వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

భారత్‌తో స్నేహ సంబంధాలు కొనసాగించే దేశాలకు భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే ఆకాశ్ క్షిపణిని ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం బుధవారం అనుమతులు ఇచ్చింది.

రక్షణ సంబంధిత ఎగుమతులకు వెంటనే అనుమతులు లభించేలా రక్షణ మంత్రి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేశారు.

missile

ఆకాశ్ క్షిపణి దాడి సామర్థ్యం 25 కిలోమీటర్లు. 2014లో ఈ మిసైల్‌ను భారత వైమానిక దళం అమ్ములపొదిలో చేర్చారు. ఆ తర్వాత ఏడాదికి 2015లో దీనిని భారత పదాతిదళానికి అందించారు.

గత కొన్నేళ్లుగా నిర్వహించిన అంతర్జాతీయ ప్రదర్శనల్లో, డిఫెన్స్ ఎక్స్‌పోలు, ఎయిరో ఇండియా సందర్భంగా కొన్ని మిత్ర దేశాలు ఆకాశ్ మిసైల్‌పై ఆసక్తి చూపించాయని రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పింది. దానితోపాటూ తీర నిఘా వ్యవస్థలు, రాడార్, ఎయిర్ ప్లాట్‌ఫాంలు కూడా దీనిపై ఆసక్తి చూపిస్తున్నాయి

కానీ, ఈ క్షిపణిని ఎగుమతి చేసే దిశగా బారత్ ఎందుకు అడుగులు వేస్తోంది అనే ప్రశ్న కూడా వస్తోంది.

ఈ క్షిపణి ప్రత్యేకత ఏంటి

భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి ఆకాశ్. ఇది 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. అంతే కాదు, ఇది 95 శాతం భారత్‌లోనే తయారైన క్షిపణి. దాదాపు 25 ఏళ్లుగా దీనిని అభివృద్ధి చేశారు.

ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలో భారత్ ఏయే దేశాలకు ఈ క్షిపణిని విక్రయిస్తోంది అనే వివరాలు లేవు.

అయితే, ఆకాశ్ మిసైల్‌ను మిత్ర దేశాలకు విక్రయిస్తామని ప్రభుత్వం కచ్చితంగా చెప్పింది. అంతే కాదు, తాము ఎగుమతి చేయబోయే ఈ క్షిపణి భారత వైమానిక దళం, సైన్యం దగ్గరున్న క్షిపణి కంటే భిన్నంగా ఉంటుందని కూడా చెప్పింది.

ఈ మిసైల్‌ను వియత్నాం, థాయ్‌లాండ్ లాంటి దేశాలకు విక్రయించే అవకాశం ఉందని రక్షణ నిపుణులు రాహుల్ బేడీ చెప్పారు.

"మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా దేశాలకు ఆకాశ్, బ్రహ్మోస్ క్షిపణులు ఎగుమతి చేస్తామని మోదీ ప్రభుత్వం 2016లో చెప్పింది. భారత్‌తో ఏ దేశాల సంబంధాలు మెరుగ్గా ఉంటే, వాటికి ప్రభుత్వం ఈ మిసైళ్లను అమ్ముతుంది. ఈ క్షిపణిని వియత్నాంకు విక్రయిస్తామని 2016, 2017లో కూడా చెప్పారు. ఆకాశ్ రేంజ్ 25 కిలోమీటర్లు. దీనితో ఇన్‌కమింగ్ హెలికాప్టర్, ఫైటర్ ప్లేన్, కొన్ని మిసైల్ సిస్టంలను పేల్చేయవచ్చు" అన్నారు.

రక్షణ ఎగుమతిదారుగా మారే సన్నాహాల్లో భారత్

రక్షణ ఎగుమతుల పరిశ్రమలో 2024 నాటికి 5 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని అందుకోవాలని భారత్ నిర్ణయించింది. కానీ ప్రపంచమంతా భారత్‌ను ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశంగా చూస్తోంది.

