. ఇప్పటి ఎంపీతో సహా గత 30 ఏళ్లుగా విశాఖ ఎంపీలుగా పని చేసిన వారంతా స్థానికేతరులే. వీళ్ల వల్ల విశాఖకి ఎలా మంచి జరుగుతుంది?" అని ఆయన అన్నారు.

'మేమూ ఇక్కడి వాళ్లమే'

పుట్టింది ఎక్కడైనా, వ్యాపారాల కోసమో, ఉపాధి కోసమో విశాఖ వచ్చి దశాబ్దాలు గడిచిపోయాయని... మేమూ విశాఖవాసులమే అవుతామని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బీబీసీతో అన్నారు.

"విశాఖ లాంటి ప్రదేశం దేశంలో ఎక్కడా ఉండదు. ఇక్కడి ప్రజలూ ఎంతో సౌమ్యులు. 26 ఏళ్లుగా ఇక్కడే ఉంటూ ఈ ప్రజల్లో కలిసిపోయాను. అనేక సేవా కార్యక్రమాలు చేశాను. నన్ను స్థానికుడిగా భావించే ప్రజలు నన్ను గెలిపించారు. నా ఊరు విశాఖే. మేం, మా తరువాత తరం అంతా విశాఖ వాసులమే. విశాఖ అభివృద్ధికి పదవులున్నా, లేకపోయినా మాకు చేతనైనంత సాయం చేస్తూనే ఉంటాం. స్థానికేతరులకి కలిసివచ్చే మరొక అంశం పొలిటికల్ పార్టీ. ఆ పార్టీ వేవ్ ఉంటే అప్పుడు ఎవరు, ఎక్కడ నుంచి పోటి చేసినా గెలుస్తారు" అని అన్నారు.

అయ్యన్నపాత్రుడు

'లోకల్, నాన్‌లోకల్ కాదు... డబ్బున్నోడు, లేనోడు’

"విశాఖ జిల్లా రాజకీయాల్లో స్థానికుడిగా 1983 నుంచి ఉన్నాను. అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. రాజకీయాలన్ని ధనం చుట్టే తిరుగుతున్నాయి" అని మాజీ ఎమ్మేల్యే అయ్యన్నపాత్రుడు బీబీసీతో అన్నారు.

"ఓటుకి డబ్బు తీసుకోవడం ప్రజల తప్పా? ఇవ్వడం నాయకులం తప్పా? అంటే దానికి ఎవరం సమాధానం చెప్పలేం. డబ్బుతోనే రాజకీయాలు నడుస్తున్నాయి. డబ్బు లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులున్నాయి. అందుకే డబ్బులున్న వారికే పార్టీలు టిక్కెట్లు ఇస్తున్నాయి. ఏ పార్టీ అయినా అదే చేస్తుంది. అందుకే లోకల్, నాన్ లోకల్ అని కాకుండా డబ్బున్నోడు, డబ్బులేనోడు అనేదే రాజకీయాల్లో చూస్తున్నారు. విశాఖలో ఆర్థికంగా బలంగా ఉన్న స్థానిక నాయకులు తక్కువ. అందుకే స్థానికేతరులైనా...ఆర్థికంగా బలంగా ఉన్న వారికే టిక్కెట్లు దక్కుతున్నాయి. అన్ని పార్టీలు కూడా నిజాయితీగా ఉన్నవారికే టిక్కెట్లు ఇస్తే ఈ సమస్య పరిష్కారమవుతుంది" అని అన్నారు.

'సమాన అవకాశాలు కల్పించాలి'

విశాఖను రాజకీయంగా సేఫ్ జోన్‌గా భావించి స్థానికేతర నాయకులు అంతా విశాఖ నుంచి పోటీ చేస్తారని సీనియర్ జర్నలిస్ట్, విశాఖ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు గంట్లా శ్రీనుబాబు బీబీసీతో అన్నారు.

"విశాఖ అంటే విద్య, వైద్యం, పరిశ్రమలు, ఉద్యోగం...ఇలా అన్ని అవకాశాలు ఉన్న నగరం. ఎంపీలే కాదు, ఎమ్మెల్యేలలోనూ స్థానికేతరులు ఎక్కువ మందే ఉన్నారు. కొందరు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా అయ్యారు. విశాఖ భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అవంతి శ్రీనివాస్ పర్యాటకశాఖ మంత్రి అయ్యారు. అవంతి శ్రీనివాస్ పశ్చిమ గోదావరి వాసి. అలాగే గతంలో విశాఖ ఎంపీగా ఎన్నికైన పురందేశ్వరి కూడా కేంద్రమంత్రిగా పని చేశారు. ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (ప్రకాశం), తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు (కృష్ణా జిల్లా), మాజీ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు(కృష్ణా జిల్లా), చింతలపూడి వెంకటరమణ (పశ్చిమ గోదావరి), అరకు ఎంపీగా పని చేసిన కొత్తపల్లి గీత (తూర్పు గోదావరి) వీరంతా స్థానికేతరులే’’ అని అన్నారు.

''సరాసరి చూసుకుంటే విశాఖలో 70 నుంచి 80 శాతం స్థానికేతరులే ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉంటున్నారు. ప్రస్తుత విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, మాజీ ఎమ్మెల్యేలు అయ్యన్న పాత్రుడు, పల్లా శ్రీనివాసరావు, మళ్ల విజయ్ ప్రసాద్ వంటి కొందరు స్థానిక నేతలు మాత్రమే విశాఖ రాజకీయాల్లో రాణిస్తున్నారు. స్థానికులకి అవకాశాలు రావడంలేదని కొందరిలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ... రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రం చిన్నదైపోవడంతో ఇప్పుడు స్థానికతను పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే రాజకీయ పార్టీలు కూడా స్థానికులకి, స్థానికేతరులకి సమాన అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Visakhapatnam has become a paradise for non local leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X