ప్రధానమంత్రి భద్రత ఎలా మారుతూ వచ్చింది?

1967లో కాంగ్రెస్ పార్టీ ఒడిశాలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. అదే సమయంలో గుంపులోంచి కొందరు స్టేజి పైకి రాళ్లు విసరడం మొదలుపెట్టారు. ఆ సమయంలో స్టేజీ పై ప్రసంగం ఇస్తున్న మహిళకు రాయి తగిలి ముక్కు లోంచి రక్తం రావడం మొదలయింది. ఆమె ఆ రక్తాన్ని తుడుచుకుని ప్రసంగాన్ని కొనసాగించారు.
ఆ మహిళ మరెవరో కాదు, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ. అదే ఇందిరా గాంధీ 1984లో తన బాడీ గార్డుల చేతిలో హతమయ్యారు.
దేశంలో ప్రధాని భద్రత చాలా కీలకమైన అంశం. ప్రధాని భద్రతలో కాలానుగుణంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.
కానీ, పంజాబ్‌లో ఫ్లైఓవర్ పై ఇటీవల ప్రధాని మోదీ కాన్వాయ్ ఆగిపోయినప్పుడు ప్రధాని భద్రత అంశం మళ్ళీ తెర పైకి వచ్చింది.
ఇది దేశమంతటా చర్చనీయాంశమైంది.
అయితే, ప్రధాని భద్రతకు బాధ్యులెవరు? భద్రత కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
ప్రధాని మోదీ ఎన్నికలు జరగనున్న ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
పంజాబ్ లోని ఫిరోజ్పూర్లో ఒక ర్యాలీ జరగాల్సి ఉంది.
ఆయన హెలీకాఫ్టర్‌పై ప్రయాణించాల్సి ఉంది. కానీ, వాతావరణం బాగుండకపోవడంతో రోడ్డు మార్గంలో వెళ్లాలని అనుకున్నారు. ప్రధాని ప్రయాణానికి కావల్సిన భద్రతా ఏర్పాట్లను చేశామని పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రకటించిన తర్వాత ప్రధాని వాహనాలు బయలుదేరాయి.
కానీ, ప్రధాని కాన్వాయ్‌ను కొంత మంది నిరసనకారులు అడ్డుకోవడంతో వాహనాలను బ్రిడ్జిపై నిలిపేయాల్సి వచ్చింది.
పోలీసులు నిరసన చేస్తున్న వారిని ట్రక్కుల నుంచి దించి ర్యాలీని ఆపాలని ప్రయత్నించారు.
ప్రధాని పాకిస్తాన్‌కు 30 కిలోమీటర్ల దూరంలో చిక్కుకుని ఉండిపోయారు. ఆయన కారు సుమారు 15-20 నిమిషాల సేపు బ్రిడ్జి పై నిలిచిపోయింది.
- ప్రధాని మోదీ ప్రారంభించిన కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రత్యేకతలేంటి
- వారణాసి: మోక్షానికే కాదు, శాకాహార భోజన ప్రియులకు కూడా స్వర్గధామంగా మారిన ప్రాచీన నగరం
ప్రధానికి భద్రత కల్పించే విషయంలో అటువంటి తప్పిదాలు ఎలా చోటు చేసుకున్నాయనే విషయం పై కాంగ్రెస్, బీజేపీల మధ్య విబేధాలు చోటు చేసుకున్నాయి.
కాంగ్రెస్ ప్రధాని పై చేయాలనుకున్న హత్యా యత్నం విఫలమయిందని బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌లో మోదీని ద్వేషించే వ్యక్తులు ప్రధాని భద్రతను విధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఖండించారు. మోదీ సమావేశానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కాలేదని, ఆ అవమానం తట్టుకోలేక కాంగ్రెస్ మీద ఆ పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని అన్నారు.
ఈ అంశాన్ని పక్కన పెడితే, ప్రధానికి భద్రత ఎవరు కల్పిస్తారు? దీనికి బాధ్యులెవరు అనే అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఇది తెలుసుకోవాలంటే ప్రధాని భద్రత గురించి చరిత్రలోకి తొంగి చూడాలి.
- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త కారు ధర ఎంత? రూ.12 కోట్లు కాదంటున్న అధికారులు
- సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్: పార్లమెంట్ కొత్త భవనంపై మోదీ సర్కారుకు అంత తొందర ఎందుకు

ప్రధాని భద్రత
1947లో పండిట్ నెహ్రూ భారత ప్రధాని అయినప్పుడు ఆయన ఓపెన్ కారులో ప్రయాణించేవారు. నెహ్రూ చాలా పేరు పొందిన నాయకుడైనప్పటికీ, ఆయన కూడా నిరసనలు, వ్యతిరేకత ఎదుర్కొనేవారు. కానీ, 1967లో ఇందిరపై రాళ్లు విసిరిన సంఘటన చోటు చేసుకున్న తర్వాత ప్రధాని భద్రతను పెంచారు. కానీ, 1984 భద్రతకు నిర్ణయాత్మకమైన సంవత్సరం.
ఇందిరా గాంధీ ప్రభుత్వం అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ దగ్గర ఆపరేషన్ బ్లూ స్టార్ మొదలుపెట్టింది. ఇందిరా గాంధీ 1984లో చేసిన ఒక ప్రసంగంలో, "ఈ రోజు నేనిక్కడ ఉన్నాను. రేపు ఉండకపోవచ్చు. కానీ, నేను బ్రతికున్నంత వరకూ నా ప్రతీ రక్తపు బొట్టును ఈ దేశాన్ని దృఢంగా చేసేందుకే వెచ్చిస్తాను" అని చెప్పారు.
ఆ మరుసటి రోజే 1984 అక్టోబరు 31న ఇందిరా గాంధీ తన సొంత బాడీ గార్డుల చేతిలో కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయారు.
ఆమె మరణం తర్వాత దేశ రాజధానిలో హింస చోటు చేసుకుంది. అల్లర్లు చెలరేగాయి. దీంతో, దేశవ్యాప్తంగా శాంతి భద్రతల సమస్య చర్చకొచ్చింది.
1985లో ప్రధాని భద్రత చూసేందుకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌ను నియమించారు. 1988లో పార్లమెంట్ ఎస్పీజీ చట్టాన్ని ఆమోదించింది.
ఒంటికి నల్లని సూట్లు, కళ్ళకు గాగుల్స్, ధరించి తుపాకులు పట్టుకుని చేతిలో వాకీ టాకీలు, చెవిలో ఇయర్ ఫోన్ లతో ప్రధాని పక్కన సిబ్బందిని చూసి ఉంటారు. వారే ఎఎస్పీజీఅధికారులు. వారికి చాలా రకాల శిక్షణను ఇచ్చి ఎంపిక చేస్తారు.
దేశ ప్రధాని భద్రతను కాపాడే బాధ్యత ఎస్పీజీ పై ఉంటుంది. వీరు మాజీ ప్రధాని, వారి కుటుంబ భద్రతను కూడా చూడాలి.
ఎస్పీజీ అధికారులు ప్రధానిని నీడలా వెన్నంటి ఉండాలి. ఎస్పీజీ ప్రధాని భద్రతా ఏర్పాట్లను పరిపాలన అధికారులతో కలిసి ప్రణాళిక చేస్తుంది.
ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీకి కూడా ఇటీవల కొంత కాలం వరకు ఎస్పీజీ భద్రత లభించేది. కానీ, మోదీ ప్రభుత్వం ఈ భద్రతను ఉపసంహరించింది. ఇది కేవలం బీజీపీ ప్రతీకారంతోనే చేస్తున్న చర్య అని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రస్తుతం గాంధీ కుటుంబానికి జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత లభిస్తోంది.
- ప్రధాన మంత్రి భద్రత ఎలా ఉంటుంది? పంజాబ్ పర్యటనలో పొరపాటు ఎలా జరిగింది?
- 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ మీద చిక్కుకుపోయిన ప్రధాని మోదీ

రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏంటి?
ఇటీవల భారత ప్రధాని 12 కోట్ల విలువైన కారు కొనుక్కున్నారు. దీనికి మిశ్రమ స్పందనలు వెల్లువెత్తాయి. భద్రతా కారణాల రీత్యా ఈ వాహనాన్ని కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం చెప్పింది.
ప్రధాని పర్యటనకు ముందు భద్రతను ప్రణాళిక చేసే విధానం గురించి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి బీబీసీకి వివరించారు.