గత ఆరేడు నెలలుగా చైనాతో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దీంతో భారత డిఫెన్స్ ప్రొడక్షన్, దేశీయ అవసరాలనే తీర్చలేకపోతోందని రాహుల్ బేదీ చెప్పారు.

"నిజానికి, మనం మందుగుండు, మిసైల్ సిస్టంలను దిగుమతి చేసుకుంటున్నాం. అలాంటి సమయంలో ఎగుమతి గురించి మాట్లాడుతుంటే, నాకు కాస్త అతిగా అనిపిస్తోంది. ఎందుకంటే మన దేశీయ అవసరాలే పూర్తిగా తీరడం లేదు. అలాంటప్పుడు ఎగుమతుల గురించి ఎలా మాట్లాడుతారో" అని ఆయన అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల లావాదేవీలను నిశితంగా పరిశీలించే థింక్ ట్యాంక్ స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించిన ఒక రిపోర్ట్ ప్రకారం 2015-2019 మధ్యలో భారత్ ప్రపంచంలో ఆయుధాలను దిగుమతి చేసుకునే రెండో అతిపెద్ద దేశంగా నిలిచింది.

అంతేకాదు, రక్షణ పరికరాల దిగుమతి, ఎగుమతి అనేది ఆ పరికరాల కంటే ఎక్కువగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు, శక్తి సమతుల్యం, ఎగుమతి చేసే, దిగుమతి చేసుకునే దేశాల ఆంతరంగిక రాజకీయాలపై ఆధారపడి ఉంటుంది.

ప్రపంచంలో ఆయుధాలు భారీగా ఎగుమతి చేసే దేశాల్లో ఒక ప్రత్యేక వాతావరణం ఉంటుంది. ఆయుధాల ఎగుమతికి అది తగినదని రుజువు చేస్తుంది.

అలాంటప్పుడు, భారత్ ఆయుధాల ఎగుమతి చేసే దేశాల మధ్య నిలదొక్కుకునేలా అలాంటి ఎకో-సిస్టమ్‌ను తయారు చేసుకోగలదా అనే ప్రశ్న వస్తుంది.

పెద్ద లక్ష్యం దిశగా మొదటి అడుగు

ఆకాశ్ మిసైల్ ఎగుమతులను ఆమోదించడాన్ని ఒక పెద్ద లక్ష్యం దిశగా మనం వేసే తొలి అడుగుగా వర్ణించారు రక్షణ అంశాల నిపుణులు సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ సి.ఉదయ్ భాస్కర్.

"క్షిపణుల ఎగుమతి వ్యాపారం ఒక జటిలమైన రంగం. మనం అందులో తొలి అడుగు వేస్తున్నాం. ఎన్ని దేశాలు భారత్ నుంచి ఆకాశ్ క్షిపణిని కొనుగోలు చేస్తాయో ఇప్పుడు చూడాలి. ఎందుకంటే రక్షణ ఎగుమతుల కోసం చాలా ప్రత్యేకమైన ఒక నైపుణ్యం సాధించాల్సి ఉంటుంది. భారత్ తన క్షిపణులు, ఫిరంగులు, ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్లు, తుపాకులతో ఇంకా ఆ నైపుణ్యం సాధించినట్లు నిరూపితం కాలేదు".

"భారత్ మీద ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు భారత్ ఈక్వెడార్‌కు కొన్ని హెలికాప్టర్లు అమ్మింది. కానీ మనం వాటి ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ సరిగా ఇవ్వలేకపోయాం. దాంతో, ఆ కాంటాక్ట్ ముందుకు సాగలేదు. అంటే, ఒక మంచి ప్రొడక్ట్‌ అవసరం ఎక్కడుందో, ఆ మార్కెట్లోకి భారత్ దానిని తీసుళ్లుంటే, కొనుగోలుదారులు దానిపై సంతృప్తిగా ఉంటే, మన ఉత్పత్తులు మెల్లమెల్లగా మొత్తం దక్షిణ అమెరికా అంతటా వ్యాపించి ఉండేవి. కానీ, అలా జరగలేదు" అన్నారు ఉదయ్.

"అంటే మన ఉత్పత్తి సరిగా లేదు, లేదా దాని ధర సరిగా లేదని అర్థం. లేదంటే మనం మూడేళ్లలో ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కోసం అవసరమైన పరికరాలు లేదా ఎకో-సిస్టమ్ రూపొందించలేదు. అందుకే, భారత్ ప్రస్తుతం చేపట్టిన చర్యలను ఒక ప్రారంభంగా అనుకోవచ్చు".

కానీ, 2024 నాటికి భారత ఆయుధ ఎగుమతులను 5 బిలియన్ డాలర్లకు చేర్చాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

యూరప్ నుంచి భారత్ ఏం నేర్చుకుంది

సంప్రదాయ ఆయుధాల మార్కెట్‌లో అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్ ఆధిపత్యం చూపిస్తున్న సమయంలో భారత్ ఆయుధాల ఎగుమతిలోకి అడుగుపెడుతోంది. భారత్ ఈ మార్కెట్‌లో నిలదొక్కుకోవాలంటే ఆయా దేశాల తీరు, వ్యూహాత్మక సామర్థ్యం, అనుభవంతో పోటీపడాల్సి ఉంటుంది.

కానీ, ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా యుద్ధం చేసే శైలి కూడా వేగంగా మారుతోంది. సంప్రదాయ యుద్ధాల్లో డ్రోన్లు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వేగంగా పెరుగుతోంది. ఎన్నో చిన్న చిన్న యూరోపియన్ దేశాలు ఆ దిశగా పనిచేసి ప్రపంచస్థాయి ఎగుమతిదారుగా నిలదొక్కుకునే పనిలో ఉన్నాయి.

అలాంటప్పుడు భారత్ రక్షణ ఎగుమతులు పెంచడానికి సంప్రదాయ యుద్ధంలో వినియోగించే ఆయుధాలవైపు వెళ్తుందా, లేక తన సాఫ్ట్‌వేర్ సామర్థ్యం ఉపయోగించి అత్యాధునిక ఆయుధాలు, వాటిని అడ్డుకునే సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌లు తయారు చేస్తుందా.

మనం క్షిపణులు అభివృద్ధి చేసినా, హెలికాప్టర్లు తయారుచేసినా, మన ఉత్పత్తులపై ప్రపంచానికి ఒక నమ్మకం కలగాలి. మన దగ్గర అదే సమస్య. విశ్వసనీయమైనది అని చెప్పుకోడానికి మన దగ్గర ఒక్క ఉత్పత్తి కూడా లేదు. అయితే, చాలా ఉత్పత్తులు ఇంకా పైప్‌లైన్‌ దశలోనే ఉన్నాయి.

"ఆయుధాల డిజైన్, విక్రయాలు, సర్వీస్ ఎలా ఉండాలో.. అలాంటి ఎకో సిస్టమ్‌ను మన దేశం ఇప్పటివరకూ తయారు చేసుకోలేదు. ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కానీ, మన కంటే ముందున్న చిన్న చిన్న దేశాలు స్వయంగా ప్రత్యేక సాంకేతికతను రూపొందించుకున్నాయి. తూర్పు యూరప్‌లో ఒకటైన చెకొస్లొవేకియా కూడా ఒక్కో ఉత్పత్తిని అభివృద్ధి చేస్తూ, ప్రపంచంలో నంబర్ వన్ అయిపోయింది. భారత్ కూడా ఆ దిశగా పనిచేయాల్సి ఉంటుంది" అంటారు ఉదయభాస్కర్.