ప్రధానికి ఎస్పీజీ భద్రత కల్పిస్తుంది. కానీ, మిగిలిన భద్రత వహించే బాధ్యత ఆ రాష్ట్ర పోలీసులది.
పర్యటనకు ముందే ఎస్పీజీ బృందం రాష్ట్రానికి వెళతారు. సెక్యూరిటీ బ్యూరో, పోలీసులు, స్థానిక పరిపాలనాధికారులు కలిసి ప్రధానికి భద్రత కల్పించే బాధ్యత తీసుకుంటారు.
రాష్ట్ర పోలీసుల బాధ్యత ఏంటి?
1. ప్రధాని పర్యటనకు ముందే ఆ ప్రయాణ మార్గాన్నిసుగమం చేయడం
2. ప్రధాని ప్రసంగ వేదిక దగ్గర భద్రత కల్పన
3. ప్రయాణంపై దృష్టి పెట్టి, ఏదైనా ఆటంకం వస్తే వెంటనే దానిని తొలగించాలి.
ఈ ప్రణాళిక అంతా కేవలం కాగితంపై ఉండదు. పర్యటనకు ముందే మాక్ డ్రిల్ జరుగుతుంది. ప్రధాని పర్యటన, వసతికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తారు.
ప్రధాని హెలీకాఫ్టర్ పై ప్రయాణిస్తే, వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తారు. ఈ నిబంధనలన్నీ ఎస్పీజీ బ్లూ బుక్‌లో పొందుపరిచి ఉంటాయి. ఎస్పీజీ కి రూ. 375కోట్ల వార్షిక బడ్జెట్ ఉంటుంది. దీనిని దేశంలో ప్రధాన భద్రతా కేంద్రంగా చూస్తారు.
- భద్రతా ఏర్పాట్లలో లోపం, 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ మీద చిక్కుకుపోయిన ప్రధాని మోదీ
- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త కారు ధర ఎంత? రూ.12 కోట్లు కాదంటున్న అధికారులు

మోదీ భద్రత పై వివాదం
మోదీ పర్యటన సమయంలో నిరసనకారులు రోడ్డు పై ఆటంకం కలుగచేయడంతో, మోదీ కాన్వాయి వెనుతిరిగింది.
భటిండా ఎయిర్ పోర్టు చేరిన తర్వాత స్థానిక పోలీసులతో మాట్లాడుతూ, "ముఖ్యమంత్రికి ధన్యవాదాలు, నేను ప్రాణాలతో తిరిగి వచ్చాను" అని అన్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి.
ఈ అంశం పై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. పంజాబ్ ప్రభుత్వం కూడా తామేమి తప్పు చేయలేదని పేర్కొంటూ విచారణకు ఆదేశించింది.
ఈ విషయంలో పంజాబ్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మాజీ ఉత్తర్ ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విక్రమ్ సింగ్ అభిప్రాయపడ్డారు.
"ప్రధాని అకస్మాత్తుగా తన ప్రణాలికను మార్చుకున్నారు. దారి మారిందనుకుందాం. నిరసనకారులు అకస్మాత్తుగా రారు. వారు ముందుగానే ప్రణాళిక చేసుకుని ఉంటారు. వారిని ఆపి ఉండాల్సింది, కానీ, వారిని ఆపలేదు" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- సింధుతాయి సప్కాల్: అనాథల అమ్మ ఇక లేరు... చేతిని ముంగిస కొరికేస్తున్నా ఆమె ఓ కాగితం కోసం ఎందుకంత పోరాటం చేశారు?
- 2022లో తొలి క్షిపణి ప్రయోగం చేపట్టిన ఉత్తర కొరియా
- ఒమిక్రాన్: తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రోజులో కేసులు రెట్టింపు, మూడో వేవ్ మొదలైందా
- తెలంగాణ: జీఓ 317 ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
- జేపీ నడ్డా విమర్శలపై కేటీఆర్: 'అవును, కేసీఆర్ ఏటీఎం... అన్నదాతలకు తోడుండే మెషీన్'
- ఆర్ఆర్ఆర్కు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దు -హైకోర్టులో పిల్ : ప్రెస్ రివ్యూ
- మోదీ ప్రభుత్వ చర్యలతో ఎన్జీఓలు ఇరకాటంలో పడ్డాయా, ఆరెస్సెస్ అనుబంధ సంస్థలను కూడా ఎందుకు వదల్లేదు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)