చాలా తెలివిగా ముందుకెళ్లాలి

ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఇప్పుడు ముందుకు ఎలా వెళ్లడం అవసరమనేది భారత్ తెలుసుకోవాల్సి ఉంటుందని ఉదయభాస్కర్ అన్నారు.

"పబ్లిక్ సెక్టార్ యూనిట్ సిస్టంలో ఎగుమతులకు తగినట్లు ఉత్పత్తులు చేయడమనేది కాస్త కష్టం అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎయిర్ ఇండియాను ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత మెరుగైన ఎయిర్ లైన్ కంపెనీగా భావించేవారు. కానీ, ఈరోజు దానిలో పెట్టుబడుల ఉపసంహరణ గురించి మాట్లాడుకుంటున్నారు".

మనం రక్షణ ఎగుమతుల విషయానికి వస్తే... అమెరికా, మిగతా దేశాల్లో యుద్ధ విమానాలు తయారు చేసే కంపెనీల్లా, మనకు బలమైన మార్కెటింగ్, సేల్స్, పిచ్, సెల్లింగ్ ఫోర్స్ ఉండాలి. మన కంపెనీలు అక్కడకు చేరడానికి చాలా డబ్బు ఖర్చుచేయాలి, దానికి చాలా దశాబ్దాలు పడుతుంది.

అలాంటప్పుడు, మనం ఏ ఉత్పత్తితో ఆధిపత్యం సాధించవచ్చు అని భారత్ చాలా తెలివిగా, పరిపక్వతతో ఆలోచించాలి. ఉదాహరణకు, కంట్రోల్ సిస్టమ్ తయారు చేయగలిగే సామర్థ్యం భారత్‌లో చాలా ఎక్కువ. దానినే మరింత ముందుకు తీసుకెళ్లి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, 5జీ లాంటి రంగాల్లోకి వెళ్లాలి. మన ఇంజనీర్లు ఐఐటీల్లో చదివి వస్తున్నారు. కానీ, ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలకు వెళ్లి డిజైన్ చేస్తున్నారు. దానివల్ల భారత్‌కు ఏ ప్రయోజనం కలగడం లేదు. ఈ పెద్ద కంపెనీల్లో ఆర్ అండ్ డీ లాబ్స్ కూడా భారత్‌లోనే ఉన్నాయి. ఇవి, ఒకటి బెంగళూరులో, ఇంకొకటి హైదరాబాద్‌లో ఉన్నాయి. అందుకే, మనం ఇలాంటి ఎకో-సిస్టమ్ అభివృద్ధి చేయాలి.

డ్రోన్ అయినా, వేరే ఏ సాంకేతికత అయినా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి రంగంలో చొరవ చూపే దేశంగా మనకు ప్రయోజనం లభించవచ్చు. లేదంటే మరో అడుగు ముందుకేసి డ్రోన్ డిస్‌రప్షన్‌ దిశగా పనిచేయాలి. ఎందుకంటే, ప్రతి టెక్నిక్‌నూ అడ్డుకునే సాంకేతికత ముందుకు వస్తోంది. ఆ దిశగా భారత్ మెరుగ్గా పనిచేయగలదు, కానీ, ఈ రంగాల్లో నిలదొక్కుకోవాలంటే, మనకు మానవ వనరుల అవసరం ఉంటుంది. అంటే, ఈరోజు మొదలుపెడితే, మరో పదేళ్ల తర్వాతైనా, మనకు దానిని ఎగుమతి చేసే సామర్థ్యం అందుతుంది.

కానీ, రక్షణ ఎగుమతుల రంగంలో ప్రవేశించడానికి వ్యూహాత్మక సత్తాను చాటుకుంటుందా, లేక అంతర్గత రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటుందా అనే ప్రశ్నకు భారత ప్రభుత్వం మాత్రమే సమాధానం చెప్పగలదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
India to sell the 'Akash' missile to foreign countries
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X